సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. కేసీఆర్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

సీజేఐ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది.

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. కేసీఆర్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

KCR Power Purchase Agreement Petition : తెలంగాణ సర్కార్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాల్లో అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ ను తప్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తక్షణమే విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహా రెడ్డిని మార్చాలంది. ఆయన స్థానంలో కొత్త జడ్జిని నియమించాలని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి.

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. కమిషన్ చైర్మన్ తన అభిప్రాయాలు ఎలా వ్యక్తం చేస్తారని నిలదీశారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాదు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారని అభిప్రాయపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాలపై ట్రిబునల్ ఉండగా.. న్యాయ విచారణ ఎలా చేస్తారని ప్రశ్నించారు.

విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కీలక ఆదేశాలూ ఇచ్చింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో కొత్త వారిని నియమించి తదుపరి విచారణను కొనసాగించవచ్చిన కోర్టు స్పష్టం చేసింది. కమిషన్ రద్దు చేయాల్సిన అవసరం లేదన్న ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించింది. సోమవారంలోగా కొత్త చైర్మన్ ను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెల్లడించింది.

విద్యుత్ కమిషన్‌పై సుప్రీం తీర్పు రేవంత్‌కు చెంప పెట్టు- ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి
”విద్యుత్ కమిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు సీఎం రేవంత్ కు చెంప పెట్టు. విచారణకు ముందే మీడియా సమావేశం పెట్టడం తప్పని కోర్టు స్పష్టం చేసింది. కేసీఆర్ పై బురద చల్లేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలో ఇదో భాగం. మేము ప్రభుత్వం దగ్గరే ఒప్పందం చేసుకున్నాం. ఉద్దేశపూర్వకంగా జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహరించారు. ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్ దృష్టి పెట్టాలి. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. విద్యుత్ కమిషన్ పై సీజేఐ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం. విచారణ పూర్తి కాకముందే జస్టిస్ నరసింహా రెడ్డి ప్రెస్ మీట్ లు పెట్టడం తప్పు. సీజేఐ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. రేవంత్ ఇచ్చిన స్క్రిప్ట్ నే కమిషన్ చెప్పింది. విద్యుత్ కొనుగోళ్లు సక్రమంగానే జరిగాయి. ఎలాగైనా కేసీఆర్ ను ఇరికించాలని చూశారు” అని ప్రశాంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.

నేను ఎక్కడా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదు- జస్టిస్ నరసింహా రెడ్డి
”నేను ఎక్కడా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదు. రోజు మార్చి రోజు కమిషన్ ప్రెస్ బ్రీఫింగ్ ఏర్పాటు చేసింది. మీడియా సమావేశం ఏర్పాటు చేయకుంటే పత్రికల్లో ఊహాజనిత సమాచారం రాస్తున్నారు. కమిషన్ గురించి తమకు నచ్చినట్టు రాస్తున్నారు కాబట్టే మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. కమిషన్ విచారణ బహిరంగంగా జరగాలి కాబట్టి పబ్లిక్ నోటీస్ ఇచ్చాము. ఒక జస్టిస్ హోదాలో ఉన్న నాకు ఎలాంటి పక్షపాతం లేదు. ఒకవేళ పక్షపాత ధోరణి అంటగడితే న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోతుంది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడేందుకు నేను కమిషన్ నుండి తప్పుకుంటున్నా” అని జస్టిస్ నరసింహా రెడ్డి తెలిపారు.

Also Read : బ్రాహ్మణికి తెలంగాణ టీడీపీ బాధ్యతలు? చంద్రబాబు నిర్ణయంపై కేడర్‌లో ఆసక్తి..