Amadalavalasa Constituency: ఆమదాలవలసలో మామ మరోసారి జెండా ఎగరేస్తారా.. అల్లుడు చక్రం తిప్పుతాడా?

ఎవరు పోటీచేసినా.. ఎన్ని పార్టీలు రంగంలో ఉన్నా అసలు పోటీ మాత్రం మామాఅల్లుళ్ల మధ్యే జరిగేలా కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఒకరినొకరు ఓడించుకున్నారు. ఈ సారి కూడా రసవత్తర పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది.

Amadalavalasa Constituency: ఆమదాలవలసలో మామ మరోసారి జెండా ఎగరేస్తారా.. అల్లుడు చక్రం తిప్పుతాడా?

Amadalavalasa Assembly Constituency Ground Report

Amadalavalasa Assembly constituency: సిక్కోలు రాజకీయమంతా ఒక ఏత్తైతే… ఆ ఒక్క నియోజకవర్గం కాస్త డిఫరెంట్. అక్కడ అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా.. నియోజకవర్గాన్ని ఏలేది ఒక్క కుటుంబమే… అందరూ ఒకే కుటుంబ సభ్యులైనా.. రాజకీయం దగ్గర మాత్రం ఎవరికి వారే.. రక్త సంబంధీకులు కాస్త.. బద్ద విరోధులుగా మారిపోయారు. రాజకీయమే ముందు.. కుటుంబం ఆ తర్వాతే అన్నట్లు సాగుతోంది ఆమదాలవలస రాజకీయం ( Amadalavalasa Politics). నిత్యం మామ అల్లుళ్ల సవాళ్లు.. ప్రతిసవాళ్లతో రాజకీయం హాట్ హాట్‌గా సాగుతోంది. మామ మరోసారి.. జెండా ఎగరేస్తారా… అల్లుడు చక్రం తిప్పుతాడా? మామా అల్లుళ్ల వార్‌లో విజయం ఎవరిని వరిస్తుందనేది పొలిటికల్‌గా ఇంట్రస్టింగ్‌గా మారింది. స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni Sitaram) ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమలదాలవలసలో ఈ సారి కనిపించే సీనేంటి? రెబెల్స్ ఎలాంటి ప్రభావం చూపనున్నారు?

Tammineni Sitaram

Tammineni Sitaram

శ్రీకాకుళం జిల్లాలో నిత్యం హాట్ హాట్‌గా రాజకీయం నడిచే నియోజకవర్గం ఏదైనా ఉందంటే.. అది ఆమదాలవలసే… ఈ నియోజకవర్గంలో ఆమదాలవలస మున్సిపాలిటీతోపాటు సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు మండలాలు ఉన్నాయి. లక్ష 89 వేల 307 మంది ఓటర్లు ఉన్న ఆమదాలవలసలో ఎప్పుడూ రసవత్తర రాజకీయం నడుస్తుంటుంది. కాళింగ సామాజికవర్గం ఎక్కువ ఉన్న ఆమదాలవలసలో కాపు, యాదవ, వెలమ సామాజిక వర్గాలూ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంటాయి.

ఎన్ని కులాలు ఉన్నా.. ఇక్కడ రాజకీయ అధికారం మాత్రం కాళింగ సామాజిక వర్గానిదే.. రెండు పార్టీలు ఆ సామాజిక వర్గం నేతలకే టిక్కెట్లు ఇస్తుంటాయి. ఒకప్పుడు బొడ్డేపల్లి కుటుంబానికి.. తమ్మినేని ఫ్యామిలీకి మధ్య జరిగే పోటీ.. ఇప్పుడు పూర్తిగా తమ్మినేని కుటుంబానికే పరిమితమైంది. ప్రస్తుత ఎమ్మెల్యే.. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికి ప్రధాన ప్రత్యర్థి స్వయాన ఆయన మేనల్లుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమారే.. ఈ ఇద్దరి మధ్య రాజకీయం పతాకస్థాయిలో కొనసాగుతోంది.

