చంద్రబాబులా అబద్ధాలు చెప్పడం నాకు చేతకాదు, అఖండ మెజార్టీతో మళ్లీ మేమే వస్తాం- సీఎం జగన్

రుణమాఫీ చేస్తాను అంటే అధికారంలోకి వచ్చే వాళ్లం. కానీ అలా చెయ్యలేదు. చంద్రబాబు కూడా రుణమాఫీ చేయలేదు.

చంద్రబాబులా అబద్ధాలు చెప్పడం నాకు చేతకాదు, అఖండ మెజార్టీతో మళ్లీ మేమే వస్తాం- సీఎం జగన్

CM Jagan Sensational Speech

CM Jagan : అబద్ధాలు చెప్పడం నాకు చేతకాదు అన్నారు ఏపీ సీఎం జగన్. విశ్వసనీయత అంటే జగన్ అని నమ్మడం వల్లే విజయం వచ్చింది అని చెప్పారాయన. విశ్వసనీయత సంపాదించడం అంత ఈజీ కాదన్నారు సీఎం జగన్. అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం ఇస్తూ సీఎం జగన్ మాట్లాడారు.

”2014 ఎన్నికల్లో రుణమాఫీ చెయ్యమని నా శ్రేయోభిలాషులు చాలామంది చెప్పారు. కానీ, అబద్ధాలు చెప్పడం నాకు చేతకాదు. రుణమాఫీ చేస్తాను అంటే అధికారంలోకి వచ్చే వాళ్లం. కానీ అలా చెయ్యలేదు. చంద్రబాబు కూడా రుణమాఫీ చేయలేదు. అందుకే 2019లో చంద్రబాబు ఓడిపోయారు. విశ్వసనీయత అంటే జగన్ అని నమ్మడం వల్లే విజయం వచ్చింది. విశ్వసనీయత సంపాదించడం అంత ఈజీ కాదు. ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరగాలి. ఇదే సభలో మళ్ళీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతాం. మళ్ళీ అధికారంలోకి వచ్చి బడ్జెట్ ప్రవేశ పెడతాం.

ఈ బ‌డ్జెట్ స‌మావేశాలు ఆర‌వ స‌మావేశాలు. ఇక్క‌డ ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ ను తాత్కాలికంగా 3 నెలలు బ‌డ్జెట్ పెడుతున్నాం. దీనికి మ‌రింత మెరుగులు దిద్ది 2024 జూన్ లో పూర్తిస్ధాయి బ‌డ్జెట్ ను ఇదే సభ‌లో ప్ర‌వేశ‌పెడతాం. ఐదు ప్ర‌జా బ‌డ్జెట్లను ఈ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. అధికారంలోకి జ‌ఠిల‌మైన స‌మ‌యంలో వ‌చ్చాము. కోవిడ్ లాంటి ప‌రిస్ధితులు ఇలా ఉంటాయ‌ని కూడా నేడు ఎన్న‌డూ చూడ‌లేదు. రాష్ట్ర ఆదాయం పెర‌గ‌డం కంటే త‌గ్గిన పరిస్ధితులు చూశాం. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే ప‌న్నుల వాటా ఈ ఐదేళ్లు త‌గ్గాయి” అని సీఎం జగన్ అన్నారు.

Also Read : టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్లే?

”మేము త‌ప్పు చేసి ఉంటే ఆ గాలికి ఎగిరిపోతాం. ఇన్ని పొత్తులు ఎందుకు? చంద్రబాబు హ‌యాంలో అదే రాష్ట్రం అదే బ‌డ్జెట్. అయినా ఎందుకు సంక్షేమం లేదు. మా హ‌యాంలో అప్పు చేసినా ఆ సొమ్మును జ‌నం ఖాతాల్లో వేశాం. ఆ లెక్క‌ల‌న్నీ అందరికీ కనిపిస్తున్నాయి. చంద్ర‌బాబు హ‌యాంలోని డ‌బ్బుల‌న్నీ ఎవ‌రి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాక‌పోయినా చంద్ర‌బాబు చేసిన అప్పులు క‌ట్టుకుంటూనే వ‌స్తున్నాం.
అయినా ఎన్న‌డూ సంక్షేమ ప‌థ‌కాలు ఎగ్గొట్ట‌లేదు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99శాతం అమ‌లు చేశాం. ఇంటింటి ఆర్ధిక వ్య‌వ‌స్ధ‌ను మార్చేశాం. పేద‌ల‌కు అండ‌గా నిల‌బ‌డ‌గ‌లిగాం.

పేద‌ల త‌ల‌రాత‌, భ‌విష్య‌త్తును మార్చేలా ప్ర‌తి రూపాయి బాధ్యతతో వారికి ఇస్తూ హ్యూమ‌న్ క్యాపిట‌ల్ పై పెట్టుబ‌డి పెట్టాము. మా ప్ర‌భుత్వం ఈ ఐదేళ్లలో ప్ర‌జ‌ల‌కు చెడు చేసింది, మంచి చేయ‌లేదు అని ప్ర‌తిప‌క్షం నిజంగా న‌మ్మితే అలాంటి ప‌రిస్ధితుల్లో ప్ర‌తిప‌క్షాలు అన్నీ ఏకం కావాలా? అని అడుగుతున్నా. ఏకం కావాల్సిన అవ‌స‌రం ఏముంది? ఎలాగూ గాలికి ఎగిరిపోతాను కదా. ఒక‌రితో ప్ర‌త్య‌క్షంగా, మ‌రొక‌రితో ప‌రోక్షంగా, జాతీయ పార్టీల‌తోనూ కుట్ర‌ల‌తో ప‌రువు ద‌క్కించుకోవాల్సిన ప‌రిస్ధితిలో ప్ర‌తిప‌క్షం ఉంది. ప్రతిప‌క్షం బ‌ల‌ప‌డ‌లేదు. అభివృద్ది చేసిన అధికార పార్టీకి తిరుగులేదు. దీని అర్ధం ఇదే. అందుకే ప్ర‌తిప‌క్షం కుట్ర‌ల‌ను ఆశ్ర‌యించింది.

టీడీపీ కొత్త‌ కొత్త వాగ్ధానాలతో గార‌డీలు చేస్తోంది. వీటి గురించి ప్ర‌తి ఒక్క‌రూ ఆలోచించాలి. చంద్ర‌బాబుకు 75 ఏళ్లు. ఆయ‌న రాజ‌కీయాల్లోరి వ‌చ్చి 40 ఏళ్లు. చంద్ర‌బాబు మూడుసార్లు సీఎం అయ్యాక కూడా ఆయ‌న నోటి వెంట ఇది చేశాను అని చెప్ప‌డం లేదు. ప్ర‌తి పేద కుటుంబం ఈ విష‌యంలో ఆలోచించాలి.. చ‌ర్చించాలి. ఇన్నేళ్ల తర్వాత కూడా చంద్ర‌బాబు పేరు చెబితే గుర్తుకు వ‌చ్చే ఒక్క స్కీం అయినా ఉందా? ఆయ‌న పేరు చెబితే ఈరోజుకు గుర్తుకు వ‌చ్చేది ప్ర‌జ‌లను, అక్క‌ చెల్లెమ్మ‌ళ్లను, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన విష‌య‌మే గుర్తుకు వ‌స్తుంది.

చంద్ర‌బాబు మ్యానిఫెస్టో అనేక పేజీల‌తో సామాజిక వ‌ర్గాల‌వారీగా హ‌మీలు ఇస్తారు. తర్వాత వ‌దిలేస్తారు. నా హ‌యాంలో ఇది చేశాను అని ఏ గ్రామంలో అయినా చంద్రబాబు చెప్ప‌గ‌ల‌రా? చంద్ర‌బాబు హ‌యాంలో స్కూళ్ళు నిర్వీర్యం అయ్యాయి. ఇప్ప‌డు కూడా చంద్ర‌బాబు మ‌రోసారి అలాంటి అబ‌ద్దాలు, మోసాల‌తో మ్యానిఫెస్టోతో వ‌స్తున్నారు. చంద్ర‌బాబు బంగారు క‌డియం బ‌హుమ‌తిగా ఇస్తాన‌ని ఊబిలో దింపి తినేసే పులి గుర్తుకు వ‌స్తుంది. చంద్ర‌బాబు అబ‌ద్దాలు చెప్ప‌డంలో వెన‌క‌డుగు వేయ‌రు. చంద్ర‌బాబును నమ్మిన వాడు మునుగుతాడు. న‌మ్మించిన వాడు బాగుప‌డ‌తాడు. చంద్రబాబు నాలుగు రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు తీసుకుని ఇక్కడ వాగ్ధానాలు ఇస్తున్నారు” అని సీఎం జగన్ విరుచుకుపడ్డారు.

