NZ vs PAK : గెలుపు సంగ‌తే మ‌రిచిపోయిన పాకిస్తాన్‌.. వ‌రుస‌గా నాలుగో టీ20లోనూ ఓట‌మి..

కెప్టెన్ మారినా, ఫార్మాట్ మారిన‌ప్ప‌టికీ కూడా పాకిస్తాన్ ఓట‌ముల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.

NZ vs PAK : గెలుపు సంగ‌తే మ‌రిచిపోయిన పాకిస్తాన్‌.. వ‌రుస‌గా నాలుగో టీ20లోనూ ఓట‌మి..

Pakistan

New Zealand vs Pakistan : కెప్టెన్ మారినా, ఫార్మాట్ మారిన‌ప్ప‌టికీ కూడా పాకిస్తాన్ ఓట‌ముల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. భార‌త్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసిన పాకిస్తాన్.. కొత్త కెప్టెన్ షాన్ మ‌సూద్(టెస్టుల‌కు మాత్ర‌మే) సార‌థ్యంలో ఆస్ట్రేలియాతో ఆడిన మూడు టెస్టుల్లోనూ ఓడిపోయింది. అక్క‌డి నుంచి న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన పాకిస్తాన్‌కు ఇక్క‌డా ఓట‌ములు త‌ప్ప‌డం లేదు. టీ20ల్లో నూత‌న కెప్టెన్ అయిన ష‌హీన్ అఫ్రిధి (టీ20ల‌కు మాత్ర‌మే) నాయ‌క‌త్వంలోనూ ఆ జ‌ట్టు త‌ల‌రాత‌ మార‌లేదు. వ‌రుస‌గా నాలుగో టీ20 మ్యాచులో ఓడిపోయింది.

ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచులో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా సిరీస్‌లో 4-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు న‌ష్ట‌పోయి 158 ప‌రుగులు చేసింది. వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 90 ప‌రుగులు చేశాడు. మ‌హ్మ‌ద్ న‌వాజ్ (21 నాటౌట్; 9 బంతుల్లో 3 ఫోర్లు), బాబ‌ర్ ఆజాం (19; 11 బంతుల్లో 2 ఫోర్లు, 1)లు రాణించగా మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. కివీస్ బౌల‌ర్ల‌లో మాట్ హెన్రీ, ఫెర్గూస‌న్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. మిల్నేఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Shawn Barber : 29 ఏళ్ల వ‌య‌సులో మ‌ర‌ణించిన మాజీ ప్రపంచ పోల్ వాల్ట్ ఛాంపియన్.. ఎలా చ‌నిపోయాడంటే..?

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో న్యూజిలాండ్ త‌డ‌బ‌డింది. ఫిన్ అలెన్ (8), టిమ్ సీఫెర్ట్ (0), విల్ యంగ్ (4) స్వ‌ల్ప స్కోర్ల‌కే వెనుదిర‌గ‌డంతో 20 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. కాగా.. ఈ మూడు వికెట్ల‌ను కెప్టెన్ అఫ్రిది ప‌డ‌గొట్టాడు. అయితే.. డారెల్‌ మిచెల్‌ (72 నాటౌట్; 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్‌ ఫిలిప్స్‌ (70; 52 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను న‌డిపించే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నారు.

ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడి ఆ త‌రువాత పాక్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగారు. పోటీపోటీగా బౌండ‌రీలు బాదారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు అర్థ‌శ‌త‌కాలు పూర్తి చేసుకున్నారు. ఆ త‌రువాత కూడా వీరు అదే జోరును కొన‌సాగించడంతో మ‌రో 11 బంతులు మిగిలి ఉండ‌గానే కివీస్ విజ‌యాన్ని అందుకుంది. వీరిద్ద‌రు అభేద్య‌మైన నాలుగో వికెట్‌కు 139 ప‌రుగులు జోడించారు. ఈ గెలుపుతో కివీస్ సిరీస్‌లో 4-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక చివ‌రి మ్యాచ్ ఈ నెల 20న ఇదే వేదిక పై జ‌ర‌గ‌నుంది.

Dhoni fan : ధోనీ వీరాభిమాని ఆత్మ‌హ‌త్య‌.. త‌న ఇంటినే సీఎస్‌కే రంగుల‌తో నింపిన వ్య‌క్తి..

ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ చివ‌రిగా ఆడిన 14 అంత‌ర్జాతీయ మ్యాచుల్లో 12వ ఓట‌మి కాగా.. ఇది వరుస‌గా 8వ ప‌రాభ‌వం కావ‌డం గ‌మ‌నార్హం.