టీడీపీని వీడి వైసీపీలో చేరి పెద్ద తప్పు చేశారా? ఆ మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ లైఫ్ ఇక క్లోజేనా?

మాజీ ఎమ్మెల్యే పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందంటున్నారు. రాజకీయాల్లో గిరి ఎంత వేగంగా ఎదిగారో.. అంతే వేగంగా పతనమయ్యారు అంటున్నారు పరిశీలకులు.

టీడీపీని వీడి వైసీపీలో చేరి పెద్ద తప్పు చేశారా? ఆ మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ లైఫ్ ఇక క్లోజేనా?

Gossip Garage : రాజకీయాల్లో హత్యలు ఉండవు… ఆత్మహత్యలే ఉంటాయంటారు… నిజమే రాజకీయంగా వేసే తప్పటడుగులు నేతల భవిష్యత్‌ను నాశనం చేస్తాయి… ఇలా తమ రాజకీయ జీవితాలను కోల్పోయిన నేతలు కోకొల్లలు. ఇప్పుడు ఆ లిస్టులో గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి చేరారు. వైసీపీ గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడైన గిరి తాజాగా పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీ ఓటమి తర్వాత తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనైన గిరి… ఇక వైసీపీలో ఉంటే ప్రయోజనం లేదని భావించి ఆ పార్టీకి బైబై చెప్పేశారు. సొంత పార్టీ టీడీపీని వదిలి.. వైసీపీలో చేరిన గిరి… తిరిగి సొంతగూటికి వెళ్లలేక వైసీపీలో కొనసాగలేక రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోయారా? అసలు గిరి వేసిన తప్పటడుగులు ఏంటి?

టీడీపీ వీడి వైసీపీలో చేరిన నుంచి అవమానాలే..!
లేక లేక వచ్చిన అవకాశం చేజేతులా నాశనం చేసుకోవడం ఎలా ఉంటుందంటే గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి రూపంలో చూసుకోవచ్చుంటున్నారు. ఆర్య వైశ్య సామాజికవర్గానికి చెందిన గిరి 2019 ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీకి గట్టి పట్టున్న ఆ నియోజకవర్గంలో వేరే పార్టీకి చాన్సే లేదనే విశ్లేషణలు ఉన్నాయి. అలాంటి చోట.. ఆర్య వైశ్య వర్గానికి చెందిన గిరిని నిలపడమే కాకుండా గెలిపించింది టీడీపీ… ఐతే కోరి టికెట్ ఇచ్చిన టీడీపీకి గెలిచిన వెంటనే షాక్ ఇచ్చారు గిరి. 2019 మేలో ఎన్నికలు జరిగితే…. ఆ ఏడాది చివరికల్లా అధికార పార్టీకి సన్నిహితుడిగా మారిపోయారు. 2019లో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. మొదటిసారి పార్టీ మారింది మద్దాల గిరినే… ఇలా పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే వైసీపీలోనూ ఇమడలేకపోయారు. వైసీపీలో చేరిన నుంచి అవమానాలే ఎదుర్కొని చివరికి ఎన్నికల్లో పోటీకి కూడా అవకాశం దక్కించుకోలేకపోయారు.

పార్టీ మారాక ఉత్సవ విగ్రహంలా మిగిలిపోయారు..
2019లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాల గిరికి అదే చివరి అవకాశం అవుతుందని ఊహించి ఉండరు. తొలిసారి గెలిచినప్పుడు అధికారం దక్కకపోవడం, వ్యాపార అవసరాల రీత్యా అధికార పార్టీ పట్ల ఆకర్షితులయ్యానని చెప్పుకున్నారు గిరి. కానీ, వైసీపీలో చేరినా ఆయనకు పెద్దగా ఒరిగిందేమీ లేదనే అభిప్రాయమే ఉంది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో గిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి… ఆ నియోజకవర్గంలో వైసీపీకి చెందిన ఇతర నాయకుల పెత్తనమే ఎక్కువగా నడించిందనే చెబుతారు. దీంతో పార్టీ మారిన తర్వాత ఎమ్మెల్యే ఉత్సవ విగ్రహంలా మిగిలిపోయారంటున్నారు. ఇక అధికార పార్టీలో ఉన్నప్పటికీ పెద్దగా పవర్ లేకపోవడం వల్ల… గిరి మాట కూడా ఎక్కడా చెల్లుబాటు కాలేదనే అభిప్రాయం ఉండేది. దీంతో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్నారు. చివరికి ఈ కారణం చూపే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కూడా నిరాకరించింది వైసీపీ.

వైసీపీ నేతల మెప్పు కోసం చంద్రబాబు, లోకేశ్ పై తీవ్ర విమర్శలు…
మరోవైపు వైసీపీ నేతల మెప్పు కోసం టీడీపీ అధినేత చంద్రబాబుతోసహా యువనేత లోకేశ్‌పైనా తీవ్ర విమర్శలు చేసేవారు గిరి. అటు వైసీపీలో పలుకుబడి పెంచుకోలేక.. ఇటు టీడీపీతో పూర్తిగా సంబంధాలు తెంచుకుని చేజేతులా తన రాజకీయ జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకున్నారు. తాజా ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గిరి బదులుగా పోటీ చేసిన మాజీ మంత్రి విడదల రజినీ కూడా గెలవలేదు. పార్టీ కూడా ఘోర పరాజయం పాలైంది. ఇక తనకు ఇచ్చిన గుంటూరు నగర పార్టీ అధ్యక్ష పదవిలో కూడా సంతృప్తి దక్కకపోవడంతో పార్టీని వీడారు మద్దాల గిరి. అటు టీడీపీలో కూడా మాజీ ఎమ్మెల్యే గిరిపై సానుకూల దృక్పథం లేకపోవడంతో… ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లేనన్న వాదన వినిపిస్తోంది.

రాజకీయాల్లో ఎంత వేగంగా ఎదిగారో.. అంతే వేగంగా పతనం..
ప్రస్తుతం గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ల మాధవి ఎమ్మెల్యేగా గెలిచారు. గుంటూరు ఎంపీగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. అదేవిధంగా నగరంలోనూ టీడీపీ బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకోవద్దని నిర్ణయం తీసుకుంది టీడీపీ. దీంతో మాజీ ఎమ్మెల్యే గిరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందంటున్నారు. రాజకీయాల్లో గిరి ఎంత వేగంగా ఎదిగారో.. అంతే వేగంగా పతనమయ్యారు అంటున్నారు పరిశీలకులు.

మరోవైపు టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ, జనసేనల్లో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే టీడీపీ మిత్రపక్షాలైన ఆ రెండు పార్టీలు కూడా… భాగస్వామ్య పక్షాలకు నష్టం కలిగేలా చేరికలను ప్రోత్సహించకూడదని నిర్ణయించడం మాజీ ఎమ్మెల్యే గిరి పాలిట ఆశనిపాతంగానే చెబుతున్నారు. మొత్తానికి ఓ రాజకీయ నాయకుడిగా మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి ఫెయిల్యూర్ స్టోరీ… మిగిలిన వారిని అప్రమత్తం అయ్యేలా చేస్తుందని అంటున్నారు పరిశీలకులు.

Also Read : బడ్జెట్‌లో అగ్ర తాంబూలం, గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రం భారీ సాయం.. ఏపీకి కలిసొచ్చిన అంశాలేంటి?