IPL 2024 : చెలరేగిన బట్లర్, శాంసన్.. బెంగళూరుపై రాజస్థాన్ విజయ దుందుభి

రాజస్థాన్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ (100 నాటౌట్; 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు) అద్భుతమైన సెంచరీతో రాణించగా, సంజూ శాంసంన్ (69; 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సు)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

IPL 2024 : చెలరేగిన బట్లర్, శాంసన్.. బెంగళూరుపై రాజస్థాన్ విజయ దుందుభి

IPL 2024 _ Rajasthan Royals beat Royal Challengers Bengaluru by 6 wickets

IPL 2024 : ఐపీఎల్ 2024లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో శనివారం ఇక్కడ (ఏప్రిల్ 6) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది.

సెంచరీతో విజృంభించిన బట్లర్ :
రాజస్థాన్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ (100 నాటౌట్; 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు) అద్భుతమైన సెంచరీతో రాణించగా, సంజూ శాంసంన్ (69; 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సు)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. బెంగళూరు నిర్దేశించిన 184 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 స్కోరు చేసి ( 5 బంతులు మిగిలి ఉండగానే) మరో విజయాన్ని అందుకుంది.

రాజస్థాన్‌కు వరుసగా నాల్గో విజయం :
దాంతో ఈ ఐపీఎల్ సీజన్‌‌లో రాజస్థాన్‌కు వరుసగా ఇది నాల్గో విజయం. మిగతా ఆటగాళ్లలో షిమ్రాన్ హెట్మెయర్ (11), ధృవ్ జురెల్ (2), రియాన్ పరాగ్ (4) పరుగులకే పరిమితం కాగా.. యశస్వి జైశ్వాల్ ఖాతా కూడా తెరవలేదు. బెంగళూరు బౌలర్లలో రీస్ టోప్లీ రెండు వికెట్లు తీయగా, యశ్ దయాళ్, మహ్మద్ షిరాజ్ తలో వికెట్ తీసుకున్నారు. రాజస్థాన్ జట్టును విజయతీరాలకు చేర్చిన జోస్ బట్లర్‌ (100/58)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

కోహ్లీ తొలి సెంచరీ.. నాన్ వికెట్ కీపర్ (110)గా రికార్డు :
తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి జట్టు రాజస్థాన్ రాయల్స్‌కు 184 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు ఓపెనర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (113 నాటౌట్; 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులు)తో తొలి సెంచరీతో అజేయంగా నిలిచాడు. అంతేకాదు.. ఐపీఎల్ మ్యాచ్‌‌ల్లో అత్యధిక క్యాచ్ (110)లతో నాన్ వికెట్ కీపర్‌గా కూడా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.

బెంగళూరు జట్టు కెప్టెన్ డు ప్లెసిస్ (44; 33 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు)తో రాణించగా, సౌరవ్ చౌహాన్ (9), కామెరాన్ గ్రీన్ (5), గ్లెన్ మ్యాక్స్ వెల్ (1) పరుగులకే చేతులేత్తేశారు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 2 వికెట్లు తీయగా, నాంద్రే బర్గర్ ఒక వికెట్ తీసుకున్నాడు.

మొదటి స్థానంలో కోహ్లీ.. రెండో స్థానంలో బట్లర్, గేల్ :
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన కోహ్లీ 8 సెంచరీలతో మొదటి స్థానంలో నిలవగా, 6 సెంచరీలను నమోదు చేసిన బట్లర్‌.. గేల్‌తో సమానంగా రెండో స్థానంలో నిలిచాడు.

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో రాజస్థాన్ :
ఈ ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 4 మ్యాచ్‍లు ఆడిన రాజస్థాన్ 4 గెలిచి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఇక, ఆడిన 5 మ్యాచ్‍ల్లో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి 4 ఓడిన బెంగళూరు జట్టు 2 పాయింట్లతో 8వ స్థానంలోకి దిగజారింది.

Read Also : ఐపీఎల్-2024లో మొట్టమొదటి సెంచరీ బాదిన కోహ్లీ.. అత్యధిక సెంచరీలు చేసింది వీరే..