12 నుంచి 15 రైళ్లు ప్రారంభం.. టికెట్ల బుకింగ్ ఎప్పుడంటే?

  • Published By: srihari ,Published On : May 11, 2020 / 02:15 AM IST
12 నుంచి 15 రైళ్లు ప్రారంభం.. టికెట్ల బుకింగ్ ఎప్పుడంటే?

కరోనా వ్యాప్తితో ఇన్నిరోజులు నిలిచిపోయిన రైల్వే సర్వీసులు మళ్లీ పున:ప్రారంభం కానున్నాయి. ప్రయాణికుల రైళ్లను క్రమంగా పునరుద్ధరించడానికి భారతీయ రైల్వే రెడీ అయింది. మంగళవారం ( మే 12) నుంచి 15 జంట రైళ్లను (అప్ అండ్ డౌన్ 30 రైళ్లు) ప్రారంభించాలని నిర్ణయించింది. కొత్త ఢిల్లీ రైల్వేస్టేషన్ నుంచి దిబ్రూగడ్, అగర్తల, హవ్డా, పట్నా, బిలాస్పుర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావిల మధ్య నడవనున్నాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగా పరిగణిస్తారు. టికెట్ల బుకింగ్ సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి IRCTC వెబ్ సైట్ ద్వారా ప్రారంభమవుతాయి. దీని ద్వారానే ప్రయాణికులు టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వేస్టేషన్లలోని టికెట్ల కౌంటర్లు మాత్రం తెరుచుకోవు. ప్లాట్ ఫాం టికెట్లు సహా ఎలాంటి టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. 

కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే రైల్వేస్టేషన్లలోకి అనుమతించే అవకాశం ఉంది. స్క్రీనింగ్ కోసం ప్రయాణికులు కనీసం గంట ముందుగా స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది. ఈ రైళ్లలో జనరల్ బోగీలు ఉండవు. టికెట్లపై ఎలాంటి రాయితీలు ఉండవు. మధ్యలోని కొన్ని స్టేషన్లలో రైలు ఆగుతుంది. ఇవన్నీ ఏసీ రైళ్లే. సూపర్ ఫాస్ట్ రైళ్ల ఛార్జీలు వసూలు చేస్తారు. శ్రామిక్ స్పెషల్ రైళ్లలో బోగీకి 54 మంది ప్రయాణికులను అనుమతిస్తున్నారు.

వీటిలో పూర్తి సామర్థ్యం మేరకు 72 మందిని అనుమతిస్తారు. ఏసీ రైళ్లే అయినప్పటికీ ప్రయాణికులకు బెడ్ షీట్లు, దుప్పట్లు ఇవ్వరు. సాధారణం కన్నా కాస్త ఎక్కువగా ఉష్ణోగ్రత ఉండేలా చూస్తారు. స్వచ్ఛమైన గాలి అందేలా ఏర్పాట్లు చేస్తారు. ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవడం, ఫేస్ కవర్లను ధరించడం, థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవడం తప్పనిసరి. కరోనా వ్యాధి లక్షణాలు లేని ప్రయాణికులకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. 

ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ తప్పకుండా డౌన్‌లోడ్ చేసుకోవాలి. కేవలం ఢిల్లీలోనే రైళ్లు ప్రారంభమవుతాయా? లేదా బయట వైపు ఉన్న నగరాల నుంచి కూడా ప్రారంభమవుతాయా అన్నది తెలియాల్సి ఉంది. ఢిల్లీ నుంచి బయలు దేరిన రైళ్లే ప్రయాణం ముగించుకున్న తరువాత ఆయా నగరాల నుంచి బయలుదేరుతాయా అన్నది తేలాల్సి ఉంది. ప్రధాని సీఎంలతో సమావేశం కావడానికి ముందు రైల్వేశాఖ ఈ కీలక నిర్ణయం వెల్లడించింది. 

Read More :

రైలు ప్రయాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్…కరోనా లక్షణాలు లేనివారికి మాత్రమే అనుమతి

జూన్‌ తొలివారంలో రైళ్ల కూత.. ఆర్టీసీ బస్సులు నడిచేనా?