ఫోని తుఫాన్ : ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

  • Published By: madhu ,Published On : May 1, 2019 / 06:58 AM IST
ఫోని తుఫాన్ : ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ఫోని తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కనిపిస్తోంది. తుని, అమలాపురం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, కాకినాడలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మే 02వ తేదీ గురువారం అతి భారీ వర్షాలు కూడా ఉంటాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో తీరం వెంబడి గంట‌కు 80- 90 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచే అవ‌కాశ‌ం ఉంది. మే 3వ తేదీన తుఫాన్ తీరం దాటే సమయంలో కూడా ఆయా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది. తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని తెలిపింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి వచ్చేయాలని పేర్కొంది. మే 2, 3 తేదీల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణశాఖ.
Also Read : పెను తుఫాన్ గా ఫోని : తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో గాలులు

మే 2, 3 తేదీల్లో శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయి. విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఒక మోస్తరు వ‌ర్షాలు కురిసే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి. తుఫాను గమనాన్ని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. 

ప్రభావిత మండలాలు : – 
శ్రీకాకుళం జిల్లా :
 గార‌, ఇచ్ఛాపురం, క‌విటి, కంచిలి, సోంపేట‌, మంద‌స‌, సంత‌బొమ్మాళి, ప‌లాస‌, పొలాకి, నందిగాం, వ‌జ్రపుకొత్తూరు, శ్రీకాకుళం
విజ‌య‌న‌గ‌రం: భోగాపురం, చీపురుప‌ల్లి, డెంకాడ‌, గ‌రివిడి, గుర్ల‌, నెల్లిమ‌ర్ల‌, పూస‌పాటిరేగ‌
విశాఖ‌ప‌ట్నం :  భీమునిప‌ట్నం

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుఫాను తీవ్ర రూపం దాల్చింది. పెనుతుఫానుగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతోంది. క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. ఒడిశాలోని పూరీకి 710 కిలోమీటర్లు, విశాఖకు 460 కిలోమీటర్లు, మచిలీపట్నంకి 454 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.