Telangana Polls: ప్రతిపక్షంలో కూడా రైతులను వేధిస్తోంది.. కాంగ్రెస్ పార్టీపై హరీశ్ ఫైర్

కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదని, అలాంటి పార్టీ ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చుపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

Telangana Polls: ప్రతిపక్షంలో కూడా రైతులను వేధిస్తోంది.. కాంగ్రెస్ పార్టీపై హరీశ్ ఫైర్

అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని గోస పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా రైతుల్ని వేధిస్తోందని మంత్రి హరీశ్‭రావు విరుచుకుపడ్డారు. ఇరు పార్టీల మధ్య కరెంటు విషయమై మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హరీశ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతు వ్యతిరేక పార్టేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదని, అలాంటి పార్టీ ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చుపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నా… విపక్ష్యంలో ఉన్న రైతు వ్యతిరేక పార్టీనే. రైతు బంధుపై అక్టోబర్ లోనే కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు రద్దు చేసింది. రైతులపై ప్రేముంటే రేవంత్ రెడ్డి ఎలా అభ్యంతరం చెప్తారు? కాంగ్రెస్ నేతల ఫిర్యాదుల కారణంగానే రైతుబంధు పంపిణీని ఎన్నికల సంఘం రద్దు చేసింది. డిసెంబర్లో మూడో సారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. 6వ తేదీన రైతు బంధు మేమే వేస్తాం. మీ కాంగ్రెస్ పార్టీ చేతిని అడ్డుపెట్టి రైతు బంధును ఆపలేరు. 30వ తేదీన రైతులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారు’’ అని హరీశ్ రావు అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులుగా మిగిలాయి. కర్ణాటక మొహం రాహుల్, ప్రియాంకలు చూస్తలేరు. కర్ణాటకలో కాంగ్రెస్ ఒక్క హమీని నిలుపుకోలేదు. కర్ణాటక సీఎం సిద్ధి రామయ్య చేతులెత్తారు. రాహుల్ గాంధీ చిక్కడపల్లిలో కాదు…బెంగుళూరులో మీటింగ్ పెట్టాలి. కాంగ్రెస్ నేతల బాండ్ పేపర్లు చిత్తు కాగితాలతో సమానం’’ అని మంత్రి హరీశ్ విమర్శలు గుప్పించారు.