ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు: రేవంత్ రెడ్డి

మూసీ అభివృద్ధి చూడగానే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.

ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు: రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లి ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. దీంతో ఐటీ కారిడార్‌ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లేవారికి ట్రాఫిక్‌ కష్టాలు తప్పుతాయి. నల్లగండ్ల, తెల్లాపూర్‌, చందానగర్‌, బీహెచ్‌ఈఎల్‌ ప్రాంతాలకు దీని మీదుగా వెళ్లవచ్చు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. శేరిలింగంపల్లిని వేగంగా అభివృద్ధి చేసే బాధ్యతను తమ సర్కారు తీసుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో సమస్యలకు పరిష్కారం చూపడానికి హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేశారు.

మూసీని సుందరీకరిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 50వేల కోట్లతో పనులను ప్రారంభించుకోబోతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే మన ముందున్న లక్ష్యమని తెలిపారు. మూసీ అంటే ప్రస్తుతం ముక్కు మూసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. మూసీ అభివృద్ధి చూడగానే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. నగర అభివృద్ధిలో అందర భాగస్వాములు కావాలని అన్నారు. రాష్ట్రానికి 65 శాతం ఆదాయం జంట నగరాల నుంచే వస్తోందని చెప్పారు. హైదరాబాద్‌కు ఎవరు వచ్చినా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

Also Read: ‘ఇక పోరాడదాం.. గట్టిగా హెచ్చరికలు పంపాలి’.. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు