Revanth Reddy : సమాజానికి ఆయన అవసరం ఎంతో ఉంది, కేసీఆర్‌ని తరిమికొట్టడానికి అంతా ఏకమవుతున్నాం- రేవంత్ రెడ్డి

ఊరు మీద పడి రాక్షసుడు చంపి తింటుంటే.. ఊరిలో ఉన్నోళ్లంతా ఏకమై తరిమి కొట్టినట్లు..Revanth Reddy - Thummala Nageswara Rao

Revanth Reddy : సమాజానికి ఆయన అవసరం ఎంతో ఉంది, కేసీఆర్‌ని తరిమికొట్టడానికి అంతా ఏకమవుతున్నాం- రేవంత్ రెడ్డి

Revanth Reddy - Thummala Nageswara Rao

Revanth Reddy – Thummala Nageswara Rao : తుమ్మల నాగేశ్వరరావుని కాంగ్రెస్ లోకి ఆహ్వానించే అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తుమ్మలను పార్టీలోకి ఆహ్వానించామని ఆయన చెప్పారు. సమాజానికి తుమ్మల అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి. సహచరులు, అభిమానులను సంప్రదించి కాంగ్రెస్ లో చేరికపై ఓ నిర్ణయం తీసుకుంటానని తుమ్మల చెప్పారని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఏఐసీసీ, జిల్లా ముఖ్య నాయకుల అనుమతితోనే తుమ్మలను కలిశామన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తిగా తుమ్మలను అభివర్ణించారు రేవంత్ రెడ్డి. తుమ్మల ఖమ్మంకే పరిమితం కాకూడదన్నారు. అన్ని రంగాల మీద అవగాహన ఉన్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పారు. (Revanth Reddy)

అవినీతి, అహంకారానికి అలవాటు పడ్డ నాయకుడు.. తుమ్మల లాంటి వాళ్ళను రాజకీయాల్లో కనుమరుగు చేయాలని చూస్తున్నారు అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంట్రాక్ట్ పనులు చేసుకునే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని చేసింది అంటూ కందాల ఉపేందర్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కి కందాల చేసిన అన్యాయం ఎక్కువ అని ధ్వజమెత్తారు. తుమ్మలని విమర్శించే స్థాయి కందాలకు లేదన్నారు రేవంత్ రెడ్డి. ఊరు మీద పడి రాక్షసుడు చంపి తింటుంటే.. ఊరిలో ఉన్నోళ్లంతా ఏకమై తరిమి కొట్టినట్లు.. కేసీఆర్ ని తరిమి కొట్టడానికి అందరం ఏకం అవుతున్నాం అని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయించిన 12 మందిలో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు దాటనిచ్చేదే లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

Also Read..Telangana Congress: కాంగ్రెస్‌ పార్టీలో హాట్‌హాట్‌గా మారిన ఫ్యామిలీ పాలిటిక్స్‌!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరాలని తుమ్మలను ఆహ్వానించారు. రేవంత్ రెడ్డితో పాటు సుదర్శన్ రెడ్డి, మల్లు రవి వెళ్లారు. కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కు తుమ్మల దూరంగా ఉంటున్నారు. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో తుమ్మలకు చోటు దక్కలేదు. దాంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన తన కార్యకర్తలు, నేతలతో సమావేశం అయ్యారు. త్వరలోనే తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది.

ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుల్లో కీలకమైన వ్యక్తిగా తుమ్మల నాగేశ్వరరావు గుర్తింపు పొందారు. అలాంటి కీలక నేత కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్లస్ అవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలో రాయబారం మొదలుపెట్టారు. ఇవాళ హైదరాబాద్ లోని తుమ్మల ఇంటికి వెళ్లారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు. బీఆర్ఎస్ లో పాలేరు టికెట్ ను ఆశించి భంగపడ్డారు తుమ్మల. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే మళ్లీ టికెట్ ఇచ్చారు కేసీఆర్. దాంతో తుమ్మల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

Also Read.. Karimnagar: కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సింహం సింబల్ హవా.. ఎందుకో తెలుసా?

ఈ క్రమంలో రాజకీయ భవిష్యత్తుపై తుమ్మల ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన అనుచరులు, కార్యకర్తల సూచన మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని తుమ్మల నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా పాలేరు నుంచి పోటీ చేయాలని తుమ్మల ఫిక్స్ అయ్యారు. ఆ అవకాశం కోసం కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 6న కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తుమ్మలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించేందుకు స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. తుమ్మల ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్ లోకి రావాలని వెల్ కమ్ చెప్పారు రేవంత్ రెడ్డి.