విశాఖపట్నంలో కొలువుదీరిన భారీ గణనాథులు.. 12 టన్నుల బెల్లంతో 80 అడుగుల భారీ గణపతి విగ్రహం

అనకాపల్లి ప్రాంతానికి చెందిన కళాకారులు 2 నెలలు పాటు కష్టించి బెల్లంతో వినాయకుడిని తయారు చేశారని నిర్వాహకులు చెప్పారు.

విశాఖపట్నంలో కొలువుదీరిన భారీ గణనాథులు.. 12 టన్నుల బెల్లంతో 80 అడుగుల భారీ గణపతి విగ్రహం

Jaggery Ganesh statue in visakhapatnam : వినాయక చవితి పండుగ సందర్భంగా విశాఖపట్నం నగరంలో కొలువైన భారీ గణనాథుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గాజువాక బస్ డిపో పక్కన ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వరంలో 80 అడుగుల ఎత్తులో ప్రతిష్టించిన బెల్లం వినాయకుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశంలో మొట్టమొదటిసారి బెల్లంతో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల అనంతరం ఈ బెల్లాన్ని భక్తులకు ఉచితంగా పంచిపెడతామన్నారు. అనకాపల్లి ప్రాంతానికి చెందిన కళాకారులు 2 నెలలు పాటు కష్టించి బెల్లంతో వినాయకుడిని తయారు చేశారని చెప్పారు. విగ్రహ తయారీ కోసం రాజస్థాన్ నుంచి 12 టన్నుల బెల్లాన్ని తీసుకొచ్చినట్టు వెల్లడించారు.

పూజలు చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గణపతి నవరాత్రుల్లో బెల్లం వినాయకుడు ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. కాగా, గాజువాక శ్రీనగర్ పరిధిలో ఏర్పాటు చేసిన 89 అడుగుల భారీ విగ్రహం కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి పోటెత్తిన భక్తులు
వినాయక చవితి పండుగ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని దేశ, విదేశీ భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రశాంతి నిలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలను భక్తులు జరుపుకున్నారు. విద్యార్థులు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. వీణ వాయిద్యం, సంగీత గాన కచేరితో ప్రశాంతి మందిరం సందడిగా మారింది.

Also Read: వినాయక చవితి విశిష్టత ఏంటి.. చవితి రోజు చంద్రుడ్ని చూస్తే ఏ పరిహారం చేయాలి..?

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొలువు తీరిన గణనాథులు
కర్నూలు, నంద్యాల జిల్లా కేంద్రాల్లో భక్తులు భారీగా వినాయక విగ్రహాలు ఏర్పాట్లు చేసుకున్నారు. కర్నూలు నగరంలో 63 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. లక్ష్మీ నరసింహస్వామి వినాయక భక్త బృందం.. దత్తాత్రేయ అవతారంలో గణణాధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. కర్నూలు, నంద్యాల జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో గణనాథులకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు.