రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలి జగన్? పవన్ ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించరు- మంత్రి నాదెండ్ల మనోహర్

జగన్ ప్రజల పక్షాన నిలబడాలి. ఆయన పద్ధతి మార్చుకోవాలి. శాంతి భద్రతలు లేవని రాష్ట్రపతి పాలన పెట్టాలని అనడం సరికాదు.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలి జగన్? పవన్ ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించరు- మంత్రి నాదెండ్ల మనోహర్

Nadendla Manohar : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఫైర్ అయ్యారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లోపించాయని, రాష్ట్రపతి పాలన పెట్టాలని జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మనోహర్ తీవ్రంగా స్పందించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలి? అని ఆయన జగన్ ను ప్రశ్నించారు. ఇంటింటికి రూ.4 వేల పెన్షన్ ఇచ్చినందుకా? పోలవరం పనులు మొదలు పెడుతున్నందుకా? కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక సహకారం తీసుకొచ్చినందుకా? అని జగన్ ను నిలదీశారు మంత్రి మనోహర్.

వైసీపీ అధ్యక్షుడు ఎవరో క్లారిటీ లేదు..
”జగన్ కోటల్లో ఉంటారు. మరి ప్రజలు ఎలా ఉంటున్నారో తెలుసా? జగన్ ప్రజల పక్షాన నిలబడాలి. ఆయన పద్ధతి మార్చుకోవాలి. శాంతి భద్రతలు లేవని రాష్ట్రపతి పాలన పెట్టాలని అనడం సరికాదు. ఎలక్షన్ కమిషన్ లో సభ్యత్వం లేని పార్టీ వైసీపీ. ముందు పార్టీని చక్కదిద్దుకోవాలి. వైసీపీ అధ్యక్షుడు ఎవరో క్లారిటీ లేదు. ఏపీలో సూపర్ సిక్స్ కచ్చితంగా అమలు చేస్తాం” అని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత ఉంది..
ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. కేంద్రమంత్రులు హర్దీప్ పూరి, ప్రహ్లాద్ జోషీతో భేటీ అయ్యారు. ”దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత ఎక్కువగా ఉంది. ఏపీలో కిలో కందిపప్పు రూ.150కి అందిస్తున్నాము. లక్ష మెట్రిక్ టన్నుల కందిపప్పు కేటాయించాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కోరాం. ధాన్యం నిల్వ కోసం, గిడ్డంగుల నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో సింహ భాగం ఇవ్వాలని కోరాం. 1.47 లక్షల రేషన్ కార్డులకు రేషన్ అందిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర మార్కెటింగ్ శాఖలు నిర్వహించే ప్రైస్ మానిటరింగ్ సెంటర్లను ప్రస్తుతం ఉన్న 5 నుంచి 13కి పెంచాలని కోరాం. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిశా. ఉజ్వల స్కీమ్ లో రాష్ట్రానికి నష్టం జరుగుతోందని కేంద్రమంత్రికి తెలిపా.

ఏపీకి విభజన వల్ల నష్టం జరిగింది. న్యాయం చేయాలన్న భావన కేంద్ర పెద్దల్లో కనిపిస్తోంది. కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలు తెలిపేందుకు ఎంపీలు, అధికారులు వారి సహకారాన్ని అందించారు. రాష్ట్ర అంశాల పరిష్కారానికి కేంద్రం సుముఖంగా ఉంది. కేంద్రం ఇతర దేశాల నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటోంది.

డోర్ డెలివరీ రేషన్ పై కేబినెట్ లో నిర్ణయం, అర్హత ఉన్న వారికే రేషన్ కార్డులు..
నవంబర్ నాటికి కందిపప్పు సమస్య పరిష్కరిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. కందిపప్పు సమస్య తాత్కాలికంగా వచ్చింది. రైతులు పంట పండిస్తే ధాన్యం కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం జరిగింది. రైతులకు నష్టం జరిగింది. రైతుల నుంచి పంట సేకరించి డబ్బు ఇవ్వలేదు. పెండింగ్ లో ఉన్న రూ.1,674 కోట్లను రైతులకు చెల్లిస్తున్నాం. ఇప్పటికే రూ.1000 కోట్లు ఇచ్చాం. సోమవారం రూ.674 కోట్లను చెల్లించబోతున్నాం. డోర్ డెలివరీ రేషన్ అంటూ జగన్ ప్రభుత్వం రూ.1800 కోట్లు వృధా చేసింది. డోర్ డెలివరీ రేషన్ పై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అర్హత ఉన్న వారికి రేషన్ కార్డులు ఇస్తాం. టార్గెట్ అంటూ ఏమీ లేదు” అని మంత్రి మనోహర్ తెలిపారు.

పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించరు..
అటు సినిమాల్లో వచ్చిన మార్పులపై బెంగళూరు పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించరు అని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణాన్ని కాపాడాలని, మొక్కలు పెంచాలని అటవీ పర్యావరణ శాఖను పవన్ కళ్యాణ్ తీసుకున్నారని వెల్లడించారు. 40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడే వాడని, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినీ పరిశ్రమలో కలకలం రేపాయి.