వలసదారులకు సామూహిక కరోనా పరీక్షలు, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

కరోనా పరీక్షలకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం కొత్త ఆదేశాలు, మార్గదర్శకాలు ఇచ్చింది. లాక్ డౌన్ 3వ దశలో

  • Published By: naveen ,Published On : May 15, 2020 / 05:06 AM IST
వలసదారులకు సామూహిక కరోనా పరీక్షలు, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

కరోనా పరీక్షలకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం కొత్త ఆదేశాలు, మార్గదర్శకాలు ఇచ్చింది. లాక్ డౌన్ 3వ దశలో

కరోనా పరీక్షలకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం కొత్త ఆదేశాలు, మార్గదర్శకాలు ఇచ్చింది. లాక్ డౌన్ 3వ దశలో భాగంగా కేంద్రం పలు సడలింపులు ఇచ్చింది. వలసదారులు సొంతూళ్లు వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో వలసదారులు ఇంటి బాట పట్టారు. అయితే వారికి కరోనా టెస్టులు ఎలా చేయాలి అనే దానిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రాలకు కొత్త ఆదేశాలు ఇచ్చింది.

వలసదారులకు పూల్డ్ శాంపిలింగ్:
వలసదారులకు సామూహిక కరోనా నిర్ధారణ పరీక్షలు (పూల్డ్‌ శాంపిలింగ్‌) చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ గురువారం(మే 14,2020) రాష్ట్రాలను ఆదేశిస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి వేలాది మంది ఇక్కడకు వస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొందరు వైరస్‌ అనుమానిత లక్షణాలతో ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్నారు. అలాగే, విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పర్యవేక్షణలో తమ సొంత ఖర్చులతో హోటళ్లు, లాడ్జిల్లో క్వారంటైన్‌లో ఉన్నారు.

గ్రీన్‌జోన్‌ జిల్లాలకు చెందిన వారికీ నిర్ణీత సంఖ్యలో కరోనా పరీక్షలు:
వీరందరికీ సామూహిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కేంద్రం తెలిపింది. వాస్తవంగా విదేశాల నుంచి వచ్చే వారు, సంబంధిత దేశంలో ప్రయాణానికి ముందే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని వచ్చారు. నెగెటివ్‌ వచ్చిన వారినే ప్రయాణానికి అనుమతించారు. అయినా తాజా మార్గదర్శకాల ప్రకారం వారందరికీ ఈ పద్ధతిలో నిర్ధారణ పరీక్షలు చేస్తారు. మరోవైపు 21 రోజులుగా ఒక్క కేసూ నమోదుకాని గ్రీన్‌జోన్‌ జిల్లాలకు చెందిన వారికీ నిర్ణీత సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తారు. దీనివల్ల ఆయా జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి తీవ్రతను తెలుసుకోవడానికి వీలవుతుంది. 

25 మందికి ఒకేసారి పరీక్ష:
రివర్స్‌ ట్రాన్స్‌స్క్రిప్షన్‌ పాలిమరెస్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్‌టీ-పీసీఆర్‌)గా పిలిచే ఈ సామూహిక కరోనా నిర్ధారణ పరీక్షల వల్ల ఒకేసారి ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ విధానంలో 25 మంది శాంపిళ్లను కలిపి ఒకేసారి పరీక్షిస్తారు. ఇందులో పాజిటివ్‌ వస్తే, వారిలో ఎంత మందికి వైరస్‌ సోకిందో గుర్తించేందుకు మరోసారి ఆ 25 మందికి విడివిడిగా ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేస్తారు. ఒకవేళ నెగెటివ్‌ వస్తే వారందరికీ కరోనా లేనట్టు గుర్తించి ఇంటికి పంపిస్తారు. 

ఖర్చు, సమయం ఆదాకు ఇదే మంచి విధానం:
ప్రస్తుతం హైదరాబాద్‌లో సామూహిక కరోనా పరీక్షలను సీసీఎంబీలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానం వల్ల వంద మందిలో కరోనా ఉందో లేదో అంచనా వేయాలంటే, నాలుగు పరీక్షలు చేస్తే సరిపోతుంది. దీంతో టెస్టింగ్‌ కిట్లు సరిపోతాయని, సమయం, డబ్బు ఆదా అవుతాయని అంటున్నారు. ఒక్కో పరీక్షకు సగటున రూ.4,500 ఖర్చవుతుందని అంచనా. ప్రతి ఒక్కరినీ విడివిడిగా పరీక్షించే కన్నా ఈ పద్ధతిలో టెస్టులు జరిపితే తక్కువ టెస్టింగ్‌ కిట్లను సమర్థంగా వినియోగించుకున్నట్టవుతుంది. ప్రస్తుతం అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సామూహిక పరీక్షలకు ప్రాధాన్యం ఏర్పడనుంది. అదీగాక సర్కారు క్వారంటైన్లలో ఉండే వలసదారులకు, విదేశాల నుంచి వచ్చే వారికి, గ్రీన్‌జోన్లలో ఉన్నవారికి సామూహిక పరీక్షలు చేయడమే మేలని అంటున్నారు. 

