రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. ఒక్క సభ్యుడూ లేకపోయినా మున్సిపల్‌ పీఠం టీడీపీ కైవసం..!

మాచర్ల అంటే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డాగా చెప్పేవారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయనకు ఎదురేలేదన్నట్లు పవర్‌ చూపించే వారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాచర్లలో పిన్నెల్లి చెప్పిందే శాసనం అన్నట్లు నడిచేది.

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. ఒక్క సభ్యుడూ లేకపోయినా మున్సిపల్‌ పీఠం టీడీపీ కైవసం..!

Gossip Garage : మాచర్లలో సీన్‌ మారుతోంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్‌ వచ్చిన రోజే షాక్‌ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా, స్థానిక సంస్థల్లో బలంగా ఉన్నామనుకున్న వైసీపీ పీఠాలు ఒక్కొక్కటిగా కదిలిపోతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో ఏకపక్షంగా ఏకగ్రీవం చేసుకున్న మున్సిపాలిటీ అనూహ్యంగా కూటమి ఖాతాలో చేరిపోయింది. ఒక్క సభ్యుడూ లేని టీడీపీ…. మాచర్ల మున్సిపాలిటీపై జెండా ఎగరేయడమే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

31 చోట్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులే కౌన్సిలర్లుగా గెలిచారు..
మాచర్ల… పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్‌ రాజకీయాలకు చిరునామా…. రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒక ఎత్తైతే… మాచర్లలో పోలింగ్‌ అంటేనే వేరే లెవెల్‌. దాడులు, దౌర్జన్యాలు, హింసాకాండ మాచర్లలో చాలా.. చాలా… కామన్‌గా చెబుతుంటారు.. గత మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్న ప్రయాణిస్తున్న కారుపై జరిగిన దాడే మాచర్లలో దౌర్జన్యకాండకు నిదర్శనమని అంటుంటారు.

ఇక ఆ తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ మాచర్ల మున్సిపాలిటీని ఏకపక్షంగా ఏకగ్రీవం చేసుకుంది. మున్సిపాలిటీలో మొత్తం 31 స్థానాలు ఉండగా, మొత్తం 31 చోట్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులే కౌన్సిలర్లుగా గెలిచారు. ఆ తర్వాత ఏడాదికి ఒకరు చొప్పున మున్సిపల్‌ చైర్మన్లుగా వ్యవహరించాలని నిర్ణయించారు.

ఎమ్మెల్యే జూలకంటి చక్రం తిప్పడంతో టీడీపీ ఖాతాలోకి మాచర్ల మున్సిపాలిటీ..
2020లో ఎన్నికలు జరిగితే, తొలిసారి టీడీపీ నేతలపై దాడి కేసులో నిందితుడు తురకా కిశోర్‌ను చైర్మన్‌గా ఎంపిక చేశారు. ఆ తర్వాత బోయ రఘురామిరెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ అయ్యారు. వీరి తర్వాత మూడో చైర్మన్‌గా ఏసోబు బాధ్యతలు స్వీకరించగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన రాజీనామా చేశారు.

ఇప్పుడు ఆయన స్థానంలో వైసీపీకి చెందిన మరో నేతను ఎన్నుకోవాల్సి వుండగా, టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి చక్రం తిప్పడంతో మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరిపోయింది. ప్రస్తుతం వైస్‌ చైర్మన్‌గా ఉన్న పోలూరి నరసింహారావును చైర్మన్‌ చేశారు ఎమ్మెల్యే జూలకంటి. టీడీపీలో చేరిన కౌన్సిలర్లు అంతా పోలూరికి మద్దతివ్వడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

వైసీపీకి చెందిన 16 మంది కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకుని..
మున్సిపాలిటీలో టీడీపీకి ఒక్క సభ్యుడూ లేకపోయినా, పసుపు జెండా రెపరెపలాడటం హాట్‌టాపిక్‌గా మారింది. అందులోనూ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్‌ వచ్చిన రోజే షాక్‌ ఇచ్చింది టీడీపీ. వైసీపీకి చెందిన 16 మంది కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకుని మున్సిపల్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది టీడీపీ. మున్సిపాలిటీలో 31 మంది సభ్యులకు గాను 16 మంది కౌన్సిలర్లు, ఎక్స్‌ అఫీసియో హోదాలో ఎమ్మెల్యే ఓటు కలిసిరావడంతో టీడీపీ ఖాతాలో చేరింది మాచర్ల మున్సిపాలిటీ.

ఇక మిగిలిన కౌన్సిలర్లలో ఒకరు వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరు అవడంతో వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా టీడీపీ నేతలపై దాడి కేసులో నిందితుడైన మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ తురకా కిశోర్‌ అజ్ఞాతంలో ఉన్నారు. ఇక మరికొందరు కౌన్సిలర్లు టీడీపీ లేదా జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు. దీంతో మున్సిపాలిటీలో టీడీపీ మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు.

జూలకంటి ఎంట్రీతో పిన్నెల్లికి కౌంట్‌డౌన్‌..
మాచర్ల అంటే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డాగా చెప్పేవారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయనకు ఎదురేలేదన్నట్లు పవర్‌ చూపించే వారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాచర్లలో పిన్నెల్లి చెప్పిందే శాసనం అన్నట్లు నడిచేది. ఇక ఆయనకు ప్రత్యర్థిగా గత ఎన్నికలకు ముందు ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి బాధ్యతలు స్వీకరించిన నుంచి పిన్నెల్లికి కౌంట్‌డౌన్‌ మొదలైందనే టాక్‌ ఉంది. బ్రహ్మారెడ్డి రంగంలోకి దిగిన తర్వాత మాచర్లలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఆత్మస్థైర్యం వచ్చింది.

పిన్నెల్లిని కోలుకోని విధంగా దెబ్బతీశారు..
గత ఎన్నికల్లో పిన్నెల్లికి దీటుగా నిలవడంతోపాటు, పకడ్బందీగా పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యారు. దీంతో అసాధ్యమనుకున్న గెలుపును సుసాధ్యం చేసుకోవడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని కోలుకోని విధంగా దెబ్బతీశారు. ఎన్నికల హింస కేసులో ఆయన అరెస్టు అవ్వగా, ఆయన సోదరుడు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. దీంతో మాచర్లలో వైసీపీ కార్యకర్తలు చల్లా చెదురయ్యారు. ఇక ఇదే సమయంలో ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి చాకచక్యంగా పావులు కదిపి మాచర్ల మున్సిపాలిటిలో పసుపు జెండా రెపరెపలాడించారు.

మాచర్లలో కదిలిపోతున్న స్థానిక సంస్థల పీఠాలు..
ఒక్క మాచర్ల మున్సిపాలిటీయే కాదు నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే.. వారంతా కండువాలు మార్చేయడానికి రెడీగా అంటున్నారట.. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగడం కష్టంగా భావిస్తున్న నేతలు… పార్టీ ఫిరాయించేందుకు తహతహ లాడుతున్నట్లు చెబుతున్నారు.

ఐతే మున్సిపాలిటీని దక్కించుకున్న హుషారులో ఉన్న టీడీపీ కొన్ని మండలాల్లో ఎంపీపీ పదవులను కైవసం చేసుకోడానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఐతే, వైసీపీ అధికారంలో ఉండగా, టీడీపీ నేతలు, కార్యకర్తలతో వివాదాలకు దిగిన వారిని మాత్రం దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. మొత్తానికి మాచర్లలో స్థానిక సంస్థల పీఠాలు అన్నీ కదిలిపోతున్నాయి. వైసీపీ ఖాతా నుంచి టీడీపీ ఖాతాలో చేరిపోనున్నాయనే టాక్‌ వినిపిస్తోంది.

 

Also Read: గల్లా జయదేవ్ మళ్లీ మనసు మార్చుకున్నారా, సీఎం చంద్రబాబు ఏం ఆఫర్ చేశారు?