Rain Alert : తెలంగాణలో వర్ష బీభత్సం.. తొమ్మిది జిల్లాలకు రెడ్ అలెర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

Rain Alert : తెలంగాణలో వర్ష బీభత్సం.. తొమ్మిది జిల్లాలకు రెడ్ అలెర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

Telangana Rain Alert

Telangana Rain Alert : ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ ను ఆదేశించారు. ముఖ్యంగా సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో వర్షపు నీరు పెద్దెత్తున నిలిచిపోయింది. దీంతో విజయవాడవైపు వెళ్లే వాహనాలు మిర్యాలగూడ, గుంటూరు మీదుగా దారిమళ్లిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి, విశాఖపట్టణం వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట సమీపంలోని రాయినిగూడెం వద్ద ఖమ్మం బైపాస్ మీదుగా దారిమళ్లిస్తున్నారు. వాహనదారులు ఖమ్మం, సత్తుపల్లి మీదుగా రాజమండ్రి, విశాఖపట్టణం వెళ్లొచ్చని పోలీసులు సూచించారు.

Also Read : ఏపీని వణికిస్తున్న వర్షాలు.. స్తంభించిన రవాణా వ్యవస్థ.. పలు రైళ్లు రద్దు

వాయుగుండం నేపథ్యంలో రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షంపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరో పన్నెండు జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ లోనూ శనివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపిలేని వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఆదివారంతోపాటు సోమవారంకూడా నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

 

రెడ్ అలెర్ట్ ప్రకటించిన జిల్లాలు : అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల. ఇవాళ ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించిన జిల్లాలు : కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి.
ఎల్లో అలెర్ట్ ప్రకటించిన జిల్లాలు : రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, మెదక్.