కాంగ్రెస్‌కు బిగ్ షాక్? సొంతగూటికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు? కారణం అదేనా..

ఈ పరిస్థితే కొనసాగితే కొత్తగా ఎవరూ పార్టీలోకి వచ్చే అవకాశం ఉండదని.. అత్తెసరు మెజార్టీతో ప్రభుత్వాన్ని నడపడం కూడా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్‌కు బిగ్ షాక్? సొంతగూటికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు? కారణం అదేనా..

Gossip Garage : భూమి గుండ్రంగా ఉంది అన్నట్లే సాగుతోంది తెలంగాణ రాజకీయం. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో కాంగ్రెస్‌ వలకు చిక్కిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. మళ్లీ సొంతగూటికి చేరుతుండటంతో ఆకర్ష్‌.. వికర్ష్‌గా మారుతోందా? అన్న చర్చకు దారితీస్తోంది. బీఆర్‌ఎస్‌ ఎల్పీ విలీనమంటూ ప్రకటనలు చేసిన కాంగ్రెస్‌కు షాక్‌నిస్తూ… కొద్దిరోజుల క్రితం హస్తం పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బ్యాక్‌ టు పెవీలియన్‌ అన్నట్లు మళ్లీ కారు ఎక్కేందుకు సిద్ధమవడం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. కృష్ణమోహన్‌రెడ్డి రూట్లో మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మళ్లీ గులాబీ గూటికి వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి… ఈ ఊహాగానాలు నిజమేనా? జంపింగ్‌ ఎమ్మెల్యేలు పీఛేముడ్‌ అని ఎందుకంటున్నారు…?

బండ్ల తోవలో మరో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు?
కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు షాక్‌ ఇచ్చారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి. గోడకు కొట్టిన బంతిలా బీఆర్‌ఎస్‌ నుంచి ఎంత వేగంగా కాంగ్రెస్‌లో చేరారో… అంతే వేగంగా చడీచప్పుడు చేయకుండా తిరిగి సొంత గూటికి చేరిపోయారు బండ్ల. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకుని ఆ పార్టీకి శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని సవాల్‌ విసిరిన కాంగ్రెస్‌కు ఈ పరిణామంతో చెక్‌ చెప్పినట్లైంది. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే బండ్ల మళ్లీ వెనక్కి రావడానికి కారణం ఏమై ఉంటుందనే చర్చ మొదలైంది. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు జంప్‌ చేయగా, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తోవలో మరో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు కూడా సొంత పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

జంపింగ్ ఎమ్మెల్యేలకు సహకరించని స్థానిక కాంగ్రెస్‌ క్యాడర్‌..
ఈ నెల 24న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల నాటికి కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ ఎల్పీ విలీనం చేసుకోవాలనే దిశగా ఆ పార్టీ నేతలు పావులు కదిపారు. ఐతే కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం ఆశించిన స్థాయిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ఆకర్షించలేకపోయారు. బీఆర్‌ఎస్‌కు మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు ఉండగా, దపదఫాలుగా 10 మంది కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఎలాగైనా 26 మందిని లాగేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేయడంతోపాటు బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనమైనట్లు ప్రకటించాలని అడుగులు వేసింది కాంగ్రెస్‌. కానీ, తానొకటి తలిస్తే దైవం మరోలా తలచిందన్నట్లు కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం చేరికలను ప్రోత్సహించినా, నియోజకవర్గాల్లో స్థానిక కాంగ్రెస్‌ క్యాడర్‌ సహకరించకపోవడంతో జంపింగ్‌ ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పార్టీలో చేరిన నెల రోజుల్లోపే తిరిగి బీఆర్‌ఎస్‌ గూటికి చేరడం వెనుక ఇదే కారణం ఉందంటున్నారు.

ఎమ్మెల్యే బండ్లతో సయోధ్యకు ససేమిరా..
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు రాష్ట్ర నాయకత్వం ఎంతో ఆసక్తి ప్రదర్శించినా, ఆయన చేరికను గద్వాలలో కాంగ్రెస్‌ నాయకులు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. తొలుత విభేదించినా తర్వాత సర్దుకుంటారనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ పెద్దలు ఎమ్మెల్యేను చేర్చుకున్నా.. స్థానిక నేతలు మాత్రం ఎమ్మెల్యేతో చేతులు కలిపేందుకు నిరాకరించారని అంటున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే బండ్ల ప్రత్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్‌ నేత సరిత తిరుపతయ్య వర్గం.. ఎమ్మెల్యేతో సయోధ్యకు ముందుకురావడం లేదంటున్నారు. గతంలో కూడా ఈ ఇద్దరూ ఒకే పార్టీలో ఉండేవారు. అప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు ఉండటంతోనే సరిత కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు ఇద్దరూ కాంగ్రెస్‌లో ఉండటంతో పాత విభేదాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయనే కారణంతో రెండు వర్గాలు కలవటానికి ఇష్టపడకపోవడంతో కృష్ణమోహన్‌రెడ్డి తిరిగి వెనక్కి వచ్చారంటున్నారు.

బండ్ల తోవలో సంజయ్, మహిపాల్, కాలె యాదయ్య, గాంధీ?
ఇక కృష్ణమోహన్‌రెడ్డి తోవలోనే మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీకి స్థానికంగా కాంగ్రెస్‌ క్యాడర్‌ సహకరించడం లేదనే టాక్‌ నడుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలోనే గాంధీ చేరికను అక్కడి క్యాడర్‌ వ్యతిరేకించగా, గూడెం మహిపాల్‌రెడ్డి, కాలె యాదయ్యకు ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయంటున్నారు. ఇక జగిత్యాలలో సీనియర్‌ నేత టి.జీవన్‌రెడ్డి సహాయ నిరాకరణతో ఎమ్మెల్యే సంజయ్‌ పునరాలోచనలో పడ్డారంటున్నారు.

ప్రభుత్వాన్ని నడపడం కూడా కష్టమనే అభిప్రాయం..
మొత్తానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరడం కాంగ్రెస్‌లో గుబులు రేపుతోందంటున్నారు. ఈ పరిస్థితే కొనసాగితే కొత్తగా ఎవరూ పార్టీలోకి వచ్చే అవకాశం ఉండదని.. అత్తెసరు మెజార్టీతో ప్రభుత్వాన్ని నడపడం కూడా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర పార్టీ అంతరంగాన్ని నియోజకవర్గ స్థాయిలో నేతలు అర్థం చేసుకోకపోతే కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read : అటు దక్కని పదవి, ఇటు నిరుద్యోగుల ఒత్తిడి.. ప్రొఫెసర్‌ కోదండరాంకి చివరికి మిగిలిందేంటి?