45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి..! ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి- జగన్

వైసీపీ ప్రభుత్వంలో ఉండగా టీడీపీ వాళ్ళని కొట్టండి, చంపండి అనలేదు. హత్యాచారాలు జరిగినా, హత్యలు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదు.

45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి..! ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి- జగన్

Ys Jagan Mohan Reddy : వైసీపీ కార్యకర్తలపై వరుస దాడుల వ్యవహారంపై మాజీ సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు లక్ష్యంగా నిప్పులు చెరిగారు. 45 రోజుల కూటమి పాలనలో రాష్ట్రంలో 36 రాజకీయ హత్యలు, 300 హత్యాయత్నాలు జరిగాయని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదన్న జగన్.. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

”అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం. బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తాం. రాష్ట్రంలో అరాచకాలు దేశం మొత్తం తెలియజేస్తాం. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి అపాయింట్ మెంట్ అడిగాం. ఖరారు కాగానే అందరినీ కలుస్తా. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరతా. తన నియోజకవర్గంలో ఎంపీ మిథున్ రెడ్డి తిరగకూడదా..? పోలీసుల సమక్షంలో రెడ్డప్ప కారు కాల్చేసి ఇంటిపై దాడి చేశారు. లా అండ్ ఆర్డర్ పట్టించుకునే పరిస్థితుల్లో పోలీసులు లేరు.

హత్యాచారాలు జరిగినా, హత్యలు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో ఉండగా టీడీపీ వాళ్ళని కొట్టండి, చంపండి అనలేదు. చంద్రబాబు తప్పుడు మాటలు, వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మా పాలనలో పథకాలు క్యాలెండర్ పెట్టి మరీ అమలు చేశాం. రెండు క్వార్టర్లలకు విద్యా దీవెన బకాయి ఉంది. అమ్మఒడి, రైతు భరోసా ఈపాటికి ఖాతాల్లో వేసే వాళ్ళం. ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మకి వందనం అన్నారు. ఏది మరి..? ఆడపిల్లలకు రూ.1500 ఇస్తాము అన్నారు.. ఇచ్చారా..? 1.80 కోట్ల మంది 1500 కోసం ఎదురు చూస్తున్నారు. ఇవ్వండి.
హామీల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ దాడులు చేస్తున్నారు” అని జగన్ ధ్వజమెత్తారు.

గుంటూరు జిల్లా వినుకొండలో దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. రషీద్ నివాసానికి వెళ్లిన ఆయన రషీద్ కుటుంబసభ్యులను పరామర్శించారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు జగన్.

Also Read : వైసీపీ కార్యకర్తలపై దాడులు.. మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం