ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.. అసలు ఏపీలో ప్రభుత్వ ఉందా?- వైఎస్ జగన్

5కోట్ల మంది జనాభా, లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న ప్రభుత్వం.. ఐదారు లక్షల మందిని ఆదుకోని దీన స్థితిలో ఉందా? అని నిలదీశారు జగన్.

ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.. అసలు ఏపీలో ప్రభుత్వ ఉందా?- వైఎస్ జగన్

Ys Jagan Mohan Reddy : విజయవాడలో వరదలు వచ్చి 8 రోజులు అవుతున్నా ఇప్పటికీ బాధితులకు భరోసా లేకుండా పోయిందని విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయని జగన్ ఆరోపించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. వరదల కన్నా చంద్రబాబు నిర్వాకాల వల్లే భారీగా నష్టం వాటిల్లిందన్నారు.

5కోట్ల మంది జనాభా, లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న ప్రభుత్వం.. ఐదారు లక్షల మందిని ఆదుకోని దీన స్థితిలో ఉందా? అని నిలదీశారు జగన్. బాధితుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేశామని చెబుతున్నా అవి ఎక్కడ ఉన్నాయో తెలియటం లేదన్నారు. బాధితులను లోతట్టు ప్రాంతాల నుంచి సహాయక శిబిరాలకు తరలించకపోవడం ఒక్క చంద్రబాబు ప్రభుత్వంలోనే జరిగిందని ఆరోపించారు జగన్.

”3 రోజుల్లో 30 సెంటీమీటర్లకు పైగా వర్షం పడటం అసాధారణం ఏమీ కాదు. గతంలో చాలాసార్లు పడింది. కానీ ఈ మాదిరిగా 50మందికిపైగా ప్రజలు చనిపోవడం ఎప్పుడూ జరగలేదు. బాధితుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేశామని మీరు చెబుతున్నా అవి ఎక్కడున్నాయో తెలియకపోవడం, బాధితులను లోతట్టు ప్రాంతాల నుంచి సహాయక శిబిరాలకు తరలించకపోవడం అన్నది మీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఈ వరదలు వచ్చి 8 రోజులు అవుతున్నా, 4-5 రోజులుగా వర్షాలు లేకున్నా ఇంకా ప్రజలు నీటిలోనే సాయం అందని పరిస్థితుల్లోనే ఉండడం చాలా దారుణం” అని మండిపడ్డారు జగన్.

”అసలు ఇదంతా ఎందుకు జరిగింది? దీనికి కారణం మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాదా చంద్రబాబు? శుక్రవారం (ఆగస్టు 30) నుంచి భారీ వర్షాలు వస్తాయని, భారీగా వరద వస్తుందని మీకు బుధవారం రోజే (ఆగస్టు 28) అలర్ట్‌ వచ్చినా, అప్పటికే కృష్ణానదిపై ఉన్న జలాశయాలన్నీ పూర్తి సామర్థ్యంతో నిండుగా ఉన్నాయని తెలిసినా, అలాగే పైనుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వరద వస్తుందని సమాచారం ఉన్నా, బుధవారం నుంచి శుక్రవారం వరకూ రెండున్నర రోజుల సమయం ఉన్నా మీరు పట్టించుకోలేదు. ఇరిగేషన్‌, రెవిన్యూ, హోం సెక్రటరీలతో రివ్యూ తీసుకుని వారికి బాధ్యతలు అప్పగించి దిశానిర్దేశం చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా?” అని జగన్ అన్నారు.

 

Also Read : ఇదంతా వారి పాపమే..!- విజయవాడ వరదలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు