పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వాహనం ధ్వంసం

మరోవైపు మిథున్ రెడ్డి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వాహనం ధ్వంసం

Punganur High Tension : పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కారుతో సహా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రస్తుతం మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోనే ఉన్న మిథున్ రెడ్డి.. పుంగనూరు విడిచి వెళ్లేదే లేదంటున్నారు. తక్షణం పుంగనూరు నుంచి వెళ్లిపోవాలని మిథున్ రెడ్డిని పోలీసులు కోరారు. అయితే, తాను వెళ్లేదే లేదని మిథున్ రెడ్డి తేల్చి చెప్పారు. మరోవైపు మిథున్ రెడ్డి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, మిథున్ రెడ్డి పుంగనూరు విడిచి వెళ్ళాల్సిందేనని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. లేదంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాయి. మరోవైపు మాజీ ఎంపీ రెడ్డప్ప కారు కాల్చివేశారు. ఇంటి బయట పార్కింగ్ చేసి ఉన్న కారును అల్లరిమూకలు తగలబెట్టాయి.

అధికారం శాశ్వతం కాదు, బీహార్ కన్నా దారుణం అవుతుంది- ఎంపీ మిథున్ రెడ్డి
”వైసీపీ కార్యకర్తలపై దాడులు ప్రోత్సహించి చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారు. వినుకొండలో నడిరోడ్డుపై మా కార్యకర్తను చంపారు. ఓ ప్రజాప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. కానీ నన్ను అడ్డుకుంటున్నారు. మారణాయుధాలు, రాళ్ళతో వందలాది మంది దాడులు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ డైరెక్షన్ తో ఇదంతా జరుగుతోంది. వీటన్నింటిని ఎదుర్కొంటాము. ఎక్కువ రోజులు ఇవి సాగవు. అధికారం శాశ్వతం కాదు. ఈరోజు ఎన్నికలు పెట్టినా మాకు ఎక్కువ సీట్లు వస్తాయి.

కక్షపూరిత రాజకీయాలతో పుంగనూరు నష్టపోతోంది. ఇలాంటి దాడులు మళ్ళీ మిమ్మల్ని చుట్టుకుంటాయి. దాడులకు భయపడే ప్రసక్తే లేదు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. వారి ముందే దాడులు జరుగుతున్నాయి. వారిపై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారు. ఇదే జరిగితే బీహార్ కన్నా దారుణం అవుతుంది” అని ఎంపీ మిథున్ రెడ్డి హెచ్చరించారు.

Also Read : నిన్న లక్షలు, నేడు కోట్లు…! పిఠాపురంలో భూముల ధరలకు రెక్కలు.. నెల రోజుల్లోనే ఎందుకింత మార్పు? కారణం ఏంటి?