Dainik Bhaskar Group : దైనిక్ భాస్కర్ గ్రూపు రూ. 700 కోట్ల పన్ను ఎగవేత

ప్రముఖ మీడియా దిగ్గజం దైనిక్ భాస్కర్ గ్రూప్ రూ.700 కోట్ల పన్ను ఎగవేసినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. పన్నుఎగవేత ఆరోపణలతో గురువారం నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు దైనిక్ భాస్కర్ గ్రూపు సంస్ధలపై దాడులు చేశారు.

Dainik Bhaskar Group : దైనిక్ భాస్కర్ గ్రూపు రూ. 700 కోట్ల పన్ను ఎగవేత

Dainik Bhaskar Group It Raids

Dainik Bhaskar Group : ప్రముఖ మీడియా దిగ్గజం దైనిక్ భాస్కర్ గ్రూప్ రూ.700 కోట్ల పన్ను ఎగవేసినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. పన్నుఎగవేత ఆరోపణలతో గురువారం నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు దైనిక్ భాస్కర్ గ్రూపు సంస్ధలపై దాడులు చేశారు. మధ్యప్రదేశ్, భోపాల్ లో ఉన్న సంస్ధ యజమాని, ప్రమోటర్ల  ఇళ్లు ఆఫీసులతో పాటు ఆ సంస్ధకు దేశ వ్యాప్తంగా ఉన్న పలు టీవీ చానళ్లు, పత్రికా కార్యాలయాలు,  ఉద్యోగులు మేనేజర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో సంస్ధకు చెందిన ఉద్యోగుల పేరుతో పలు సూట్ కేస్ కంపెనీలు, సంస్ధలు నడుపుతూ పన్ను ఎగ్గోడుతున్నట్లు అధికారులు గుర్తించారు. సోదాలు ప్రారంభించినప్పుడు ఆ సమయంలో కార్యాలయాల్లో ఉన్న సిబ్బంది సెల్‌ఫోన్‌లను కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిని ఎవరినీ ఆఫీసు నుంచి బయటకు వెళ్లనివ్వలేదని తెలిసింది.

సంస్ధలోని చాలామంది ఉద్యోగులు వారి పేర్లు మీద వాటాలు ఉన్నట్లు కానీ, కంపెనీలు ఉన్నట్లుగా కానీ, తాము సంస్ధలో డైరెక్టర్లుగా కానీ ఉన్నట్లు తెలియదని చెప్పినట్లు ఆదాయపన్నుశాఖ విడుదలచేసిన ప్రకటనలో తెలిపింది. ఇటువంటి కంపెనీలు సృష్టించటం ద్వారా లిస్టెడ్ కంపెనీల నుంచి వచ్చే లాభాలను తగ్గించి చూపటం వంటి ఆర్ధిక నేరాలు చేయటానికి అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు.

గడిచిన 3 రోజులుగా జరిపిన సోదాల్లో  సంస్ధ సుమారుగా గడిచిన ఆరేళ్ల కాలంలో రూ. 700 కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు  పాల్పడినట్లు గుర్తించారు. అంతే కాకా సెబీ నిబంధనలను కూడా దైనిక్ భాస్కర్ గ్రూప్ ఉల్లంఘించిందని పూర్తి స్ధాయి పరిశోధన జరిగితే పన్నుఎగవేత ఇంకా ఎక్కువ కావచ్చని వారు తెలిపారు. బినామీ లావాదేవీల నిషేధచట్టాన్ని కూడా సంస్ధ ఉల్లంఘించినట్లు అధికారులు చెప్పారు.

దైనిక్ భాస్కర్ గ్రూప్ ప్రమోటర్లు మరియు ముఖ్య ఉద్యోగుల  ఇళ్లవద్ద మొత్తం 26 లాకర్లు గమనించామని వీటిలోని డాక్యు మెంట్లను పరిశీలిస్తున్నట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది. సంబంధం లేని వ్యాపారంలో రూ. 200 కోట్ల నుంచి  రూ. 2,200 కోట్ల రూపాయల వరకు నిధులు పంపిణీ జరిగనట్లు గుర్తించామని వీటిపై కూడా విచారణ జరిపి నిజానిజాలు నిర్ధారిస్తామని తద్వారా ఎంత మొత్తంలో పన్నులు ఎగ్గోట్టారు అనే లెక్క తేలుస్తామని ఆదాయపన్ను శాఖ అధికారులు వివరించారు.

కాగా…. ఈ దాడులపై   దైనిక్ భాస్కర్ తమ వెబ్ సైట్ లో ఒక స్టోరీ ప్రచురించింది. నిఖార్సైన జర్నలిజానికి ప్రభుత్వం భయపడిందని… గంగానదిలో శవాల గురించి… కరోనా మరణాల గురించి సరైన లెక్కలు ప్రజలకు తెలియచెప్పినందుకే   దైనిక్ భాస్కర్ గ్రూప్ పై ప్రభుత్వం అణచివేతకు పాల్పడిందని పేర్కోంది. అనేక రాష్ట్రాల్లో ఉన్న కరోనా పరిస్ధితులను మేము ప్రచురించాం. వాటివల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడ్డాయని తెలిపింది.