గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కేరళ సీఎం పాత్ర..విచారణలో సంచలన విషయాలు బయటపెట్టిన సప్నా సురేష్

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కేరళ సీఎం పాత్ర..విచారణలో సంచలన విషయాలు బయటపెట్టిన సప్నా సురేష్

Gold case కేరళలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు భారీ షాక్‌ తగిలింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారం.. అటు, ఇటు తిరిగి సీఎం పినరయి విజయన్ మెడకు చుట్టుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న స్వప్న సురేష్.. కస్టమ్స్‌ అధికారుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించింది. గోల్డ్‌, డాలర్‌ స్మగ్లింగ్‌ కేసులో సీఎం పినరయి విజయన్‌ పాత్ర ఉందని.. ఆయన స్వయంగా కాన్సులేట్‌ జనరల్‌తో మాట్లాడారని ఆమె కస్టమ్స్‌ అధికారులకు తెలిపారు.

స్మగ్లింగ్ వ్యవహారంలో సీఎంతో పాటు ముగ్గురు మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ ప్రమేయం కూడా ఉన్నట్లు సప్నా సురేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ను కస్టమ్స్ అధికారులు శుక్రవారం(మార్చి-5,2021)కేరళ హైకోర్టుకి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో స్వప్ప సురేష్ కేవలం మధ్యవర్తి మాత్రమేనని అందులో పేర్కొన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ జనరల్‌తో నేరుగా మాట్లాడటానికి..సీఎం పినరయి విజయన్‌కు అరబిక్ భాష రాకపోవడం వల్ల ఆయన ఆ భాష తెలిసిన స్వప్న సురేష్‌ సహాయాన్ని తీసుకున్నారని, ముఖ్యమంత్రికి- కాన్సులేట్‌ జనరల్‌కి మధ్య మధ్యవర్తిగా మాత్రమే స్వప్న సురేష్‌ వ్యవహించారని ఈ అఫిడవిట్‌లో పొందుపరిచినట్లు సమాచారం. ఈ డీల్‌లో సీఎం, మిగతా ముగ్గురు మంత్రులు,స్పీకర్ కు కోట్ల రూపాయల మేర కమిషన్ అందిన విషయాన్ని విచారణ సందర్భంగా స్వప్నా సురేష్ స్పష్టం చేశారని కస్టమ్స్ కమిషనర్ సుమిత్ కుమార్ ఈ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాజీ కార్యదర్శి ఎం శివశంకర్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా స్వప్న సురేష్ తమ విచారణ సందర్భంగా వెల్లడించినట్లు కస్టమ్స్ కమిషనర్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు తేలింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

ఏప్రిల్-6న కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న వేళ ఈ వ్యవహారం.. ప్రస్తుతం కేరళ రాజకీయాల్లో భూకంపాన్ని పుట్టించినట్టయింది. పినరయి విజయన్ సారథ్యంలోని అధికార ఎల్డీఎఫ్ విజయావకాశాలను ఈ వ్యవహారం దెబ్బకొడుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ఉదంతంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ ప్రతిపక్ష నాయుకుడు రమేశ్‌ చెన్నితాలా మాట్లాడుతూ.. ‘గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో మొదటి నుంచి మేం ఏం ఊహించామో అదే జరిగింది. ఈ కేసులో ముఖ్యమంత్రికి సంబంధం ఉందని మేం ముందే గుర్తించాం. దీనికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు అన్నారు. ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని, రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన తెలిపారు.