Asia Cup : ఓ సారి టీ20, మ‌రోసారి వ‌న్డే ఫార్మాట్‌.. ఇలా ఎందుకంటే..?

ఆసియా క‌ప్ (Asia Cup) 2023 టోర్నీకి మ‌రో 14 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఆగ‌స్టు 30 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. శ్రీలంక, పాకిస్తాన్ లు ఆతిథ్యం ఇవ్వ‌నున్న ఈ టోర్నీలో ఆసియా సింహాలు క‌ప్ కోసం పోటీప‌డ‌నున్నాయి.

Asia Cup : ఓ సారి టీ20, మ‌రోసారి వ‌న్డే ఫార్మాట్‌.. ఇలా ఎందుకంటే..?

Asia Cup

Asia Cup 2023 : ఆసియా క‌ప్ (Asia Cup) 2023 టోర్నీకి మ‌రో 14 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఆగ‌స్టు 30 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. శ్రీలంక, పాకిస్తాన్ లు ఆతిథ్యం ఇవ్వ‌నున్న ఈ టోర్నీలో ఆసియా సింహాలు క‌ప్ కోసం పోటీప‌డ‌నున్నాయి. మొత్తం 13 మ్యాచులు జ‌ర‌గ‌నుండ‌గా పాకిస్తాన్‌లో నాలుగు, శ్రీలంకలో 9 మ్యాచులు జ‌రుగుతాయి. సెప్టెంబ‌ర్ 17 ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నీలో పాల్గొనే జ‌ట్లు ప్ర‌త్య‌ర్థులపై విజ‌యం సాధించేందుకు త‌మ అస్త్ర శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకునే ప‌నిలో ఉన్నాయి. గ‌త సీజ‌న్‌లో శ్రీలంక విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

ఓసారి టీ20 ఫార్మాట్‌(T20) ఫార్మాట్‌లో మ‌రోసారి వ‌న్డే ఫార్మాట్‌ (ODI) ఫార్మాట్‌లో ఆసియా క‌ప్‌ను నిర్వ‌హిస్తుండ‌డంపై అభిమానుల్లో కొంత అయోమ‌యం నెల‌కొంది. ఆసియా క‌ప్ ప్రారంభం నుంచి ఇలాగే నిర్వ‌హిస్తున్నారా..? అనే విష‌యాల‌ను గురించి తెలుసుకుందాం.

1984లో ప్రారంభ‌మైన ఆసియా క‌ప్‌..

ఆసియా క‌ప్ టోర్నీ 1984లో ప్రారంభ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు 17 సార్లు ఈ టోర్నీని విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. ప్ర‌తీ రెండు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి ఈ టోర్నీని నిర్వ‌హిస్తారు. మొద‌టి సారి నిర్వ‌హించిన ఆసియా క‌ప్‌కు దుబాయ్‌లోని షార్జా వేదికైంది. టోర్నీ ఆరంభం నుంచి 2014 వ‌ర‌కు కూడా ఆసియా క‌ప్‌ను వ‌న్డే ఫార్మాట్‌లోనే నిర్వ‌హించారు. అయితే.. 2016 నుంచి మాత్రం ఫార్మాట్లు మారుతున్నాయి.

Rishabh Pant : మ‌ళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్టిన పంత్‌.. వీడియో వైర‌ల్‌

2016లో మొద‌టి సారి టీ20 ఫార్మాట్‌లో నిర్వ‌హించ‌గా 2018లో వ‌న్డే ఫార్మాట్‌లో నిర్వ‌హించారు. క‌రోనా కార‌ణంగా 2020లో జ‌ర‌గాల్సిన టోర్నీ 2022కి వాయిదా ప‌డింది. యూఏఈ వేదిక‌గా టీ20 ఫార్మాట్‌లో నిర్వ‌హించ‌గా శ్రీలంక విజేత‌గా నిలిచింది. ఈ సారి టోర్నీని వ‌న్డే ఫార్మాట్‌లో నిర్వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఇలా ఎందుకు ఫార్మాట్లు మారుస్తున్నారంటే..?