Also Read : జాగ్రత్త.. జగన్‌ని నమ్ముకుంటే మీరు జైలుకే- వాలంటీర్లకు చంద్రబాబు హెచ్చరిక

”ఇన్ని అబ‌ద్దాలు ఆడే చంద్ర‌బాబును న‌మ్మ‌డం మంచిదేనా? ప్ర‌జ‌లు ఆలోచించాలి. ఏడాదికి 70వేల కోట్లు పేద‌ల కోసం రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింది. ఉచిత విద్యుత్, సామాజిక భ‌ద్ర‌తా పెన్ష‌న్లు, స‌బ్సిడీపై బియ్యం, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యఆస‌రా, ఫీజు రీయింబర్స్ మెంట్, వ‌స‌తి దీవెన‌, సంపూర్ణ‌పోష‌ణ‌, గోరుముద్ద.. ఈ ఎనిమిది ప‌థ‌కాల‌కు 52వేల 700 కోట్లు ఖ‌ర్చు అవుతుంది. ఈ ప‌థకాల‌ను ఎవ్వ‌రూ ర‌ద్దు చేయ‌లేరు.

ఈ ఆరు హ‌మీలు ఈ 52వేల 700 కోట్లకు చంద్ర‌బాబు 6 హామీలు యాడ్ చేస్తే మ‌హ‌శ‌క్తికి 36వేల కోట్లు. త‌ల్లికి వంద‌నం ఎంత‌మంది పిల్ల‌లు ఉంటే అంత‌మందికి ఒక్కొక్క‌రికి 15వేలు చ‌ొప్పున 12వేల 454 కోట్లు. యువ‌గ‌ళం కింద 20 ల‌క్ష‌ల మందికి నెల‌కు 3వేల చొప్పున 7వేల 200 కోట్లు. దీపం ప‌థ‌కం కింద 4వేల 600 కోట్లు, అన్న‌దాత ప‌థ‌కానికి 11వేల కోట్లు. ఈ మొత్తం క‌లిపి 73వేల‌ కోట్లు. వీటికి ఎవ్వ‌రు వ‌చ్చినా తీసే అవ‌కాశం లేని ప‌థకాలు క‌లుపుకోవాలి. రెండు క‌లిపితే ల‌క్షా 26వేల 140 కోట్లు అవుతుంది. ల‌క్షా 26వేల కోట్లు సంవ‌త్సరానికి ఇచ్చేస్తానని చంద్ర‌బాబు ఎలా చెపుతారు? అబ‌ద్ద‌ాలు ఆడ‌డం, కుట్ర చేయ‌డం ఎంత‌వ‌ర‌కూ ధ‌ర్మం? అని అంద‌రూ అలోచించాలి. జ‌గ‌న్ ఇస్తున్న ప‌థ‌కాల‌కు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అంటున్నారు. మరి మీరిచ్చే ప‌థ‌కాల‌కు రాష్ట్రం ఏమ‌వుతుంది?

చంద్ర‌బాబు సంప‌ద సృష్టిస్తారు, ప‌థ‌కాలు పెడ‌తారని చెబుతున్నారు. 1993 వ‌ర‌కూ రాష్ట్రం రెవెన్యూ స‌ర్ ప్ల‌స్. చంద్రబాబు సిఎం అయిన ప్ర‌తిసారీ రెవెన్యూ లోటే ఉంది. చంద్ర‌బాబు 4.47శాతం ఇస్తే మేము 4.82శాతం ఇచ్చాము. దేశానికైనా రాష్ట్రానికైనా మ‌న‌మే అంతో ఇంతో సంప‌ద సృష్టించాం. రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు వినమ్రంగా చెపుతున్నా. 2014లో మాకు కూట‌మికి వ‌చ్చిన ఓటు తేడా కేవ‌లం 1శాతం మాత్ర‌మే.

నేను ఇలా అబ‌ద్దం చెపితే ఆరోజే అధికారంలో ఉండే వాడిని. అస‌లు నా నోట్లో నుంచి అబ‌ద్దాలు రావు అని చెప్ప‌గ‌లుగుతాను. విశ్వ‌స‌నీయ‌త‌కు అర్ధం జ‌గ‌నే. విశ్వ‌స‌నీయ‌త అని జ‌గ‌న్ న‌మ్ముతున్న‌ారు. 98 శాతం హమీలు నేర‌వేర్చాను. గ‌త హ‌యాంలో చంద్ర‌బాబు మోసం చేశారు. విశ్వ‌స‌నీయ‌త ఎప్ప‌టికైనా గెలుస్తుంది. మ‌ళ్లీ ఇదే స‌భలో మూడు నెల‌ల్లో పూర్తి స్ధాయి బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెడ‌తాం” అని సీఎం జగన్ అన్నారు.

మొత్తంగా అసెంబ్లీలో సీఎం జగన్ స్పీచ్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ను త‌ల‌పించిందని టీడీపీ నేతలు అంటున్నారు. గ‌వ‌ర్న‌ర్ స్పీచ్ లోని అంశాల‌ను ప‌క్క‌న పెట్టేసి రాజ‌కీయ ప్ర‌సంగం ఇచ్చారు సీఎం జగన్ అని ధ్వజమెత్తారు.