Leopard Trapped: తిరుమలలో చిక్కిన మరో చిరుత.. చిన్నారి లక్షితపై దాడిచేసిన ప్రాంతంలో బోనులో చిక్కిన చిరుత

చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే మరో చిరుత బోనులో చిక్కింది. లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమీపంలో ఇది చిక్కినట్లు అధికారులు తెలిపారు.

Leopard Trapped: తిరుమలలో చిక్కిన మరో చిరుత.. చిన్నారి లక్షితపై దాడిచేసిన ప్రాంతంలో బోనులో చిక్కిన చిరుత

Tirumala Leopard

Leopard Trapped In Tirumala: తిరుమలలో మరో చిరుత చిక్కింది. తిరుమల నడక దారిలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో బుధవారం తెల్లవారు జాము సమయంలో చిరుత చిక్కింది. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే ఈ చిరుత బోన్‌లో చిక్కింది. లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమీపంలో ఇది చిక్కినట్లు అధికారులు తెలిపారు. దీంతో తిరుమల నడక మార్గంలో బోనులో చిక్కిన చిరుతల సంఖ్య ఆరుకు చేరింది. చిరుతను జూపార్క్ కు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరుసగా చిరుతలు బోనులో చిక్కుతుండటంతో తిరుమల  కొండపైకి నడక మార్గంలో వెళ్లే భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బోనులో చిక్కిన చిరుతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తుల రక్షణ కొరకు అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బోనులో చిక్కిన చిరుత వయస్సు నాలుగు సంవత్సరాలు ఉంటుందని తెలిపారు.

Read Also:  Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత.. నడకమార్గంలో చిరుతను బోనులో బంధించిన అధికారులు

తిరుమల నడక మార్గంలో గత నెల ప్రారంభంలో చిరుత దాడిలో చిన్నారి లక్షిత మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అలర్ట్ అయింది. తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతపై అధికారులు ఫోకస్ పెట్టారు. గత నెల 11న లక్షితపై చిరుత దాడిచేసి హతమార్చగా.. అలర్ట్ అయిన టీటీడీ, అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ‘ఆపరేషన్ చిరుత’ చేపట్టారు. తిరుమలకు వెళ్లే కాలినడక మార్గంలో మూడు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. మోకాలిమిట్ట, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లు ఉంచారు.

ఈనెల 14న, 17వ తేదీన రెండు చిరుతలు బోనులో చిక్కాయి. ఆగస్టు 28న కాలినడక మార్గంలో 7వ మైలురాయి వద్ద ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. అదేవిధంగా నరసింహస్వామి ఆలయం 7వ మైలు మధ్య ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోనులో సెప్టెంబర్ 7న మరో చిరుత చిక్కింది. తాజాగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలో చిరుత బోనులో చిక్కింది. ఇదిలాఉంటే గత రెండు నెలల క్రితం ఓ చిరుతను బంధించారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు మూడు నెలల వ్వవధిలో ఆరు చిరుతలను అధికారులు బంధించారు.

Read Also: Tirumala Leopard Attack: రెండు చిరుతల డీఎన్‌ఏ నివేదికలు వచ్చేశాయ్.. అందులో బాలికపై దాడిచేసిన చిరుత ఏదంటే?

ఇదిలాఉంటే లక్షిత మృతికి కారణమైన చిరుత ఏదనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆపరేషన్ చిరుతలో భాగంగా బంధించి నాలుగు చిరుతల డీఎన్‌ఏ పరీక్షలకోసం నమూనాలను అధికారులు ముంబయిలోని ల్యాబ్‌కు పంపించారు. అయితే, పట్టుబడిన తొలి రెండు చిరుతల నమూనాలు వచ్చాయి. లక్షిత మరణానికి ఆ రెండు చిరుతలు కారణం కాదని తేలింది. మరో రెండు చిరుతల నమూనాలు రావాల్సి ఉంది. తాజాగా పట్టుబడిన చిరుత నమూనాలను అధికారులు ముంబయి ల్యాబ్ కు పంపించే అవకాశం ఉంది.