Potash : పంట దిగుబడిలో పొటాష్ అవసరం ఎంత?

పంట వేసిన నాటి నుండి పంట కాలం ముగిసే వరకకు పొటాష్ అవసరత పంటకు ఉంటుంది. అయితే పంట ఏపుగా పెరిగే దశలో, గింజ దశలో దీని అవసరత ఎక్కువగా ఉంటుంది

Potash : పంట దిగుబడిలో పొటాష్ అవసరం ఎంత?

Potash

Potash : పంటల ఉత్పాదకతను పెంచటంలో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. మొక్కలలో జీవరసాయానిక క్రియలను నియంత్రించటంతోపాటు, కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడిన పిండి పదార్ధాలను అన్ని బాగాలకు చేరవేస్తుంది. పత్ర రంధ్రాలు తెరచుకోవటం, మూసుకోవటం, ఎంజైములను చైతన్యవంతం చేయటంలో పొటాషియం దోహదం చేస్తుంది. ఎకరం పంట ఉత్పత్తిలో టన్నుకు 8 నుండి 12 కిలోల పొటాషియం పోషకాలను భూమి నుండి పంటలు గ్రహిస్తాయని పలు పరిశోధనల్లో తేలింది.

వరి, జొన్న, సజ్జ వంటి పంటలలో కాండం గట్టిపడటానికి, పంటకు శక్తితోపాటు, తెగుళ్ళు, పురుగులను తట్టుకునేలా చేయటంలో పొటాషియం పాత్ర కీలకం. గింజలు గట్టిగా బరువు కలిగిఉండేలా చేస్తుంది. పప్పుజాతి పైర్లలో నత్రజని స్ధిరీకరణలో తోడ్పడుతుంది. పంటలు అనుకోని కారణాల వల్ల నీటి ముంపుకు గురైతే ఇనుపధాతువు లోపంవల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. మొక్కలలో పిండి పదార్ధాల తయారీలో, అధిక నూనె శాతాన్ని సాధించేందుకు తగిన మోతాదులో పొటాషియం ఎరువులను వాడుకోవాలి.

కొన్ని లక్షణాల ద్వారా పంటలో పొటాష్ లోపాన్ని గుర్తించవచ్చు. మొక్క ఆకుల అంచులు ఆకుపచ్చరంగుగా మారి క్రమోపి పసుపు రంగులోకి వచ్చి కాలిపోనట్లు కనిపిస్తాయి. నిదానంగా ఆకులు మాడిపోతుంటాయి. కాండం బలహీనడిపోతుంది. మొక్క ఎదుగల లేక పొట్టిగా గిడసబారి పోతుంది. పొటాష్ లోపం కారణంగా మొక్క ఎదుగుదల లేక పంట ఉత్పత్తులు తగ్గిపోతాయి. ఇలాంటి లక్షణాలు గుర్తించిన వెంటనే పొటాష్ లోపించిందని గుర్తించి వెంటనే తగుమోతాదులో పొటాష్ ను మొక్కలకు అందించాలి.

పంట వేసిన నాటి నుండి పంట కాలం ముగిసే వరకకు పొటాష్ అవసరత పంటకు ఉంటుంది. అయితే పంట ఏపుగా పెరిగే దశలో, గింజ దశలో దీని అవసరత ఎక్కువగా ఉంటుంది. పంట తొలిదశలో 30శాతం, కాత పూత దశలో 70శాతం పొటాష్ అందించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సేంద్రీయ ఎరువుల రూపంలో పొటాష్ అందించే అవకాశం ఉన్నప్పటికీ అందులో పొటాష్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. పొటాష్ ఇటీవలికాలంలో కాంప్లెక్స్ ఎరువు రూపంలో , ద్రావకం రూపంలో లభిస్తుంది.

భూసార పరీక్షలను పంటకు ముందు చేయించుకోవటం మంచిది. దాని ప్రకారం భూమిలో పొటాషియం పరిమాణం సంబంధించిన వివరాలు తెలుస్తాయి. దీని అధారంగా పొటాష్ ను పంటకు అందించుకునేందుకు వీలవుతుంది. పంటకాలాన్నీ బట్టి ఎకరానికి 16 కిలోల నుండి 50 కిలోల వరకు పొటాష్ అవసరం అవుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. పంట దిగుబడికి కీలకమైన పొటాష్ ను అవసరమైన మోతాదులో మొక్కలకు అందించటం ద్వారా ఆశించిన మేర పంట ఉత్పత్తిని పొందేందుకు అవకాశం ఉంటుంది.