ఫార్మాట్ల మార్పుపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) 2015లో నిర్ణ‌యం తీసుకుంది. ఐసీసీ మెగా టోర్నీల‌కు అనుగుణంగా ఫార్మాట్ల‌ను మార్చాల‌ని డిసైడ్ అయ్యింది. 2016లో భార‌త్ వేదిక‌గా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌డంతో ఆ టోర్నీకి ముందు జ‌రిగిన ఆసియా క‌ప్పును టీ20 ఫార్మాట్‌లో నిర్వ‌హించారు. 2019లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌డంతో అంత‌క‌ముందు 2018లో ఆసియా క‌ప్పును వ‌న్డే ఫార్మాట్‌లో నిర్వ‌హించారు. అలాగే.. ఈ సారి భార‌త్ వేదిక‌గా వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ జ‌ర‌గ‌నుండ‌డంతో ఈ సారి ఆసియా క‌ప్పును వ‌న్డే ఫార్మాట్‌లో నిర్వ‌హిస్తున్నారు. భ‌విష్య‌త్తులో కూడా ఇదే ప‌ద్ద‌తి కొన‌సాగ‌నుంది.

6 జ‌ట్లు రెండు గ్రూపులు..

ఆసియా క‌ప్ 2023లో మొత్తం ఆరు జ‌ట్లు బ‌రిలో ఉన్నాయి. అయితే.. వీటిని రెండు గ్రూపులు విభ‌జించారు. గ్రూప్‌-ఏలో భార‌త్‌, పాకిస్తాన్‌తో పాటు నేపాల్ ఉండ‌గా.. గ్రూప్‌-బిలో శ్రీలంక‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌లు ఉన్నాయి. గ్రూప్ ద‌శ‌లో ఆరు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆయా గ్రూపుల్లో మొద‌టి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్‌-4కు అర్హ‌త సాధిస్తాయి.

PCB : పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ట్రోల్ చేస్తున్న సొంత అభిమానులు.. చేసిన ప‌ని అలాంటిది మ‌రీ..!

సూప‌ర్ -4 ద‌శ‌లో ప్ర‌తీ జ‌ట్టు మిగిలిన జ‌ట్ల‌తో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ త‌రువాత సూప‌ర్‌-4 ద‌శ‌లో మొద‌టి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు ఫైన‌ల్ మ్యాచ్ ఆడుతాయి.

ఆసియా కప్ 2023 పూర్తి షెడ్యూల్..

ఆగస్టు 30 – పాకిస్థాన్ vs నేపాల్ – వేదిక‌ ముల్తాన్

ఆగస్టు 31 – బంగ్లాదేశ్ vs శ్రీలంక – వేదిక‌ క్యాండీ

సెప్టెంబర్ 2 – పాకిస్తాన్ vs భారతదేశం – వేదిక‌ క్యాండీ

సెప్టెంబర్ 3 – బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ – వేదిక‌ లాహోర్

సెప్టెంబర్ 4 – భారతదేశం vs నేపాల్ – వేదిక‌ క్యాండీ

సెప్టెంబర్ 5 – శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ – వేదిక‌ లాహోర్

సెప్టెంబర్ 6 – సూపర్ 4s – A1 vs B2 – వేదిక‌ లాహోర్

సెప్టెంబర్ 9 – B1 vs B2 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 10 – A1 vs A2 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 12 – A2 vs B1 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 14 – A1 vs B1 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 15 – A2 vs B2 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 17 – ఫైనల్ – వేదిక‌ కొలంబో

ఇక మ్యాచులు అన్నీ భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నాం మూడు గంట‌ల‌కు ప్రారంభం అవుతాయి.

Ben Stokes : ప్ర‌పంచ‌క‌ప్ ముందు బెన్‌స్టోక్స్ కీల‌క నిర్ణ‌యం.. భార‌త్‌కు షాక్ త‌ప్ప‌దా..!