వాళ్ల ఆస్తులు పణంగా పెట్టి ప్రాజెక్ట్‌లు కట్టలేదు- కేసీఆర్, కేటీఆర్‌లపై మంత్రి ఉత్తమ్ ఫైర్

నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్.. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

వాళ్ల ఆస్తులు పణంగా పెట్టి ప్రాజెక్ట్‌లు కట్టలేదు- కేసీఆర్, కేటీఆర్‌లపై మంత్రి ఉత్తమ్ ఫైర్

Uttam Kumar Reddy : మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మించినప్పటి నుంచే లీకేజీలు ఉన్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాజెక్ట్ పునాదుల నుంచే సరిగా పనులు జరగలేదని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ వారి ఆస్తులు పణంగా పెట్టి ప్రాజెక్టులు కట్టలేదని.. తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి కట్టారని మండిపడ్డారు. తెలంగాణపై శాశ్వత భారం మోపారని ధ్వజమెత్తారు. ప్రాజెక్ట్ ను రిపేర్ చేయడానికే తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు మంత్రి ఉత్తమ్.

కాళేశ్వరంపై మంత్రి కేటీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కమీషన్ల కోసం బీఆర్ఎస్ ప్రాజెక్టులు కట్టిందని ఆయన ఆరోపించారు. కేటీఆర్ అబద్దాలను ప్రజలు నమ్మడం లేదన్నారు. నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్.. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలస్యంగా పనులు చేసే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు.

”వందల కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ ని 80వేల కోట్లకు పెంచారు. ఆనకట్ట సుమారుగా సేమ్. ముందున్న ప్రాజెక్ట్ ద్వారా, ఒక్క లిప్ట్ ద్వారా, ఎక్కువ గ్రావిటీ ద్వారా ఎళ్లంపల్లికి నీళ్లు రావాలి. వీళ్లు రూపొందించిన ప్రాజెక్ట్ లో 3 లిఫ్ట్ ల ద్వారా ఎల్లంపల్లికే నీళ్లు రావాలి. ఈ ప్రాజెక్ట్ డిజైన్ మార్చినప్పుడు.. రీ-డిజైన్, రీ-ఇంజినీరింగ్ పేరుతో చాలా పచ్చి అబద్దాలు మాట్లాడారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టొద్దని, ఖర్చు ఎక్కువగా ఉంటుందని, సమయం ఎక్కువ పడుతుందని నిపుణులు లిఖితపూర్వకంగా రిపోర్టు ఇచ్చారు. అధికారిక రికార్డు నుంచి ఆ రిపోర్టు మాయం చేసే ప్రయత్నం చేశారు. అధికారిక రికార్డు నుంచి ఆ జీవోని మాయం చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే సరిపోయిన డబ్బులు రావని అనుకున్నారో, లేక ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తే కాంగ్రెస్ కు పేరు వస్తుందని అనుకున్నారో కానీ.. దాన్ని రీ డిజైన్ చేసి, 80వేల కోట్లకు పెంచి, మేడిగడ్డకు షిఫ్ట్ చేశారు” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Also Read : వనపర్తి కాంగ్రెస్‌లో ఏం జరుగుతోందో తెలుసా?