Telangana Congress: కాంగ్రెస్‌ పార్టీలో హాట్‌హాట్‌గా మారిన ఫ్యామిలీ పాలిటిక్స్‌!

వన్ ఫ్యామిలీ.. వన్ టిక్కెట్ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వం అందుకున్న సరికొత్త నినాదమిది.. టిక్కెట్లకు ఎక్కడాలేని డిమాండ్ పెరగడం.. బీసీలకు పెద్దపీట వేయాలనే అజెండా అమలు చేయడంతో కుటుంబంలో ఒకరికే టిక్కెట్ ఇస్తామంటూ కండీషన్ పెడుతోంది హస్తం పార్టీ.

Telangana Congress: కాంగ్రెస్‌ పార్టీలో హాట్‌హాట్‌గా మారిన ఫ్యామిలీ పాలిటిక్స్‌!

Family politics hot topic telangana congress party

Telangana Congress – Family Politics: డాక్టర్ కొడుకు డాక్టర్.. యాక్టర్ కొడుకు యాక్టర్.. పొలిటీషయన్ పిల్లలు పొలిటీషన్లు అవ్వాల్సిందేనా.. డాక్టర్లు అవుతున్నారో లేదోగాని.. యాక్టర్లు, లీడర్లకు మాత్రం ఎలాంటి కొదవ లేదు. రాజకీయం వారసత్వంగా (Hereditary politics) మారిపోయింది. అన్నిపార్టీల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తుంటే కాంగ్రెస్ మాత్రం.. కుటుంబ వారసత్వానికి చాన్స్ లేదంటోంది. వన్ ఫ్యామిలీ.. వన్ టిక్కెట్ అంటూ కొత్త ఫార్ములా తెరపైకి తెస్తోంది. ఉదయపూర్ డిక్లరేషన్ (Udaipur declaration) అంటూ సాకులు చెబుతోంది.. ఐతే పార్టీ కండీషన్లకు నేతలు మాత్రం ససేమిరా అంటున్నారట.. ఒక్క చాన్స్ అంటూ తెగ ప్రయత్నిస్తున్నారు. హాట్‌హాట్‌గా మారిన కాంగ్రెస్‌ ఫ్యామిలీ పాలిటిక్స్‌లో తెరవెనుక ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

వన్ ఫ్యామిలీ.. వన్ టిక్కెట్ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వం అందుకున్న సరికొత్త నినాదమిది.. టిక్కెట్లకు ఎక్కడాలేని డిమాండ్ పెరగడం.. బీసీలకు పెద్దపీట వేయాలనే అజెండా అమలు చేయడంతో కుటుంబంలో ఒకరికే టిక్కెట్ ఇస్తామంటూ కండీషన్ పెడుతోంది హస్తం పార్టీ. ఉదయపూర్ డిక్లరేషన్ అంటూ హైకమాండ్‌పై భారం వేస్తూ తప్పుకుంటోంది తెలంగాణ పీసీసీ.. తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి బీసీలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ నినాదం.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాల్లో బీసీలను నిలపాలన్నది అధిష్టానం ఆలోచన. బీసీ ఓట్లకు గాలం వేయడానికి కాంగ్రెస్ అమలు చేస్తున్న ఈ ప్లాన్ వల్ల ఎక్కువగా అగ్రనేతల టిక్కెట్లకే ఎసరు వస్తోందని చెబుతున్నారు.

కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు జానారెడ్డి (Jana Reddy), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, దామోదర రాజనర్సింహ, సీతక్క కుటుంబాల నుంచి ఒకటి కంటే ఎక్కువ టిక్కెట్లు ఆశిస్తున్నారు. అందరూ సీనియర్లు కావడం పైగా హైకమాండ్‌లో పలుకుబడి ఉన్నవారే కావడంతో ఎలా సర్దుబాటు చేయాలో అర్థంకాని టీపీసీసీ తెలివిగా ఉదయ్‌పూర్ డిక్లరేషన్ పేరిట హైకమాండ్ కోర్టులో బంతి విసిరేసింది. సీనియ‌ర్ నేత జానారెడ్డి ఇద్దరు కుమారులు నాగార్జునసాగర్ టిక్కెట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. పెద్ద కుమారుడు ర‌ఘువీర్‌రెడ్డి, చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి ఇద్దరూ ఆ అసెంబ్లీ టిక్కెట్‌నే ఆశిస్తున్నారు. నాగార్జున సాగర్ కుదరదంటే మిర్యాలగూడ అయినా సర్దుబాటు చేయాలని మరో దరఖాస్తు సమర్పించారు ర‌ఘువీర్ రెడ్డి. ఒక టిక్కెట్ ఇస్తామంటే రెండు సీట్లకు ఇద్దరు పోటీపడటంతో కాంగ్రెస్‌లో విస్తృత చర్చకు దారితీసింది.

