ఆయనొస్తానంటే అడ్డుకుంటున్నదెవరు? బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ విషయంలో తీవ్ర గందరగోళం

ఇప్పటికే రాష్ట్ర నేతల మధ్య సమన్వయ లోపంతో కొట్టుమిట్టాడుతున్న కమలదళానికి… ఇప్పుడు ఇంఛార్జీతోనూ గ్యాప్ ఏర్పడింది. ఈ గ్యాప్‌లను అన్నింటిని అధిగమించి పార్టీని కాబోయే కొత్త అధ్యక్షుడు, ఇంఛార్జీలు ఎలా గాడిన పెడతారో చూడాలి.

ఆయనొస్తానంటే అడ్డుకుంటున్నదెవరు? బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ విషయంలో తీవ్ర గందరగోళం

Gossip Garage : తెలంగాణ బీజేపీలో తలోదారి అయిపోయింది. మొన్నటి వరకు స్టేట్ ప్రెసిడెంట్ వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లుగా నడిచింది వ్యవహారం. ఇప్పుడు ఇంచార్జ్ వర్సెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నట్లుగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జ్ విషయంలో పార్టీలో గందరగోళం కొనసాగుతోంది. తానే తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ అంటూ కర్ణాటకకు చెందిన బీజేపీ నేత అభయ్ పాటిల్ ప్రకటించుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దాన్ని ఖండించారు. అయితే కిషన్ రెడ్డి మాటలను లెక్కచేయకుండా తెలంగాణ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశానికి హాజరయ్యారు అభయ్ పాటిల్.

తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా తరుణ్‌చుగ్‌ వ్యవహరించారు. ఆయనను జమ్మూకశ్మీర్ వ్యవహారాల ఇంచార్జ్‌కే పరిమితం చేయడంతో ప్రస్తుతం తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ పోస్ట్ ఖాళీగా ఉంది. అధికారికంగా ఈ పదవిని ఎవరికి ఇచ్చినట్టుగా బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించలేదు. కానీ జాతీయ నాయకత్వం మౌఖిక ఆదేశాలతో అభయ్ పాటిల్ తెలంగాణ పార్టీ ఇంచార్జ్ గా తనకు తానే స్వయంగా ప్రకటించుకున్నారు. ఆగస్ట్ 17న ఢిల్లీలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్‌లో తెలంగాణ ఇంచార్జ్‌గా పాల్గొనట్టు అభయ్ పాటిల్ ట్వీట్ చేశారు. అదప్పుడు పార్టీలో చర్చకు దారితీసింది. తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ గా జాతీయ నాయకత్వం ఎవరినీ అధికారికంగా ప్రకటించలేదంటూ స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇంతటితో అయిపోయిందనుకున్న అంశం పార్టీలో మరోసారి కొత్త చర్చకు దారితీసింది.

అభయ్ పాటిల్ తెలంగాణ రాష్ట్రానికి రావడం ఇక్కడి నేతలకు ఇష్టం లేదంట. అందుకే ఆయనను తెలంగాణ రాష్ట్రానికి ఇంచార్జ్ గా రావడాన్ని అడ్డుకుంటున్నారంట. అయితే దీనికి కారణాలు లేకపోలేదు అంటున్నారు పార్టీ నేతలు. అభయ్ పాటిల్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ ఎన్నికల ఇంచార్జ్‌గా తెలంగాణలో పనిచేశారు. ఆయనకు ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న పేరుంది. పని చేయకపోతే ఎంతటి లీడర్ నైనా పదిమందిలోనే నిలదీసి అడుగుతారంట. నేతలకు అప్పగించిన పనిని వందశాతం పూర్తి చేయాలని పట్టుబడుతారట. ఒకరకంగా చెప్పాలంటే అభయ్ పాటిల్‌కు పని రాక్షసుడు అని పార్టీలో పేరుంది.

పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు సాధించినప్పటికీ… గెలుస్తామనుకున్న భువనగిరి, జహీరాబాద్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో ఓడిపోయిన తీరుపై ఆయన స్థానిక సీనియర్ నేతలను సమావేశంలోనే నిలదీశారంట. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ కీలక నేతను తన నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు ఎందుకు తక్కువ వచ్చాయని కడిగిపారేసారంట. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను కూడా పని విషయంలో పరుగులు పెట్టిస్తున్నాడంట. మాటలు చెప్పడం కాదు సాక్ష్యాలు, ఆధారాలు చూపించాలని అడిగేవారంట. ఇలాంటి వ్యక్తి వస్తే తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్న కొందరు నేతలు… ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారనే టాక్ బిజేపీలో నడుస్తోంది.

ఇదంతా ఒక ఎత్తయితే ఎవరు ఏమనుకున్నా జాతీయ నాయకత్వం అప్పగించిన పనిని తుచా తప్పకుండా చేస్తానని అభయ్ పాటిల్ అంటున్నారట. ఢిల్లీలో సమావేశంలో పాల్గొనడమే కాకుండా 21న హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ బీజేపీ సభ్యత్వ మహోత్సవ్ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆయనను డయాస్ మీదకు ఆహ్వానిస్తున్న సమయంలో పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ గా వ్యవహరించిన అభయ్ పాటిల్ అని సంభోదించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ అని ఎక్కడా పిలవలేదు. ఈ మాటలకు ఆయన కాస్త హర్ట్ అయినట్టే ఉన్నారట. ఏకంగా అదే వేదికపై ఎవరికి నచ్చినా నచ్చక పోయినా తాను హైకమాండ్ చెప్పిన పనిచేస్తానని ప్రకటించారట. దీంతో పార్టీలో ఏం జరుగుతుందని అక్కడికి వచ్చిన నేతలు మధ్య గుసగుసలు వినిపించాయి.

Also Read : కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన ఆ ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీరేనా?

ఇప్పటికే రాష్ట్ర నేతల మధ్య సమన్వయ లోపంతో కొట్టుమిట్టాడుతున్న కమలదళానికి… ఇప్పుడు ఇంఛార్జీతోనూ గ్యాప్ ఏర్పడింది. ఈ గ్యాప్‌లను అన్నింటిని అధిగమించి పార్టీని కాబోయే కొత్త అధ్యక్షుడు, ఇంఛార్జీలు ఎలా గాడిన పెడతారో చూడాలి.