బ్రాహ్మణికి తెలంగాణ టీడీపీ బాధ్యతలు? చంద్రబాబు నిర్ణయంపై కేడర్‌లో ఆసక్తి..

నారా-నందమూరి కుటుంబ సభ్యుల నాయకత్వం ఉంటేనే తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని... అలా కాదని ఇంకెవరికైనా బాధ్యతలు అప్పగిస్తే.. ఇప్పటిలాగే అచేతనంగా మిగిలి పోవాల్సి వుంటుందని భావిస్తున్నారు కార్యకర్తలు.

బ్రాహ్మణికి తెలంగాణ టీడీపీ బాధ్యతలు? చంద్రబాబు నిర్ణయంపై కేడర్‌లో ఆసక్తి..

Gossip Garage : తెలంగాణ టీడీపీకి మంచి రోజులొస్తున్నాయా? ఇప్పటికే ఇతర పార్టీల్లోకి వెళ్లిన మాజీలు మళ్లీ సొంతగూటికి వస్తామని కబురు చేస్తుండగా, ఇప్పుడు మరో తాజా వార్త టీడీపీ శ్రేణుల్లో జోష్‌ నింపుతోంది. తెలంగాణలో పార్టీ పునర్‌ వైభవానికి నారా-నందమూరి కుటుంబమే బాధ్యతలు తీసుకోనుందనే సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీకి నూతన జవసత్వాలు నింపుతానని చంద్రబాబు ప్రకటించడం…తెలంగాణలో పార్టీ శ్రేణులకు తాను అందుబాటులో ఉంటానని బాలయ్య కూడా చెప్పడంతో క్యాడర్‌లో హుషారు కనిపిస్తోంది. ఇదే సమయంలో బాలయ్య కూతురు.. చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి కూడా టీటీడీపీ బలోపేతంపై ఫోకస్‌ చేశారనే ప్రచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

టీటీడీపీ బాధ్యతలు ఎవరికి?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి వడివడిగా అడుగులు పడుతున్నాయా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం చుక్కాని లేని నావలా తయారైన టీ టీడీపీలో జోష్‌ నింపేందుకు అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఏపీలో తిరుగులేని విజయం సాధించిన చంద్రబాబు… అదే ఊపులో తెలంగాణలోనూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్నారు. గత వారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చిన చంద్రబాబు… తెలంగాణలో పార్టీ బలపేతంపై దృష్టి పెడతానని హామీ ఇచ్చారు. దీంతో టీటీడీపీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారా? అనే చర్చ మొదలైంది.

నేతల కొరత ఉన్నా, కార్యకర్తల బలం మాత్రం ఉంది..
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నేతల కొరత ఉన్నా, కార్యకర్తల బలం మాత్రం ఉంది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో టీడీపీ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోయినా, ఆ పార్టీ కార్యకర్తల మద్దతు కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నించారు. కోదాడ, హుజూర్‌నగర్‌, ఖమ్మం నియోజకవర్గాల్లో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ కార్యాలయాలకు వెళ్లి ఆ పార్టీ కార్యకర్తల మద్దతు కోరడం… తెలంగాణలో టీడీపీ ప్రభావానికి ఉదాహరణగా చెప్పొచ్చు.

విభజన తర్వాత కష్టాల్లో టీడీపీ..
ఐతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా చేశారు. ఆ తర్వాత ఏడు నెలలుగా తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ కష్టాల్లో పడింది. రాష్ట్ర విభజన తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఎల్‌.రమణ రాజీనామా చేయగా, ఆయన తర్వాత బాధ్యతలు స్వీకరించిన బక్కని నర్సింహులు సరైన నాయకత్వం అందజేయలేకపోయారు. దీంతో కాసాని జ్ఞానేశ్వర్‌ను పార్టీలోకి తీసుకుని రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించారు. కానీ, ఆయన కూడా ఏడాదిలోనే పార్టీని వీడి వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర పార్టీ నాయకత్వం ఎవరు చేపడతారా? అనేది ఆసక్తి రేపుతోంది.

మళ్లీ సొంతగూటికి మల్లారెడ్డి, నామా?
ఇదే సమయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరూ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, టీడీపీ శ్రేణులు సీనియర్‌ నేతలు ఎవరు వచ్చినా, పార్టీ బాధ్యతలు మాత్రం నారా-నందమూరి కుటుంబ సభ్యులు తీసుకుంటేనే బాగుంటుందని సూచిస్తున్నారు.

