Heavy Rain : తెలంగాణలో భారీ వర్షాలు.. మహబూబాబాద్‌లో రైల్వేట్రాక్ ధ్వంసం.. పలు రైళ్లు రద్దు

కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి - ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వే ట్రాక్ కింద కంకర కొట్టుకుపోయింది. దీంతో మట్టికోతకు గురికావడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తుంది.

Heavy Rain : తెలంగాణలో భారీ వర్షాలు.. మహబూబాబాద్‌లో రైల్వేట్రాక్ ధ్వంసం.. పలు రైళ్లు రద్దు

Railway Track Destroyed

Railway Track Destroyed : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. చెరువులు నిండుకుండలా మారాయి. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలోని అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది. దీంతో విజయవాడ – కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి.

Also Read : Rain Alert : తెలంగాణలో వర్ష బీభత్సం.. తొమ్మిది జిల్లాలకు రెడ్ అలెర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి – ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వే ట్రాక్ కింద కంకర కొట్టుకుపోయింది. దీంతో మట్టికోతకు గురికావడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తుంది. ట్రాక్ పూర్తిగా ధ్వంసం కావడంతో విజయవాడ – కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్‌పై నుంచి వరద ప్రవహిస్తుండటంతో పందిపల్లి వద్ద మహబూబ్‌నగర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ నాలుగు గంటల పాటు నిలిచిపోయింది. మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మచిలీపట్నం, సింహపురి రైళ్లు నిలిచిపోయాయి.

Also Read : కళింగపట్నం సమీపంలో తీరందాటిన వాయుగుండం.. ఏపీలోని ఆ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు..

మరోవైపు ఏపీలో భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు నగరాలు అతలాకుతలం అవుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ డివిజన్ పరిధిలోని పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. సోమవారం వరకు సుమారు 20 రైళ్లు రద్దయ్యాయి. విజయవాడ – తెనాలి, విజయవాడ – గూడూరు, తెనాలి – రేపల్లె, గుడివాడ – మచిలీపట్నం, భీమవరం – నిడదవోలు, గుంటూరు – రేపల్లె, విజయవాడ – మచిలీపట్నం, విజయవాడ – ఒంగోలు తదితర ప్రాంతాల మధ్య రైళ్ల రాకపోకలు రైల్వే అధికారులు నిలిపివేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలు ఎంచుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు.

భారీ వర్షాల కారణంగా.. ఆరు రైళ్లు రద్దు చేస్తున్నామని, తొమ్మిది రైళ్లు దారి మళ్లించినట్లు ఆదివారం దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. రద్దయిన రైళ్లలో విజయవాడ – సికింద్రాబాద్ ( ట్రైన్ నెంబర్ 12713), సికింద్రాబాద్ – విజయవాడ (12714), గుంటూరు – సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్ – సిరిపూర్ కాజీపేట (17233), సికింద్రాబాద్ – గుంటూరు (12706), గుంటూరు – సికింద్రాబాద్ (12705) మధ్య రైళ్లు రద్దయ్యాయ.