జనం గుండెల్లో గుడి కట్టడమే నా అజెండా: ఏపీ సీఎం జగన్

చంద్రబాబుకు బీజేపీతో సహా ఇతర పార్టీల్లో బినామీ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.

జనం గుండెల్లో గుడి కట్టడమే నా అజెండా: ఏపీ సీఎం జగన్

CM-Jagan

CM Jagan: అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్టే.. చంద్రబాబుకు ఇతర పార్టీల్లో రకరకాల రూపాల్లో బినామీ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకు బీజేపీతో సహా వివిధ పార్టీల్లో స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారంటూ.. దగ్గుబాటి పురేందశ్వరిపై పరోక్ష విమర్శలు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబుకు మంచి చేసిన చరిత్ర లేదని, ఆయనదంతా మోసాల చరిత్రేనని ధ్వజమెత్తారు.

రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరిన చంద్రబాబు అభిమానులు.. ఆయనను జాకీ పెట్టి లేపేందుకు కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో పర్మినెంట్ రెసిడెంట్ కలిగిన దత్తపుత్రుడు, పక్క పార్టీలో ఉన్న చంద్రబాబు వదిన స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారని అన్నారు. తనకు స్టార్ క్యాంపెయినర్లు లేరని జెండాలు జతకట్టిన వారంతా అనుకుంటున్నారని.. 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు తనకు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారని ప్రకటించారు. మీకు మంచి జరిగితే స్టార్ క్యాంపెయినర్లుగా రండి అని ప్రజలకు సీఎం జగన్ పిలుపునిచ్చారు. జనమే తన స్టార్ క్యాంపెయినర్లు అని, తనకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే ఎవరికి లేరని తెలిపారు. కుట్రలు, కుతంత్రాలతో జెండాలు జతకట్టమే వారి అజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా అని ప్రకటించారు.

Also Read: బాబాయ్ స‌వాల్‌ను స్వీకరించిన వైఎస్ షర్మిల.. మరోసారి జ‌గ‌న్‌ను అలా పిలవనని వెల్లడి

మహిళా సాధికారతకు పెద్దపీట
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎటువంటి వివక్ష లేకుండా అర్హతే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 79 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరనుందని చెప్పారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని, ఈ విషయంలో ఏపీ ముందుందని తెలిపారు. ప్రతి అడుగులో కూడా మహిళల సంతోషం కోసమే తమ ప్రభుత్వం తపన పడుతోందన్నారు. గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదని విమర్శించారు. మహిళలు రాజకీయంగా, సామాజికంగా ఎదగాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పించిందన్నారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని చెప్పుకొచ్చారు.