ఇక గ్లోబల్ టెండర్లు లేవు.. రూ. 200కోట్ల లోపు కొనుగోళ్లు భారత్‌లోనే!

  • Published By: vamsi ,Published On : May 13, 2020 / 12:46 PM IST
ఇక గ్లోబల్ టెండర్లు లేవు.. రూ. 200కోట్ల లోపు కొనుగోళ్లు భారత్‌లోనే!

Updated On : May 13, 2020 / 12:46 PM IST

200 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించి గ్లోబల్ టెండర్లు లేవని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఎంఎస్‌ఎంఈలకు మద్దతుగా ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె ప్రకటించారు.

రూ. 200 కోట్ల వరకు ప్రభుత్వ కొనుగోళ్ల విషయంలో గ్లోబల్ ప్రొక్యూర్‌మెంట్ టెండర్లను నిరోధించి, ఎక్కువగా భారతదేశ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వ్యాపారాన్ని పెంచే లక్ష్యంతో పనిచేయనున్నట్లు ఆమె ప్రకటించారు.

రూ. 200 కోట్ల విలువైన ప్రాజెక్టులలో ప్రభుత్వ సంస్థల టెండర్లు ఇకపై గ్లోబల్ కంపెనీలకు ఇవ్వకూడదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రభుత్వ కొనుగోళ్లలో ఇకపై రూ. 200 కోట్ల వరకు ఏ సేకరణ అయినా దేశీయంగానే ఉంటుందని, ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ గురించి ఆమె మాట్లాడుతూ వెల్లడించారు.

అలాగే ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకం కింద 41 కోట్ల జన్ ధన్ ఖాతాల్లోకి రూ. 52,606 కోట్లను బదిలీ చేశామని చెప్పారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు రూ. 30 వేల కోట్ల నిధులను విడుదల చేస్తామని చెప్పారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు రూ. 90 వేల కోట్ల సాయాన్ని అందించనున్నట్లు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 6 నెలల గడువును పెంచుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న టీడీఎస్ రేటును 25 శాతం తగ్గిస్తున్నామని, రేపటి నుంచి 2021 మార్చ్ 31 వరకు ఈ తగ్గింపు రేటు అమల్లో ఉంటుందని తెలిపారు.

రూ. కోటి పెట్టుబడి, రూ. 5 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలను మైక్రో కంపెనీలుగా గుర్తిస్తామని చెప్పారు. రూ. 10 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ రూ. 50 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలను చిన్న తరహా కంపెనీలుగా భావిస్తామని తెలిపారు. రూ. 20 కోట్ల పెట్టుబడి రూ. 100 కోట్ల టర్నోవర్ ఉండే కంపెనీలను మధ్య తరగతి కంపెనీలుగా పరిగణిస్తామని చెప్పారు.