Tobacco : పురుగు మందుల వాడకం తగ్గితే.. పొగాకు రైతులకు మంచి ధర

పొగాకు సాగులో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఏడాది అన్ని వేలంకేంద్రాల్లో ప్రయోగాత్మకంగా కొంతమంది రైతులతో రసాయన ఎరువులను వినియోగించకుండా పొగాకు సాగు చేపట్టినట్లు చెప్పారు.

Tobacco : పురుగు మందుల వాడకం తగ్గితే.. పొగాకు రైతులకు మంచి ధర

Tobacco

Tobacco : మనం పండించే రకరకాల పంటలో ఎన్నో రకాల చీడపీడలు, బాక్టీరియా, వైరస్లు ఆశించి నాణ్యత, దిగుబడులు క్షీణిస్తున్నాయి. వీటి సమస్యలు తగ్గించడానికి చాలా రకాల పురుగు మందులు మనం వాడుతున్నాం. ముఖ్యంగా పొగాకు పంటపై చీడపీడల నివారణకు రసాయన మందులను విచక్షణా రహితంగా వాడటం వల్ల పొగాకులో పురుగుమందుల అవశేషాలు పరిమితికి మించి ఉంటున్నాయి. పొగ తాగేవారికి ఈ అవశేషాలు హానికలిగిస్తున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. పొగాకులో అవశేషాలు పరిమితికి మించి ఉంటే, ఎగుమతులు నిలిచిపోయే ప్రమాదంతో పాటు మార్కెట్లో ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ విపణిలో పొగాకు ఎగుమతులను గణనీయంగా పెంచేందుకు రైతులు సస్య రక్షణ యాజమాన్యంలో మెళుకువలు పాటించాల్సివుంది.

పొగాకు సాగులో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఏడాది అన్ని వేలంకేంద్రాల్లో ప్రయోగాత్మకంగా కొంతమంది రైతులతో రసాయన ఎరువులను వినియోగించకుండా పొగాకు సాగు చేపట్టినట్లు చెప్పారు. పొగాకు పంటలో అన్యపదార్థాలు, రసాయన మందులు లేకుండా పంట ఉత్పత్తి చేస్తే రైతులకు మంచి ధరలు లభించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎండోసల్ఫాన్ , ప్రోఫినోఫాస్, ఎసిఫేట్, క్లోరోఫైరీఫాస్, మోనోక్రోటోఫాస్, క్వినాల్ ఫాస్, ఫెన్ వలరేట్, లిండేన్, పొడి మందులు వంటి వాటిని పొగాకు పంటలో వినియోగించకుండా ఉండటం మంచిది.

పొగాకులో మందుల అవశేషాలు లేకుండా ఉండాలంటే వీలయినంత వరకు మందుల వాడకాన్ని తగ్గించడం అన్నింటికన్నా ముఖ్యం. ఇతర సస్యరక్షణ పద్ధతులైన ఎర పంటలు, కంచె పంటలు, వేప, కానుగ మందులు, ఎన్ పి వి వాడటం ద్వారా పంట నాణ్యతను పెపొందించుకోవాలి. నిషేధించిన మందులను, పొడి మందులను, గుళిక మందులను పొగాకులో ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. పురుగు మందులు చల్లేందుకు సరైన నాణ్యతా ప్రమాణాలు గల స్ప్రేయర్లనే వాడాలి. సిఫారసు చేసిన మందులనే ఉపయోగించాలి. పొగాకులో పురుగు మందుల వాడకాన్ని తగ్గించటం ద్వారా మార్కెట్లో మంచి ధర ను పొందేందుకు అవకాశం ఉంటుంది.