INDIA 4th Meet: చాలా రోజుల తర్వాత ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం.. తేదీ ప్రకటించిన కాంగ్రెస్

27 పార్టీల కూటమి చివరి సమావేశం సెప్టెంబర్‌లో ముంబైలో జరిగింది. ఇందులో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షత వ్యవహరించారు

INDIA 4th Meet: చాలా రోజుల తర్వాత ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం.. తేదీ ప్రకటించిన కాంగ్రెస్

ఇండియా కూటమి నాలుగో సమావేశం మంగళవారం (డిసెంబర్ 19) జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత ఇండియా కూటమికి ఇదే తొలి సమావేశం. ఇండియా కూటమి చివరి సారిగా ముంబైలో ఆగస్టు 31న సమావేశమైంది. ఇక అప్పటి నుంచి సమావేశం కాలేదు. కాగా, తాజాగా మరోసారి ఇండియా కూటమి సమావేశం గురించి కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటన చేశారు.

ఢిల్లీలో సమావేశం
కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య టెన్షన్ కొనసాగుతుండగా, ప్రతిపక్షాల ఐక్యత ప్రమాదంలో పడిన తరుణంలో జైరాం రమేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదివారం జైరాం రమేశ్ తన సోషల్ మీడియాలో “ఇండియా కూటమిలో పాల్గొన్న పార్టీల నాయకుల నాల్గవ సమావేశం మంగళవారం, డిసెంబర్ 19, 2023 న న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటల నుంచి జరుగుతుంది. ‘ఇండియా ఏకం అవుతుంది, ఇండియా గెలుస్తుంది’’ అని పోస్ట్ చేశారు.


సీట్ల పంపకంపై చర్చ
ఈ సమావేశంలో సీట్ల పంపకాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇది కాకుండా, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉమ్మడి ఎన్నికల ప్రచారంపై కూడా సమావేశంలో చర్చించవచ్చు. ఈ సమావేశంలో విపక్షాల ఐక్యత థీమ్ ‘నేను కాదు, మనం’ అని ఉండనున్నట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

డిసెంబర్ 6న సమావేశం జరగాల్సి ఉంది
ముందుగా ఈ సమావేశం డిసెంబర్ 6న జరగాల్సి ఉంది. అయితే తన కుటుంబంలో వివాహం కారణంగా తాను రాలేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆరోగ్య కారణాల వల్ల తాను రాలేనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ చెప్పారు. ఇక తమిళనాడులో మిచాంగ్ తుపానును కారణంగా తాను రాలేనని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. దీంతో సమావేశం వాయిదా పడింది.

చివరి సమావేశం సెప్టెంబర్‌లో
27 పార్టీల కూటమి చివరి సమావేశం సెప్టెంబర్‌లో ముంబైలో జరిగింది. ఇందులో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షత వ్యవహరించారు. కూటమిలో చేరిన పార్టీల మధ్య సీట్ల పంపకం చర్చలు నిలిచిపోవడం గమనార్హం. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ ఆశించింది. అయితే ప్రధానమైన మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దారుణ ఓటమితో ప్రస్తుత కూటమిలో చర్చలు ఎలా జరుగుతాయని ఆసక్తి నెలకొంది.