ఇదంతా వారి పాపమే..!- విజయవాడ వరదలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

చేయగలిగింది లేక 7 రోజులు అవుతున్నా ఇంకా అనేక ప్రాంతాలు నీటిలోనే ఉండటం బాధాకరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వాపోయారు. రాజరాజేశ్వరి పేటలో ఇంకా 4 అడుగుల మేర నీరు ఉందన్నారు.

ఇదంతా వారి పాపమే..!- విజయవాడ వరదలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Budameru Floods : గత ప్రభుత్వం చేసిన అన్ని పాపాలు కలిసి ప్రజలకు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన చరిత్రాత్మక తప్పిదం వల్ల బుడమేరు ఉప్పొంగిందని, గండ్లు పడ్డాయని చంద్రబాబు ఆరోపించారు. గండ్లు పూడ్చి కట్ట పటిష్టం కోసo తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సైతం ఖర్చు చేయలేదన్నారు. నగరం వైపు నీరు ప్రవేశించే బుడమేరు మూడు గండ్లను ఇవాళ పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన గండ్ల పూడ్చివేత పనులు పూర్తి చేశామని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఆర్మీ కూడా అభినందించిందన్నారు.

గండ్లు పూడ్చటం వల్ల విజయవాడ నగరంలోకి నీరు రావడం ఆగిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. విజయవాడ వరదల కారణంగా నిద్ర లేని రాత్రులు గడిపామని సీఎం చంద్రబాబు అన్నారు. బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Also Read : విజయవాడను, లంక గ్రామాలను ముంచాలనే పడవలను వదిలారు : మంత్రి కొల్లు రవీంద్ర

చేయగలిగింది లేక 7 రోజులు అవుతున్నా ఇంకా అనేక ప్రాంతాలు నీటిలోనే ఉండటం బాధాకరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వాపోయారు. రాజరాజేశ్వరి పేటలో ఇంకా 4 అడుగుల మేర నీరు ఉందన్నారు. అక్కడికి ఆహారం కూడా సరిగా అందలేదని ప్రజలు నేరుగా నాకు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు చంద్రబాబు. ఇప్పటికీ నగరంలో దాదాపు ఒక టీఎంసీ నీరు ఉందని తెలిపారు. వివిధ ప్రమాద హెచ్చరికల నివేదికలు పరిశీలించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

”గత ప్రభుత్వం పాపం వల్లే బుడమేరు ఉప్పొంగింది. 7 రోజులుగా ప్రజలు వరదతో ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్తులో బుడమేరు ముంపునకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం చూపుతాం. వరద బాధితులకు నిత్యవసరాలను అందిస్తున్నాం. ప్రజలు అధైర్య పడొద్దు. వీలైనన్ని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.

”గత ప్రభుత్వం పాపం వల్లే బుడమేరు వరద. బుడమేరు ముంపునకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం చూపుతాం. ఇంటింటికెళ్లి వరద బాధితులకు నిత్యవసర సరుకులు అందిస్తాం. వరద ముంపునకు గురైన ఇళ్లను శుభ్రం చేస్తున్నారు. ఇప్పటివరకు 17వేల ఇళ్లను శుభ్రం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 78శాతం రోడ్లు శుభ్రం చేశారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో మినహా అన్ని ప్రాంతాల్లో కరెంట్ ను పునరుద్దరించాం. బుడమేరు గండ్లను పూడ్చివేశాం.

వరదల వల్ల 28 మంది చనిపోయారు. వరదలతో చాలామంది ఉపాధి కోల్పోయారు. ఉపాధి కల్పించాలని చాలామంది కోరుతున్నారు. ముంపు ప్రాంతాల వాసులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తాం. ఈ ప్రాంతంలోని అందరూ డిజిటల్ లిటరేట్స్ అయ్యేలా శిక్షణ ఇస్తాం. వరద నష్టంపై తొలి విడతగా కేంద్రాన్ని రూ.6,880 కోట్లు అడిగాం. ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నాం. వరద సాయంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని” సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

ప్రకాశం బ్యారేజీలో బోట్ల ఘటనపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ”ప్రకాశం బ్యారేజ్ లోకి బోట్లు ఎలా వచ్చాయో విచారణ చేస్తాం. బోట్ల యజమానులపై అనుమానాలు ఉన్నాయి. దర్యాఫ్తులో వాస్తవాలు తెలుస్తాయి. బోట్ల విషయంలో కుట్ర కోణం ఉంటే ఉపేక్షించం. వరదలకు ప్రకాశం బ్యారేజ్ లో బోట్లు ఢీకొని 3 గేట్ల కౌంటర్ వెయిట్స్ దెబ్బతిన్నాయి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.