Also Read: చేతి గుర్తు మా చిహ్నం, చేసి చూపించటమే మా నైజం : రేవంత్ రెడ్డి

ఇదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ రెండేసి టిక్కెట్లు ఆశిస్తున్నారు. ఐతే వీరిద్దరూ కాస్త తెలివిగా ఒక అసెంబ్లీ, మరో పార్లమెంట్ టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఒకే టిక్కెట్ నిబంధనకు కట్టుబడుతున్నట్లు చెబుతూనే తమతోతోపాటు వారసులతోనూ దరఖాస్తు చేయించారు. రాజనర్సింహ కుమార్తె త్రిశాల అంధోల్ టిక్కెట్‌ను, అంజన్‌కుమార్ కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్ ముషీరాబాద్ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. వారసులకు అసెంబ్లీ టిక్కెట్లు ఇస్తే తమకు ఎంపీ టిక్కెట్లు ఇవ్వాలని మెలిక పెడుతున్నారు ఈ ఇద్దరు నేతలు.

Also Read: సోనియా, రాహుల్‌తో వైఎస్ షర్మిల దంపతులు భేటీ.. కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనంపై చర్చ?

ఇక ములుగు ఎమ్మెల్యే సీత‌క్క కొడుకు సూర్యం పిన‌పాక‌ టిక్కెట్, కేంద్ర మాజీ మంత్రి బ‌ల‌రాం నాయ‌క్ కుమారుడు సాయిరాంనాయ‌క్‌ ఇల్లందు టిక్కెట్లకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎవరో ఒకరికే టిక్కెట్ అంటూ తేల్చిచెబుతోంది టీపీసీసీ.. వీరంతా ఒక ఎత్తైతే పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిది మరో బాధ. గతంలో ఉత్తమ్, ఆయన భార్య పద్మావతి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఉత్తమకుమార్ హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా.. కోదాడ నుంచి పద్మావతి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఇద్దరూ ఆ సీట్లను మళ్లీ అడుగుతున్నారు. ప్రదేశ్ ఎల‌క్షన్ క‌మిటీ మీటింగ్లో తన కుటుంబానికి మినహాయింపు ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరనట్లు సమాచారం. ఈ విష‌యంపై పీసీసీ చీఫ్ రేవంత్‌, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మ‌ధ్య స్వల్ప వాగ్వాదం జరిగినట్లు గాంధీభవన్ టాక్.

Also Read: కాంగ్రెస్‌లోకి తుమ్మల..! సెప్టెంబర్ రెండోవారంలో రాహుల్ సమక్షంలో చేరే అవకాశం..

టిక్కెట్ల విషయంలో తనను డిక్టేట్ చేయొద్దని రేవంత్ చెప్పేయగా.. ఎట్టిపరిస్థితుల్లోనూ తనకు, తన భార్యకు అవకాశం ఇవ్వాల్సిందేనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీసీ నినాదం తెరపైకి తెచ్చి ఉత్తమ్‌కు చెక్ చెప్పారని అంటున్నారు. న‌ల్లగొండ పార్లమెంట్ ప‌రిధిలో బీసీ ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న కోదాడ‌, న‌ల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లను బీసీలకు ఇవ్వాలని స్టేట్‌మెంట్ ఇచ్చారు ఎంపీ కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి. ఇలా ముఖ్యనేతలే పార్టీ నియమాలకు తిలోదకాలు ఇచ్చేవిధంగా టిక్కెట్లకు పోటీపడుతుండటం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. మిగిలిన నేతలు ఏమోగాని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎలా స్పందిస్తుదనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.