Kuna Ravikumar

Kuna Ravikumar

2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కూన రవికుమార్ (Kuna Ravikumar). ఆ ఎన్నికల్లో తన ప్రత్యర్థి సొంత మేనమామ తమ్మినేని సీతారాంను ఐదు వేల ఓట్ల తేడాతో ఓడించారు రవికుమార్. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నేతను తమ్మినేనికి చెక్ చెప్పేందుకు… ఆయన కుటుంబం నుంచే రవికుమార్‌ను రంగంలోకి దింపడంతో ఈ నియోజకవర్గంలో ఫ్యామిలీ వార్ మొదలైంది. 2014లో టీడీపీ గెలిస్తే.. 2019లో సీన్ రివర్స్ అయింది. మేనల్లుడు రవికి చెక్ చెప్పారు తమ్మినేని.. వైసీపీ హవాలో 13 వేల 911 ఓట్ల మెజార్టీతో రవికుమార్‌ను ఓడించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమ్మినేని అనుభవం దృష్టిలో పెట్టుకుని స్పీకర్ పదవి ఇచ్చింది వైసీపీ అధిష్టానం.

తమ్మినేని, కూన రవికుమార్‌లు మామా అల్లుళ్లే కాదు.. బావా బామ్మర్దులు కూడా.. కూన రవికుమార్ సోదరినే వివాహం చేసుకున్నారు తమ్మినేని.. అంతా ఒక కుటుంబ సభ్యులైనా.. ఈ ఇద్దరి మధ్య రాజకీయ వైరం పతాకస్థాయికి చేరింది. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా రాజకీయం నడుస్తోంది. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. ఇద్దరు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటూ.. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపుకోడానికి చేయని ప్రయత్నం ఉండదు. చివరికి పోలీసు కేసులు.. అరెస్టులు.. జైళ్ల వరకు వెళ్లింది రాజకీయం. రాజకీయం పెట్టిన చిచ్చుతో ఆమదాలవలస ఎప్పుడూ టెన్షన్‌గానే కనిపిస్తోంది.

ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని.. నాలుగేళ్లుగా అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేస్తున్నారు. జిల్లాలో ఏ నియోజకవర్గానికి కేటాయించనన్ని విద్యాసంస్థలను ఒక్క ఆమదాలవలసకు మంజూరు చేయించారు. దశాబ్దాలుగా తీరని కోరికగా మారిన బలసల రేవు వంతెన నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చారు. పాలిటెక్నిక్, అగ్రికల్చర్ కాలేజ్, హార్టీ కల్చరల్ పాలిటెక్నిక్ కాలేజి, వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజితోపాటు.. పొందురు, తొగరాంల్లో డిగ్రీ కళాశాలు ఏర్పాటు చేయించారు తమ్మినేని సీతారాం.

నియోజకవర్గంలో అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. అభివృద్ధిపై ఎంతో ఫోకస్ పెట్టిన తమ్మినేని.. రోడ్ల నిర్మాణంలో వెనుకబడ్డారనే మైనస్‌ను ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళం వెళ్లేందుకు నియోజకవర్గంలో చాలా గ్రామాలకు రోడ్డు కనెవిక్టీ లేదు. నిధుల కొరతతో రోడ్డు నిర్మాణాలు జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అమదాలవలస, శ్రీకాకుళం ప్రధాన రహదారి అత్యంత కీల మైనది. జిల్లాలోని ప్రధాన రైల్వేస్టేషన్ ఆమదాలవలసలోనే ఉండటంతో నిత్యం వేలాదిగా ప్రయాణికులు వస్తుంటారు. గతుకులమయంగా మారిన రోడ్డు నరకం చూపిస్తున్నా.. కొత్తగా వేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Suvvari Gandhi

