త్రోవర్ అర్షద్ నదీమ్‌కు పాకిస్థాన్ ప్రధాని రివార్డులు, అవార్డులు.. ఇంకా ఎన్నో..

ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసిన పాకిస్థాన్ త్రోవర్ అర్షద్ నదీమ్‌పై నజరానాల వర్షం కురుస్తూనే ఉంది.

త్రోవర్ అర్షద్ నదీమ్‌కు పాకిస్థాన్ ప్రధాని రివార్డులు, అవార్డులు.. ఇంకా ఎన్నో..

Pakistan PM Honours Arshad Nadeem with PKR 150 Million Cash

Pakistan PM Honours Arshad Nadeem: వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసిన పాకిస్థాన్ త్రోవర్ అర్షద్ నదీమ్‌పై నజరానాల వర్షం కురుస్తూనే ఉంది. పారిస్ ఒలింపిక్ గేమ్స్ 2024లో జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించి తమ దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన నదీమ్‌కు ప్రశంసలతో పాటు రివార్డులు దక్కాయి. తాజాగా పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్.. 15 కోట్ల పాకిస్థానీ రూపాయల నగదు బహుమతి (మన కరెన్సీలో సుమారు 4.5 కోట్లు) అందజేయడంతో పాటు, పౌర పురస్కారాన్ని ప్రకటించారు. ఇస్లామాబాద్‌లోని తన నివాసంలో నదీమ్‌ కుటుంబ సభ్యుల సమక్షంలో చెక్ అందజేశారు.

నదీమ్ గౌరవార్థం విందు కూడా ఏర్పాటు చేశారు. దీని కోసం నదీమ్ తన కుటుంబ సభ్యులతో కలిసి లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌ వచ్చారు. వీరిని ప్రధాని షెహబాజ్ తన నివాసం వద్ద స్వయంగా రిసీవ్ చేసుకుని సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్షద్ నదీమ్‌పై ప్రధాని షెహబాజ్ ప్రశంసలు కురిపించారు. గట్టి సంకల్పం ఉంటే ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా విజయం సాధించవచ్చని నదీమ్ నిరూపించాడని ప్రశంసించారు. పొగడ్తలతో పాటు పలు వరాలు కూడా కురిపించారు.

నదీమ్‌కు పాకిస్థాన్ రెండవ అత్యున్నత పౌర పురస్కారం హిలాల్ ఇంతియాజ్‌ను ప్రధాని ప్రకటించారు. అంతేకాదు, ఇస్లామాబాద్‌లోని జిన్నా స్టేడియంలో అర్షద్ నదీమ్ హై-పెర్ఫార్మెన్స్ అకాడమీని ఏర్పాటు చేస్తామని, ఒక రోడ్డుకు నదీమ్ పేరు పెడతామన్నారు. ఒక 100 కోట్ల పాకిస్థానీ రూపాయలతో స్పోర్ట్స్ ఎండోమెంట్ ఫండ్‌ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే నదీమ్ కోచ్ సల్మాన్ ఇక్బాల్ బట్ ను 10 కోట్ల పాకిస్థానీ రూపాయలతో సత్కరిస్తామని చెప్పారు.