సామూహిక కరోనా నిర్ధారణ పరీక్షలకు కేంద్రం ప్రొటోకాల్‌:
* శిక్షణ పొందిన లేబరేటరీ సిబ్బంది ఆప్రాన్, హ్యాండ్‌గ్లోవ్స్, గాగుల్స్, ఎన్‌-95 మాస్క్‌లు ధరించాలి. 
* ప్రొటోకాల్‌ ప్రకారం ఆయా వ్యక్తుల గొంతు నుంచి స్వాబ్‌ శాంపిళ్లను సేకరించాలి. 
* శాంపిళ్లు ఎవరివనే వివరాలను లేబులింగ్‌పై రాయాలి. 
* ఇలా ఒక ధపాలో సేకరించిన 25 శాంపిళ్లను ట్రిపుల్‌ లేయర్‌లో ప్యాకేజ్‌ చేస్తారు.
* ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం కోల్డ్‌–చైన్‌లో లేబరేటరీలకు తరలించి వాటిని ఒకేసారి పరీక్షిస్తారు. 

తెలంగాణ రాష్ట్రంలో 26 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వరంగల్‌ రూరల్‌, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ప్రారంభం నుంచి ఒక్క కేసు కూడా లేదు. దీంతో ఈ మూడు జిల్లాల్లో మినహా రాష్ట్రంలోని గ్రీన్‌ జోన్‌లో ఉన్న జిల్లాల్లోనూ సామూహిక పరీక్షలు జరపనున్నారు.

భారత్ లో 81వేల 970 కరోనా కేసులు, 2వేల 649 మరణాలు:
భారత్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనాతో 100 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 3,967 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 2వేల 649కి చేరుకోగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 81వేల 970కి చేరింది. ఈ వైరస్‌ నుంచి 27వేల 920 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కాగా, కరోనా కేసుల సంఖ్యలో చైనాకు భారత్ దగ్గరవుతోంది.

దేశంలో వెయ్యి కరోనా మరణాలు దాటిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర:
మహారాష్ట్రలో రోజూ ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అక్కడ గురువారం ఒక్కరోజే 1,602 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 27,524కు చేరింది. దేశంలోని మొత్తం కేసుల్లో మహారాష్ట్ర వాటానే 33.5 శాతం కాగా, ఒక్క ముంబై వాటానే 20 శాతం. ఆ సిటీలో 16,738 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరణాలూ వెయ్యి దాటాయి. దీంతో వెయ్యి మరణాలు దాటిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మొత్తంగా 1,019 మంది చనిపోయారు.

రాష్ట్రాల వారీగా కరోనా కేసులు, మరణాలు:
* అత్యధికంగా మహారాష్ట్రలో 27,524 కేసులు నమోదు కాగా, 1,019 మంది ప్రాణాలు కోల్పోయారు. 
* తమిళనాడులో 9,674(మృతులు 66)
* గుజరాత్‌లో 9,592(మృతులు 586)
* ఢిల్లీలో 8,470(మృతులు 115)
* రాజస్థాన్‌లో 4,589(మృతులు 125)
* మధ్యప్రదేశ్‌లో 4,426(మృతులు 237)
* ఉత్తరప్రదేశ్‌లో 3,902(మృతులు 88)
* వెస్ట్‌ బెంగాల్‌లో 3,902(మృతులు 215)
* ఏపీలో 2,100(మృతులు 48)
* పంజాబ్‌లో 1,935(మృతులు 32)
* తెలంగాణలో 1,414(మృతులు 34)

3లక్షలు దాటిన కరోనా మరణాలు:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 3 లక్షలు దాటింది. మొత్తం 3,03,361 మరణాలు సంభవించగా.. ఒక్క అమెరికాలోనే 86,912 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 45.25 లక్షలకు చేరగా.. వీరిలో 17 లక్షల మంది కోలుకున్నారు. దాదాపు 25 లక్షల మంది ఇంకా చికిత్స పొందుతుండగా.. వీరిలో 45,560 మంది పరిస్థితి విషమంగా ఉంది. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14.57 లక్షలు దాటింది. అమెరికా తర్వాత బ్రిటన్‌లో అత్యధిక కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. అక్కడ మొత్తం కరోనా మరణాలు 33వేలు దాటగా.. బాధితుల సంఖ్య 2లక్షల 33వేలు దాటింది.

Read Here >> ఇకపై కరోనా టెస్టు ఎంతో చౌక.. గంటకే రిజిల్ట్..!