World Cup 2023 IND vs AUS ODI : అర్థ‌శ‌త‌కాల‌తో రాణించిన‌ కోహ్లీ, రాహుల్‌.. ఆస్ట్రేలియా పై టీమ్ ఇండియా విజ‌యం

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో టీమ్ఇండియా శుభారంభం చేసింది. చెన్నై వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో విజ‌యం సాధించింది.

World Cup 2023 IND vs AUS ODI : అర్థ‌శ‌త‌కాల‌తో రాణించిన‌ కోహ్లీ, రాహుల్‌.. ఆస్ట్రేలియా పై టీమ్ ఇండియా విజ‌యం

pic @BCCI Twitter

World Cup 2023 IND vs AUS : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో టీమ్ఇండియా శుభారంభం చేసింది. చెన్నై వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 200 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 41.2 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో కేఎల్ రాహుల్ (97 నాటౌట్‌; 115 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్స‌ర్లు), విరాట్ కోహ్లీ (85; 116 బంతుల్లో 6 ఫోర్లు) లు అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో హేజిల్ వుడ్ మూడు, మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీశాడు.

ఓ మోస్త‌రు ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టుకు వ‌రుస షాక్‌లు త‌గిలాయి. స్కోరు బోర్డు పై రెండు ప‌రుగులు చేరాయో లేదో మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్, శ్రేయ‌స్ అయ్య‌ర్ లు డ‌కౌట్లు అయ్యారు. అయితే.. సీనియ‌ర్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు ఇన్నింగ్స్‌ను న‌డిపించే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నారు. మొద‌ట వికెట్ల ప‌డ‌కుండా అడ్డుకున్న ఈ జోడి క్రీజులో నిల‌దొక్కుకున్న త‌రువాత వేగం పెంచింది.

Jake Fraser McGurk : 29 బంతుల్లో సెంచ‌రీ చేసిన ఆసీస్ బ్యాట‌ర్.. డివిలియ‌ర్స్ రికార్డు బ్రేక్‌

ఈ క్ర‌మంలో విరాట్ కోహ్లీ 75 బంతుల్లో కేఎల్ రాహుల్ 72 బంతుల్లో అర్థ‌శ‌త‌కాల‌ను పూర్తి చేసుకున్నారు. అనంత‌రం వేగం పెంచారు. అయితే.. శ‌త‌కం దిశ‌గా సాగుతున్న కోహ్లీని జోష్ హేజిల్ వుడ్ ఔట్ చేశాడు. విరాట్ కోహ్లీ-కేఎల్ రాహుల్ జోడి నాలుగో వికెట్‌కు 165 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పి జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు. మిగిలిన పనిని హార్ధిక్ పాండ్య‌తో క‌లిసి కేఎల్ రాహుల్ పూర్తి చేశాడు.

విజృంభించిన స్పిన్న‌ర్లు..

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవ‌ర్ల‌లో 199 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో స్టీవ్ స్మిత్ (46; 71 బంతుల్లో 5 ఫోర్లు), డేవిడ్ వార్న‌ర్ (41; 52 బంతుల్లో 6 ఫోర్లు) లు రాణించారు. మిచెల్ మార్ష్‌(0), అలెక్స్ కేరీ (0), కామెరూన్ గ్రీన్ (8), మాక్స్‌వెల్ (15)లు విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌వింద్ర జ‌డేజా మూడు వికెట్లు తీయ‌గా, బుమ్రా, కుల్దీప్ యాద‌వ్ లు చెరో రెండు, అశ్విన్, హార్దిక్ పాండ్య, మ‌హ్మ‌ద్ సిరాజ్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Rohit Sharma : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. మిచెల్ మార్ష్‌ను బుమ్రా డ‌కౌట్‌గా పెవిలియ‌న్‌కు పంపాడు. దీంతో 5 ప‌రుగుల‌కే మొద‌టి వికెట్ కోల్పోయింది ఆసీస్‌. అయితే.. డేవిడ్ వార్న‌ర్‌, స్టీవ్ స్మిత్ లు ఇద్ద‌రు క‌లిసి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వీరు ఇద్ద‌రు భార‌త బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నారు. అర్థ‌శ‌త‌కం దిశ‌గా సాగుతున్న వార్న‌ర్‌ను కుల్దీప్ యాద‌వ్ ఔట్ చేశాడు. దీంతో 69 ప‌రుగుల రెండో వికెట్‌ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది.

మ‌రికాసేప‌టికే స్మిత్‌ను జ‌డేజా బౌల్డ్ చేయ‌డంతో 110 ప‌రుగుల వ‌ద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. ఈ ద‌శ‌లో భార‌త బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ఆస్ట్రేలియా వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. 140 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఆఖ‌ర్లో మిచెల్ స్టార్క్ (28), పాట్ క‌మిన్స్ (15) కాస్త బ్యాట్ ఝుళిపించ‌డంతో ఆసీస్ ఓ మోస్త‌రు ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.