CM Chandrababu : గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన.. విద్యార్థినులు ఆందోళన చెందొద్దు.. తప్పు తేలితే బాధ్యులను వదలం : సీఎం చంద్రబాబు

AP CM Chandrababu : విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, తప్పు జరిగిందని తేలితే బాధ్యులను వదలమని హామీ ఇచ్చారు. ఆడబిడ్డల రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

CM Chandrababu : గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన.. విద్యార్థినులు ఆందోళన చెందొద్దు.. తప్పు తేలితే బాధ్యులను వదలం : సీఎం చంద్రబాబు

AP CM Chandrababu Naidu Review on Gudlavalleru Engineering College Incident

Gudlavalleru Engineering College Incident: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన విచారణపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శనివారం జిల్లా కలెక్టర్, ఎస్పీ, విచారణ అధికారులు, జేఎన్టీయూ వీసీ, సైబర్ నిపుణలతో ఆయన సమావేశమయ్యారు. హిడెన్ కెమేరాలు పెట్టారనే అంశంలో జరుగుతోన్న విచారణపై సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, తప్పు జరిగిందని తేలితే బాధ్యులను వదలమని హామీ ఇచ్చారు. ఆడబిడ్డల రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. సైబర్ నిపుణులతో లోతుగా దర్యాప్తు చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఘటన వెలుగు చూసిన తరువాత ఎస్పీ, కలెక్టర్‌ను కాలేజీకి పంపామన్నారు. అప్పటి నుంచి విచారణ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాని తెలిపారు.

వందల మంది విద్యార్థినులకు సంబంధించిన అంశం కావడంతో ఘటనను సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై కేసు రిజస్టర్ అయిన వెంటనే జరుగుతున్న విచారణపై సీఎం రివ్యూ చేశారు. ఇప్పటి వరకు విచారణలో సాధించిన పురోగతిపై అధికారులతో చర్చించారు. విద్యార్ధినులు చెప్పే అంశాల ఆధారంగా లోతుగా అన్ని కోణాల్లో విచారణ జరపాలన్నారు. ఇప్పటి వరకు జరిపిన పరిశీలనలో హిడెన్ కెమేరాలు ఏవీ దొరకలేదని అధికారులు చెప్పడంతో మరింత లోతుగా విచారణ జరపాలన్నారు.

సైబర్ నిపుణులకు చంద్రబాబు సూచనలు :
అనుమానితుల ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లను సైబర్ నిపుణుల ద్వారా పరిశీలించాలన్నారు. డేటా తొలగించే అవకాశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని టెక్నికల్‌గా అన్ని వనరులను ఉపయోగించుకోవాలన్నారు. ఆడబిడ్డల భద్రత, మహిళల వ్యక్తిగత గోప్యత విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా సైబర్ సెక్యూరిటీ నిపుణుల ఆధ్వర్యంలో డీ బగ్గింగ్ డివైసెస్‌తో అన్ని చోట్లా తనిఖీలు చేపట్టే విషయాన్ని పరిశీలించాలని ఆదేశించారు.

నేరం జరిగిందా లేదా అనేది పూర్తి విచారణ తరువాతనే తేలుతుందన్నారు. తప్పు జరిగిందని తేలితే మాత్రం నిందితులను వదలేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో విద్యార్థినుల మనోభావాలను గౌరవించాలని సీఎం సూచించారు. వారి ఆవేదన అర్థం చేసుకుని విచారణ చేయాలని సూచించారు. చదువుకునే ఆడబిడ్డలకు ఇలాంటి వివాదం తలెత్తితే మానసికంగా తీవ్ర ఆందోళన చెందుతారని, వారికి, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎవరి దగ్గరైనా ఘటనకు సంబంధించి అదనపు సమాచారం, ఆధారాలు ఉంటే నేరుగా తనకే పంపాలని సీఎం కోరారు.

ఇదే సమయంలో కొందరు ఈ ఘటనను ఆధారంగా చేసుకుని విద్యార్ధులను మరింత భయపెట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారి చర్యలను అడ్డుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. సున్నితమైన అంశాల విషయంలో తప్పుడు ప్రచారం మరింత నష్టం చేస్తుందని చెప్పారు. ఎప్పటికప్పుడు విచారణ వివరాలు తనకు చెప్పాలన్నారు. ఈ ఘటనలో తప్పు ఉందని తేలితే మాత్రం ఎవరినీ ఉపేక్షించేది ఉండదని సీఎం పేర్కొన్నారు. తిరిగి విద్యార్థినులు ప్రశాంతంగా చదువు కొనసాగించే పరిస్థితి కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Read Also : గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. విచారణకు ఆదేశం