సీఎం రేవంత్‌తో పాటు అమెరికా వెళ్లేందుకు కాంగ్రెస్ నేతల తహతహ.. కారణం ఏంటి?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంలో అధికారికంగా అమెరికా పర్యటనకు వెళ్లేందుకు చాలా మంది లాబీయింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. సీఎం ఇలా విదేశాలకు వెళ్లినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం ఎంత మంది, ఏయే స్థాయిలో ఉన్న వారు వెళ్లవచ్చన్న వివరాలు ఆరా తీస్తున్నారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు.

సీఎం రేవంత్‌తో పాటు అమెరికా వెళ్లేందుకు కాంగ్రెస్ నేతల తహతహ.. కారణం ఏంటి?

Gossip Garage : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనతో కాంగ్రెస్‌లో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. సీఎం వెంట తాము కూడా విదేశీ పర్యటనకు వస్తామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా క్యూ కడుతున్నారట. నేరుగా సీఎం రేవంత్‌ రెడ్డినే కలుస్తూ తమనూ అమెరికా తీసుకెళ్లాలని ప్రాధేయపడుతున్నారట. ఇలా సీఎం వెంట పడుతున్న వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలే ఎక్కువగా ఉన్నారంటున్నారు. పెట్టుబడుల కోసం సీఎం అమెరికా టూర్ వెళితే.. కాంగ్రెస్ నేతల హంగామా దేనికి అనుకుంటున్నారా?

సీఎంతోపాటు అమెరికా వెళ్లేందుకు నేతల ఆసక్తి..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మొత్తం 12 రోజుల అధికారిక పర్యటన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ అమెరికా టూర్ ప్లాన్ చేశారు. ముఖ్యమంత్రి వెంట ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సంబంధిత అధికారులు వెళ్లనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. సీఎంతోపాటు అమెరికా వెళ్లేందుకు చాలా మంది నేతలు ఆసక్తి చూపుతున్నారట. అందులో కొంతమంది మంత్రులతో పాటు ప్రభుత్వ సలహాదారులు, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇంకొంత మంది నాయకుల పేర్లు ఉన్నాయి. సీఎంతో అమెరికా వెళ్తే స్వామికార్యంతోపాటు స్వకార్యం నెరవేర్చుకోవచ్చనే ఆలోచనతోనే ఎక్కువ మంది విదేశీ పర్యటనకు ఉవ్విళ్లూరుతున్నారన్న చర్చ జరుగుతోంది.

సొంత ఖర్చులతోనైనా అమెరికా వచ్చేందుకు పర్మిషన్ ఇవ్వాలని విన్నపం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంలో అధికారికంగా అమెరికా పర్యటనకు వెళ్లేందుకు చాలా మంది లాబీయింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. సీఎం ఇలా విదేశాలకు వెళ్లినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం ఎంత మంది, ఏయే స్థాయిలో ఉన్న వారు వెళ్లవచ్చన్న వివరాలు ఆరా తీస్తున్నారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. ఒకవేళ ప్రొటోకాల్ ప్రకారం అధికారికంగా వెళ్లే అవకాశం లేకపోతే తమ సొంత ఖర్చులతోనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట అమెరికా వెళ్లేందుకు అవకాశం కల్పించాలని కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు జీఏడీ అధికారులను కోరుతున్నారని సచివాలయ వర్గాల సమాచారం. మరికొంత మంది నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తాము కూడా అమెరికా వస్తామని, అనుమతించాలని అడుగుతున్నారట. దీంతో వారికి ఏం చెప్పాలో అర్ధంకాక సీఎం మౌనం వహిస్తున్నారన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తోంది. గతంలో సీఎం హోదాలో కేసీఆర్ విదేశీ పర్యటనలకూ వెళ్లినప్పుడూ ఇలానే పదుల సంఖ్యలో టూర్ చేసిన సందర్భాలున్నాయి. ఇదే రీతిన ఇప్పుడు కూడా సీఎం రేవంత్ తో వెళ్లేందుకు నేతలంతా తహతహలాడుతున్నారట.

లాబీయింగ్ చేసుకోడానికి తగిన సమయమనే ఆలోచన..
మరీ ముఖ్యంగా క్యాబినెట్ బెర్త్ ఆశిస్తున్న నేతలు… లాబీయింగ్ చేసుకోడానికి ఇదే సమయం అని భావిస్తున్నారట.. ఇక కార్పొరేషన్ పదవుల కోసం ప్రయత్నిస్తున్న ఆశావహులు సైతం రేవంత్ వెంట అమెరికా వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉండటం వల్ల సమయం ఇవ్వడం లేదని, అమెరికాలో కొంత టైం దొరికే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఎక్కువ మంది నేతలు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.

సొంత ఖర్చులతో సీఎం వెంట వెళ్లేందుకు 15 మంది ఎమ్మెల్యేల ఆసక్తి..
సీఎం రేవంత్ వెంట పరిమిత సంఖ్యలోనే ప్రోటోకాల్ పరిమితులకు లోబడి 20 నుంచి 22 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో సొంత ఖర్చులతో సీఎం వెంట వెళ్లేందుకు సుమారు 15 మంది ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న ఆశావహులు ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకున్నారని సమాచారం. సీఎం అనుమతిస్తే మరికొంత మంది సైతం ఒకట్రెండు రోజులు అటు.. ఇటుగా అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్నారన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. ఏదేమైనా సీయం రేవంత్ టూర్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా అమెరికాలో చక్కర్లు కొట్టేందుకు ప్లాన్ చేస్తుండటమే ఇప్పుడు ఆసక్తిరేపుతోంది.

Also Read : కాంగ్రెస్‌కు బిగ్ షాక్? సొంతగూటికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు? కారణం అదేనా..