కోనేటి ఆదిమూలంపై వేటుతో కూటమి ఎమ్మెల్యేలకు స్పష్టమైన మెసేజ్ ఇచ్చినట్లేనా.. ఇదే చంద్రబాబు అంతరంగమా?
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా కూటమి ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా టీడీపీ శాసనసభ్యులకు గట్టి హెచ్చరికలు పంపారు సీఎం చంద్రబాబు.
Chandrababu Action on koneti adimulam: తప్పు చేయడాలు.. తప్పించుకొని తిరగడాలు చెల్లవిక్కడ.. తేడా వస్తే వేటు వేయడమే.. చెప్పినన్నాళ్లు చెప్పా.. ఇక నో మోర్ వార్నింగ్.. ఓన్లీ యాక్షన్. బాబ్బాబు అంటూ బతిమిలాడలాలు ఉండవు.. సొంత పార్టీ వారంటూ సెంటిమెంట్ అసలే ఉండదు. క్రమశిక్షణ కట్టు తప్పకూడదంతే… ఇదే రూల్.. రూల్ ఫర్ ఆల్. మంత్రులు, ఎమ్మెల్యేలు.. వారి బంధువులు ఎవరైనా సరే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉండకూడదు. లేదు, కాదు, కుదరదంటారా? మీ పని మీరు చూసుకోవాల్సిందే. మచ్చలేని చంద్రుడిలా పాలన సాగించాలనుకుంటున్న తన దారికి ఎవరూ అడ్డు రాకూడదు. ఇదే సీఎం చంద్రబాబు అంతరంగమా…! ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వేటుతో కూటమి ఎమ్మెల్యేలకు స్పష్టమైన మెసేజ్ ఇచ్చినట్లేనా?
బాబు చాలా స్ట్రిక్ట్.. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి, కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వారికి తెలిసి ఉండకపోవచ్చు. తాను ఎంత క్రమశిక్షణతో ఉంటారో… తనవారూ అంతే క్రమశిక్షణ పాటించాలని కోరుకుంటారు సీఎం చంద్రబాబు. అందుకే 164 సీట్లతో అధికారంలోకి వచ్చామని విర్ర వీగొద్దని కూటమి ఎమ్మెల్యేలకు పదే పదే క్లాసులు పీకారు చంద్రబాబు. నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలో కొద్ది మంది కట్టు తప్పినట్లు ప్రవర్తిస్తే వెంటనే పిలిచి వారించారు. కానీ, అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో తప్పు జరుగుతుండటాన్ని గమనిస్తూనే ఉన్నారు సీఎం చంద్రబాబు. ఇదే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ గుర్తుచేస్తూనే ఉన్నారు. కానీ, కొద్దిమంది నేతలు చంద్రబాబు హెచ్చరికలను మరచిపోతున్నారేమో.. మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారు. ఐతే ఈ తప్పులకు ఎక్కడో ఒక చోట ఫుల్‌స్టాప్ పెట్టాలని భావించిన చంద్రబాబు ఇప్పుడు యాక్షన్‌లోకి దిగిపోయారు.
శాసనసభ్యులకు గట్టి హెచ్చరికలు
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా కూటమి ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా టీడీపీ శాసనసభ్యులకు గట్టి హెచ్చరికలు పంపారు సీఎం చంద్రబాబు. తమ అధికారం పదికాలాలు కొనసాగాలంటే ఎమ్మెల్యేలు వ్యవహరశైలి హుందాగా ఉండాలని గతంలో చాలాసార్లు చెప్పారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉండటంతో తప్పు ఎవరు చేసినా వెంటనే మందలిస్తున్నారు. గతంలో వైసీపీ నేతలు తప్పులు చేశారు కదా అని తాము కూడా అలాగా ఉంటామంటే వారికి.. మనకి తేడా ఏంటని.. వారు తప్పులు చేశారు కనుకే ప్రతిపక్షం హోదా కూడా దక్కించుకోలేకపోయారని చెబుతున్న చంద్రబాబు.. పార్టీ నేతలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.
ప్రతిపక్షానికి నో ఛాన్స్
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఓ భవనాన్ని కూల్చేయడానికి వెళితే.. తప్పని వారించిన బాబు.. ఆ తర్వాత కూడా వివాదాలకు కారణమైన ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు క్లాసులు తీసుకుంటూ వస్తున్నారు. ఇక ఆదిమూలం ఎపిసోడ్ వార్నింగ్ స్టేజ్ దాటిపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. లైంగిక వేధింపులపై ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రతిపక్షానికి కూడా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు. ఒకవైపు వరద సహాయక చర్యల్లో తాను బిజీగా ఉన్నప్పటికీ, ఆదిమూలంపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను ఆదేశించారు బాబు.
Also Read: పారిపోవడం తప్ప మరో ఆప్షన్ లేదా? వైసీపీ నేతలను వెంటాడుతున్న భయం ఏంటి..!
ఆదిమూలంపై ఆగమేఘాల మీద చర్యలు
రాష్ట్ర రవాణా మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి, చిలకూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబ సభ్యులు వ్యవహరశైలిపై ఆరోపణలు రాగానే.. ఆ ఇద్దరితో మాట్లాడిన చంద్రబాబు భవిష్యత్‌లో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కానీ, ఆదిమూలం ఎపిసోడ్‌లో ఏ మాత్రం ఆలస్యం చేసిన పార్టీ ఇమేజ్‌తోపాటు వ్యక్తిగతంగా చంద్రబాబుకు మచ్చ తెచ్చే విధంగా ఉండటంతో అస్సలు సమయం ఇవ్వలేదని చెబుతున్నారు. ఆదిమూలంపై వేటు వేయడం ద్వారా ఇతర ఎమ్మెల్యేలు జాగ్రత్త పడతారని భావించడమే ఆగమేఘాల మీద చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: సత్యవేడు ఎమ్మెల్యే కామాంధుడు.. తిరుపతిలోని భీమాస్ హోటల్లో రూమ్ నెంబర్ 109కి రమ్మన్నాడు
వాస్తవానికి క్రమశిక్షణ విషయంలో చంద్రబాబు ఎప్పుడూ ఇదే స్పీడ్‌తో ఉంటారు. 1995లో తొలిసారి సీఎం అయిన నుంచి ఇప్పటివరకు తప్పు చేసిన నేతలు ఎందరినో బయటకు పంపారు చంద్రబాబు. రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ ఉండటం ఎంతో ముఖ్యమనే భావనతో ఎమ్మెల్యేలు వ్యవహార శైలిపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తుంటారు. నాలుగోసారి సీఎం అయ్యాక రాష్ట్ర పునర్నిర్మాణమంటూ ఎంత బిజీగా ఉన్నా, ఎమ్మెల్యేలను ఓ కంటి కనిపెడుతుంటమే చర్చకు తావిస్తోంది. మొత్తానికి ఆదిమూలం ఎపిసోడ్‌లో వాయువేగంతో చర్యలు తీసుకోవడం భవిష్యత్‌లో ఏ ఎమ్మెల్యే అయినా జాగ్రత్తగా మెలగాల్సిందేనని హెచ్చరికలు పంపడమేనంటున్నారు.