Suvvari Gandhi

ఇక రాజకీయంగా కూడా తమ్మినేని అసమ్మతని ఎదుర్కొంటున్నారు. తమ్మినేని సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులే.. ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారు. వైసిపి సీనియర్ నేతలు సువ్వారి గాంధీ (Suvvari Gandhi), చింతాడ రవికుమార్‌ (Chintada Ravi kumar)తోపాటు కోటా బ్రదర్స్ తమ్మినేనికి రాజకీయ సవాళ్లు విసురుతున్నారు. సమాంతరంగా రాజకీయం నడుపుతూ స్పీకర్‌కు తలనొప్పిగా మారారు. వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంతర్గత పోరు ఆమదాలవలసలో వైసిపికి పెద్ద మైనస్గా మారనుంది. అసమ్మతి నేతలను సెట్ రైట్ చేయడంలో వైసిపి అధిష్టానం, స్పీకర్ సీతారాం విఫలమవడం రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అయితే తన అభివృద్ధి కార్యక్రమాలే తనను మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు తమ్మినేని..

Also Read: విజయనగరంలో గెలుపు గుర్రం ఎక్కేదెవరు.. రాజుల ఖిల్లాలో పాగా వేసేదెవరు?

అంతర్గత కుమ్ములాటలతో వైసీపీ సతమతమవుతుండగా.. ప్రతిపక్ష టీడీపీ రాజకీయం జోరుగా నడుపుతోంది. నియోజవకర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్.. అధికార పార్టీకి దీటుగా పనిచేస్తున్నారు. దూకుడుగా వెళ్తూ మామ సీతారామ్‌కి చుక్కలు చూపిస్తున్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలే అంటూ మామతో యుద్ధానికి సై అంటున్నారు. స్పీకర్ తమ్మినేని నకిలీ సర్టిఫికెట్లతో లా పట్టా తీసుకున్నారని ఆరోపణలు గుప్పించిన కూన రవికుమార్.. వాటికి ఆధారాలు బయటపెట్టడంతో పొలిటికల్‌గా పైచేయి సాధించారు. నియోజకవర్గంలో నాలుగేళ్లగా అభివృద్ధి పడకేసిందని.. టీడీపీ హయాంలో నిధులు కేటాయించిన రోడ్డు పనులను కూడా పూర్తిచేయలేదని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అతివిశ్వాసం, అతి నమ్మకం వల్లే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని.. ఈ సారి అలాంటి తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: టెక్కలిలో అచ్చెన్నాయుడు దూకుడుకు చెక్ పెడతారా.. అధికార పార్టీ నేతలంతా ఒక్కటవుతారా?

రాజకీయంగా యాక్టివ్‌గా ఉండే కూన రవికుమార్.. నియోజకవర్గంలో నాయకులను కలుపుకుని వెళ్లడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. క్యాడర్ బలంగా ఉన్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు రవికుమార్‌కు మైనస్‌గా మారే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు అన్నెపు రామకృష్ణ (Annepu Ramakrishna) ఎమ్మెల్సీగా పోటీ చేసినా కూన మద్దతుగా నిలవలేదని ఓ సామాజిక వర్గం అసంతృప్తిగా ఉందని చెబుతున్నారు.

Also Read: మంత్రి సీదిరి గట్టెక్కగలరా? గౌతు ఫ్యామిలీ.. పొలిటికల్ లెగసీని కాపాడుకుంటుందా?

ప్రధాన పార్టీల్లో రాజకీయం ఇలా ఉంటే.. జనసేన, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇక్కడి నుంచి పోటీకి తహతహలాడుతున్నాయి. జనసేన పార్టీ నుంచి పేడాడ రామ్మోహన్ (RamMohan Pedada) టిక్కెట్ ఆశిస్తున్నారు. యవతతో కలిసి నియోజకవర్గ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి (boddepalli satyavathi) మరోసారి పోటి చేసే అవకాశం కనిపిస్తుంది. ఎవరు పోటీచేసినా.. ఎన్ని పార్టీలు రంగంలో ఉన్నా అసలు పోటీ మాత్రం మామాఅల్లుళ్ల మధ్యే జరిగేలా కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఒకరినొకరు ఓడించుకున్నారు. ఈ సారి కూడా రసవత్తర పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది.