కూలిన బ్రిడ్జి, అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు- ఏపీలో వర్ష బీభత్సం

ఈ రహదారి వెంబడి ఉన్న 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆసుపత్రులకు వెళ్లేందుకు మార్గం లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోయారు.

కూలిన బ్రిడ్జి, అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు- ఏపీలో వర్ష బీభత్సం

Heavy Rains Wreak Havoc in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

అల్లూరి సీతారామ రాజు జిల్లాలో భారీ వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జీకే వీధి మండలం చామగడ్డ ప్రధాన రహదారిపై ఉన్న వంతెన కూలిపోయింది. దీంతో ఈ రహదారి వెంబడి ఉన్న 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆసుపత్రులకు వెళ్లేందుకు మార్గం లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోయారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి రాకపోకలను పునరుద్ధరించాలని వేడుకుంటున్నారు.

అల్లూరి సీతారామ రాజు జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఐరన్ బ్రిడ్జిని ఢీకొని కాలువలోకి వెళ్లింది పల్లె వెలుగు బస్సు. ప్రయాణికులను స్థానికులు కాపాడారు. వర్షం పడటంతో బస్సు అదుపు తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు రాజమండ్రి డిపోకు చెందినదిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులను రాజమండ్రి, నర్సీపట్నం ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read : విశాఖలో భయం, భయం.. ప్రమాదం అంచున నివాస భవనాలు, భయాందోళనలో ప్రజలు

అడ్డతీగల అటవీ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. తృటిలో ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి నర్సీపట్నం వైపు వెళ్తుండగా అడ్డతీగల మండలం బోర్నగూడెం దగ్గర ప్రమాదం జరిగింది. ఉదయం నుంచి వర్షం ఎక్కువగా రావడం, అడ్డతీగల ఏజెన్సీ ప్రాంతంలో ప్రమాదకరమైన మలుపు తిరుగుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 16మందికి గాయాలయ్యాయి. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. అసలే కుండపోత వర్షం, పైగా ఏజెన్సీ ప్రాంతం కావడం, దానికి తోడు ప్రమాదకరమైన మలుపులు ఉండటం యాక్సిడెంట్ కు కారణం అంటున్నారు స్థానికులు. అయితే, ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లైంది.