ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లి.. హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆర్సీబీ సారథ్య బాధ్యతలు మళ్లీ కోహ్లికి అప్పగించాలని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.

ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లి.. హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Why not bring Virat Kohli back as RCB captain says Harbhajan Singh (Photo Credit: @RCBTweets)

Harbhajan Singh on Virat Kohli:  ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్‌కు చేరాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు చేరాలంటే త‌న చివ‌రి మ్యాచ్‌తో పాటు ఇతర మ్యాచ్‌ల‌ ఫలితాలు ఆ జట్టుకు అనుకూలంగా రావాల్సి ఉంటుంది. సీజన్ ఆరంభంలో తడబడిన ఆర్సీసీ తర్వాత పుంజుకుని వరుసగా ఐదు విజయాలు సాధించి ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఒకవేళ ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు వెళ్లకపోతే విరాట్ కోహ్లిని మళ్లీ కెప్టెన్ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.

ఐపీఎల్ తాజా సీజన్‌లో విరాట్ కోహ్లి అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాంప్ దక్కించుకున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 661 పరుగులతో లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. బ్యాటుతోనే కాకుండా జట్టుకు అనేక రకాలుగా సేవలు అందిస్తున్నాడు. బౌలింగ్‌కు అనుగుణంగా ఫీల్డింగ్ సెట్ చేయడంలో కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌కు సహాయం చేస్తున్నాడు. కష్ట సమయాల్లో బౌలర్ల మనోధైర్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక ఫీల్డింగ్‌లో కోహ్లి మెరుపులు సరేసరి. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లి కూడా ఎంఎస్ ధోని లాంటి పెద్ద నాయకుడని, ఫ్రాంచైజీపై అతడి ప్రభావం ఎక్కువగా ఉందని హర్భజన్ అన్నాడు. ఆర్సీబీ సారథ్య బాధ్యతలు మళ్లీ కోహ్లికి అప్పగించాలని అభిప్రాయపడ్డాడు.

“వారు అర్హత సాధించకపోతే, భారతీయ వ్యక్తి కోసం చూస్తారు. విరాట్ కోహ్లీని తిరిగి కెప్టెన్‌గా ఎందుకు తీసుకురాకూడదు? చెన్నైలో ధోని ప్రభావం చాలా ఉంది. విరాట్ కోహ్లి కూడా పెద్ద నాయకుడు. ఎలాంటి క్రికెట్ ఆడాలో అతనికి బాగా తెలుసు. ఇప్పుడు వారు చాలా దూకుడు ఆడుతున్నారంటే అదంతా విరాట్ కోహ్లి తీసుకొచ్చిందే. విరాట్ కోహ్లి మరింత ముందుకు సాగడాన్ని నేను చూడాలనుకుంటున్నాను” అని హర్భజన్ స్టార్ స్పోర్ట్స్‌లో చెప్పాడు.

Also Read: వ‌రుణ దేవా ఎంత ప‌ని జేస్తివి.. ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజ‌రాత్ ఔట్‌.. ఆర్‌సీబీకి ప్లస్సా, మైనస్సా?

ఐపీఎల్ 2021 తర్వాత తన పనిభారాన్ని తగ్గించుకోవడానికి కోహ్లి RCB కెప్టెన్సీని వదులుకున్నాడు. అతడి నాయకత్వంలో 2016 ఎడిషన్‌లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరుకుంది.

Also Read: రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌నున్న రోహిత్ శ‌ర్మ‌? ఫామ్‌లో లేక‌పోయిన పాండ్య ఎంపిక అందుకేనా?