పెను తుఫాన్ గా ఫొని : తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో గాలులు

  • Published By: madhu ,Published On : May 1, 2019 / 07:28 AM IST
పెను తుఫాన్ గా ఫొని : తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో గాలులు

పెను తుఫాన్ గా మారింది ఫొని. తీరం దాటే సమయంలో.. 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ఒడిశా రాష్ట్రం వణుకుతోంది. గోపాల్ పూర్ – చాంద్‌బలి మధ్య మే 3వ తేదీన తీరం దాటనున్నట్లు ప్రకటించింది వాతావరణ శాఖ. ఒడిశాలోని 11 జిల్లాల్లోపై తుఫాన్ ప్రభావం ఉండనుంది. ప్రచండమైన గాలులతో చెట్లు కూలిపోతాయి. విద్యుత్ స్థంబాలు నేలకూలుతాయి అని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు.
Also Read : ఫోని తుఫాన్ : ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ఆయా జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉండటంతో పాటు సెల్ ఫోన్ సిగ్నలింగ్ పని చేయదని వెల్లడించింది. రోడ్లు ధ్వంసం కావడంతో రవాణా వ్యవస్థపై ప్రభావం చూపనుంది. రేకులు, పూరిళ్లు కూలిపోతాయని.. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు అధికారులు.

పెను తుఫాన్ ఒడిశా తీరాలపై భారీ విధ్వంసం సృష్టించే ప్రమాదం పొంచి ఉందని అంచనా వేశారు. దీంతో NDRF బృందాలు రంగంలోకి దిగాయి. నౌకాదళం, తీరప్రాంత రక్షణ దళం, విపత్తు నిర్వాహణ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఒడిశాలోని గంజాం, ఖుర్దా, పూరీ, జగత్‌సింగ్ పూర్ ప్రాంతాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. 

ఈ పెనుతుఫాను మే 1వ తేదీ మధ్యాహ్నానానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. ఒడిశాలోని పూరీకి 680కిలో మీటర్లు, విశాఖకు 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మే 3న మధ్యాహ్నాం తీరం దాటే సమయంలో 205 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.