Paddy Crop : వరి పొలాల్లో అధికంగా యూరియా వాడుతున్న రైతులు – అవసరం మేరకే వాడాలంటున్న శాస్త్రవేత్తలు

Paddy Crop : కాంప్లెక్స్ ఎరువులకన్నా తక్కువ ధరలకే లభ్యమవుతున్న యూరియా.. పైరు పచ్చగా కన్నుల పండుగగా కనబడతుండటంతో రైతులు అధిక మోతాదులో యూరియాను వాడుటకు మొగ్గుచూపుతున్నారు.

Paddy Crop : వరి పొలాల్లో అధికంగా యూరియా వాడుతున్న రైతులు – అవసరం మేరకే వాడాలంటున్న శాస్త్రవేత్తలు

Urea Fertilizer in Paddy Crop

Paddy Crop : వరి పంట దిగుబడిని పెంచుకోవడానికి రైతులు అధికంగా ఎరువులను వినియోగిస్తుంటారు. అందులో యూరియాను అధికంగా వేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. మొక్కకు నత్రజని ఇచ్చే ఎరువు అయినప్పటికీ పరిమితికి మించి వేసుకోవడం వల్ల నేల, గాలి కలుషితమవుతున్నాయి. అంతే కాదు చీడపీడల తాకిడి అధికమవడం… వాటి నివారణకు అధిక వ్యవయం అవుతుంది. ఫలితంగా రైతు నష్టాలపాలవుతున్నారు. అందుకే అధిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి… అవసరం మేరకే రైతులు వేసుకోవాలి.

Read Also : Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్న వరినాట్లు – వరిలో కలుపు అరికట్టే విధానం

ఏళ్ల తరబడి వరిని సాగుచేస్తున్నారు రైతులు. దిగుబడులు తగ్గుతున్నా, ఎరువుల వాడకంలో మాత్రం మార్పు రావడంలేదు.  అధిక దిగుబడుల కోసం అవసరమైన దాని కన్నా రెండు నుండి రెండున్నర రెట్లు అధికంగా ఎరువులను రైతులు వేస్తున్నారు. తద్వారా అవసరం లేని పోషకాన్ని వేసి వృధా చేయడం వలన ఖర్చు పెరగడం,  పోషకాల సమతుల్యత లోపించడం, దిగుబడి తగ్గడమే కాకుండా, నేల స్వభావం మారుతుంది.

ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువులకన్నా తక్కువ ధరలకే లభ్యమవుతున్న యూరియా.. వేసిన వెంటనే పైరు పచ్చగా కన్నుల పండుగగా కనబడతుండటంతో రైతులు అధిక మోతాదులో యూరియాను వాడుటకు మొగ్గుచూపుతున్నారు.  46 శాతం నత్రజని కలిగిన  తెల్లని గుళికల రూపంలోని ఉన్న ఈ ఎరువు వెదజల్లుటకు అనుకూలంగా ఉంటుంది. తేలికగా నీటిలో కరిగి మొక్కకు అందుబాటులోకి మారుతుంది.

అధికంగా యూరియా వాడటం వల్ల మొక్క ఎదుగుదల బాగున్నప్పటికీ సరైన సమయంలో పూత, కాత రాకుండా ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు మొక్కల పెరుగుదల బాగా ఉండి చిక్కని ఆకుపచ్చ వర్ణంలో పంట మారడంవల్ల చీడపీడల బెడద కూడా ఎక్కువవుతుంది. మరోవైపు  పంట యొక్క గింజల నాణ్యత తగ్గి తాలు గింజలు ఏర్పడే అవకాశం ఉంది.  రైతులు సరైన అవగాహన లేక అధిక యూరియా వాడుతూ.. ఆర్థిక భారాన్ని కూడా పెంచుకుంటున్నారు.

మొక్కలకు నత్రజని అనేది చివరి వరకు అవసరం కాబట్టి ఒకేసారి మొత్తం యూరియాను వేసుకోకుండా దశలవారీగా వేసుకోవాలి. వరి నాటు వేసేటప్పుడు, పిలక దశలో మరియు చిరు పొట్ట దశలో వేసుకుంటే మొక్కకు బాగా ఉపయోగపడుతుంది. యూరియా తో వేప పిండి కలిపి వేసుకున్నట్లయితే నత్రజని అందుబాటు పెరగడమే కాక చీడపీడల నుండి కూడా రక్షణ లభిస్తుంది.

యూరియాను భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. భూమిలో తేమ లేకపోయినా, ఎరువులు వేసిన తర్వాత నీటిని అందించడానికి అవకాశం లేనప్పుడు సాధారణంగా రెండు నుంచి మూడు శాతం యూరియా ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలి.

చివరగా రైతులకు చెప్పేదేందంటే.. కాంప్లెక్స్ ఎరువులు యూరియాకు ప్రత్యామ్నాయం కాదు. అధిక మోతాదులో వేసే యూరియా చీడపీడలను ఆకర్షిస్తుంది.. పెట్టుబడులను అధికం చేస్తుంది. అవసరమ మేర యూరియాను వాడి అధిక ఎరువుల వినియోగాన్ని తగ్గిద్దాం ….. అదిక దిగుబడిని సాధిద్దాం.. నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

Read Also : Paddy Cultivation : ప్రకృతి విధానంలో లైన్ సోయింగ్ విధానంలో వరి సాగు