పేదలకు అన్నం పెడితే పెత్తందారి ఎలా అవుతారు? 2019లో ఒక సైకోను తెచ్చుకున్నారు- సీఎం చంద్రబాబు
సంపద ఏ కొద్దిమందికో పరిమితం కాకూడదు. 2019 నుంచి కూడా మేమే ఉండి ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చేసే వాళ్లం.

Cm Chandrababu (Photo Credit : Facebook, Google)
Cm Chandrababu Naidu : మాజీ సీఎం వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సైకో అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు చంద్రబాబు. పేదలకు అన్నం పెడితే పెత్తందారి ఎలా అవుతారు? అని జగన్ ను నిలదీశారు సీఎం చంద్రబాబు. అన్న క్యాంటీన్లకు విరాళాలు అందుతున్నాయని చంద్రబాబు తెలిపారు. అన్న క్యాంటీన్ మళ్లీ పెడతాను అంటే శ్రీనివాస్ రాజు అనే వ్యక్తి కోటి రూపాయలు ఇచ్చారు. నారా భువనేశ్వరి కూడా కోటి రూపాయలు ఇచ్చారని చంద్రబాబు వెల్లడించారు. దాతలు కూడా ముందుకు వచ్చి అన్న క్యాంటీన్లకు సహకరం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీ ఇంట్లో పెళ్లి జరిగితే కొంచెం ఖర్చు తగ్గించుకుని అన్న క్యాంటీన్ కి సహకారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. డిజిటల్ విరాళాలు కూడా సేకరించాలని అనుకుంటున్నట్లు వివరించారు. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
రాబోయే 23 ఏళ్ళలో సంకల్పం చేసి ఉంటే ప్రపంచంలోనే అతి పెద్ద దేశం అవుతామన్నారు. 2019 నుంచి కూడా మేమే ఉండి ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చేసేవాళ్ళమన్నారు చంద్రబాబు. 2019లో ఒక సైకోను తెచ్చుకున్నారని వైఎస్ జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు విరుచుకుపడ్డారు. అప్పటి నుంచి బూతులే బూతులు అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ నియోజకవర్గంలో ఇలాంటి సమావేశం జరిగిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీని గౌరవ సభగా చేసి ఎంటర్ అయ్యానని చెప్పారు.
”ఎక్కడైనా భూకబ్జాలు కనిపిస్తున్నాయా? రచ్చబండే నా స్టేజీ. సింపుల్ గవర్నమెంట్ ఉండాలి. నా జీవితాంతం ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరిక నిర్మూలన చేస్తా. సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోతోంది. జీరో పావర్టీ నా బాధ్యత. సంపద ఏ కొద్దిమందికో పరిమితం కాకూడదు. నేను గుడివాడ రాలేకపోయాను. ఇసుక, లిక్కర్, బియ్యం మాఫియాలతో అరాచకాల చేశారు. క్యాసినో ఆడిస్తే ఏంటిదని అడిగితే బూతులు తిట్టడం, దాడులు చేయడం చేశారు. అందుకే అసెంబ్లీలో గౌరవ సభగా మారిన తరువాతే సభకు వస్తానని చెప్పా.
గత ప్రభుత్వ హయాంలో ప్రజలు నవ్వాలన్నా భయపడే వారు. జగన్ వస్తే చెట్లు కొట్టే వారు. పరదాలు కట్టే వారు. అధికారులు రెడ్ కార్పెట్ వేసే వారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? సామాన్యుడిగా మీ అందరికి సేవ చేయాలని సింపుల్ గవర్నెన్స్ ఉండాలని కోరుకుంటున్నా. పేదలకు కడుపు నిండా అన్నం పెడితే అదే మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది. దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించుకోవాల్సి వచ్చింది.
గుడివాడలో మూడు అన్న క్యాంటీన్లను పెడుతున్నాం. ఎన్టీఆర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం గుడివాడ. డొక్కా సీతమ్మ ఎంతోమంది ఆకలి తీర్చిన అన్నపూర్ణ. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తిరుమల వెళ్లిన ఎన్టీఆర్ అన్నదానానికి శ్రీకారం చుట్టారు. అరకొర సంపాదనతో జీవించే వారికి అన్న క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అన్న క్యాంటీన్లను మూసేయొద్దని చెప్పినా పట్టించుకోలేదు. ప్రభుత్వం పెట్టకపోయినా దాతలు పెడతారు. వారికి అవకాశం ఇవ్వాలని చెప్పినా వినలేదు. సెప్టెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాం. సంవత్సరానికి రూ.200 కోట్లు అవుతుంది. పేదలకు అన్నం పెడితే పెత్తందారి ఎలా అవుతారు? అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు.
టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి అన్న క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు గుడివాడలో ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 100 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి క్యాంటీన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించగా.. రేపు రాష్ట్రవ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభించనున్నారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు పూర్తి స్థాయిలో క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.
Also Read : రేషన్ బియ్యం అక్రమాల్లో త్వరలో అరెస్టులు..! ప్రభుత్వం హిట్ లిస్టులో ఉన్న ఆ బిగ్ వికెట్లు వీరేనా?