బ్రాహ్మణి బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం..
గత ఏడాది చంద్రబాబు అరెస్టు సమయంలో తెలంగాణలో పార్టీ బాధ్యతలను తీసుకుంటానని హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య ముందుకువచ్చారు. ఎన్టీఆర్‌ భవన్‌లో సమావేశం నిర్వహించి తాను ప్రతివారం అందుబాటులో ఉంటానని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ప్రకటించారు. కానీ, ఏపీ రాజకీయాలు, సినిమాల్లో బిజీగా ఉన్న బాలయ్య.. తన మాట నిలబెట్టుకోలేకపోయారు. దీంతో ఆయన స్థానంలో బాలయ్య కూతురు బ్రాహ్మణి టీ.టీడీపీ బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందని తెలంగాణ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ యువనేత లోకేశ్‌ భార్యగా… చంద్రబాబు కోడలిగా బ్రాహ్మణి కుటుంబ వ్యాపార రంగంలో బిజీగా ఉన్నారు.

చంద్రబాబు అరెస్ట్ సమయంలో స్ఫూర్తి నింపిన బ్రాహ్మణి పోరాటం..
కానీ, అన్న ఎన్టీఆర్‌ మనవరాలిగా, బాలయ్య కూతురుగా ఆమెకు పొలిటికల్‌ సర్కిల్స్‌లో మంచి ఇమేజ్‌ ఉంది. ఇక చంద్రబాబు అరెస్టు సమయంలో రాజమండ్రి వేదికగా బ్రాహ్మణి జరిపిన పోరాటం టీడీపీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపింది. కోర్టు పనుల నిమిత్తం లోకేశ్‌ ఢిల్లీలో ఉండిపోతే… రాజమండ్రిలో అత్త భువనేశ్వరికి తోడుగా బ్రాహ్మణి కార్యకర్తలను కలిసి, కేడర్‌లో ధైర్యం నింపిన వైనాన్ని ఎవరూ మరచిపోలేరు. అప్పట్లోనే టీడీపీకి సమర్థ మహిళా నాయకత్వం లభించిందని విశ్లేషణలు వెలువడ్డాయి.

బాధ్యతలు బ్రాహ్మణికి అప్పగించాలని విజ్ఞప్తి..
అయితే చంద్రబాబు విడుదల తర్వాత, బ్రాహ్మణి పూర్తిగా వ్యాపార వ్యవహారాలకే పరిమితమయ్యారు. రాజకీయాలు తనకు తాత్కాలికమని తేల్చేశారు. కానీ, ఇప్పుడు తెలంగాణలో పార్టీ కష్టకాలంలో ఉండటంతో బ్రాహ్మణికి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్‌ కార్యకర్తల నుంచి వినిపిస్తోంది. చంద్రబాబు సీఎంగా ఏపీకే ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుందని… ఇక యువనేత లోకేశ్‌ కూడా ఏపీపై ఫోకస్‌ చేయాల్సి ఉన్నందున తెలంగాణ బాధ్యతలు బ్రాహ్మణికి అప్పగించాలని కార్యకర్తలు కోరుతున్నారు.

చంద్రబాబు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి?
నారా-నందమూరి కుటుంబ సభ్యుల నాయకత్వం ఉంటేనే తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని… అలా కాదని ఇంకెవరికైనా బాధ్యతలు అప్పగిస్తే.. ఇప్పటిలాగే అచేతనంగా మిగిలి పోవాల్సి వుంటుందని భావిస్తున్నారు కార్యకర్తలు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. కార్యకర్తల డిమాండ్‌ మేరకు బ్రాహ్మణిని తెలంగాణ తెరపైకి తీసుకువస్తారా? లేక ఎప్పటిలానే కుటుంబ సభ్యులను రాజకీయాలకు దూరంగా ఉంచుతూ… సీనియర్‌ నేతలు ఇంకెవరికైనా బాధ్యతలు అప్పగిస్తారా అనేది చూడాల్సి వుంది.

Also Read : విశాఖ వైసీపీ విలవిల.. ఎక్కడా కనిపించని వైసీపీ నేతలు