వైసీపీలో వర్గపోరు.. చీరాలలో ఆమంచి, కరణం మధ్య వార్!

  • Published By: sreehari ,Published On : November 6, 2020 / 09:27 AM IST
వైసీపీలో వర్గపోరు.. చీరాలలో ఆమంచి, కరణం మధ్య వార్!

Amanchi vs Karanam Balaram in Cheerala : ప్రకాశం జిల్లా చీరాలలో కరణం బలరాం వర్సెస్‌ ఆమంచి.. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వార్‌ నడుస్తోంది. ఏ సందర్భం వచ్చినా నువ్వా నేనా అనేంతలా రచ్చకెక్కుతోంది.

రెండు వర్గాల మధ్య గొడవలు పీక్స్‌కి చేరడంతో.. చీరాల రణరంగంగా మారుతోంది.

చాలాసార్లు పరస్పరం దాడులకు దిగాయి రెండు వర్గాలు.. వారం రోజుల వ్యవధిలోనే రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి.

అక్టోబర్ 31 రాత్రి చీరాల దద్దరిల్లిపోయింది. కరణం బలరాం పుట్టినరోజు వేడుక సందర్భంగా చీరాలలో ఓ మినీ యుద్ధమే జరిగింది. ఇద్దరు లీడర్ల కేడర్ మధ్య.. దిమ్మతిరిగే వార్ నడిచింది.

మా లీడర్ జిందాబాద్ అంటే.. మా లీడర్ జిందాబాద్ అంటూ.. పోటీ పడి మరీ గొడవపడ్డారు. కర్రలతో దాడులు చేసుకున్నారు.. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.



కరణం బలరాం అద్దంకిని వీడి.. చీరాలలో అడుగుపెట్టినప్పటి నుంచి వార్‌ మొదలైంది. అయితే ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగత విభేదాల్లేవ్..

విమర్శలూ లేవు. కాని ఒకే పార్టీలో ఉన్నా.. ఇంకా ప్రత్యర్థులుగానే కొనసాగుతున్నారు.
https://10tv.in/karanam-balaram-vs-amanchi-krishna-mohan-group-clashes-in-chirala/
ఇద్దరు నాయకులు సమఉజ్జీలు కావడం, జనంలో మాస్ లీడర్లన్న పేరు, బలమైన కేడర్ కలిగి ఉండటంతో.. ఎవ్వరూ తగ్గే పరిస్థితి కనిపించట్లేదు.



ఇద్దరు లీడర్లు స్థానికంగా నిర్వహించే ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అక్కడ టెన్షన్‌ వాతావరణం నెలకొంటోంది.

వీరిద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో.. స్థానికంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయ్.

నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా.. వర్గపోరుతో చీరాల రణరంగంగా మారుతోంది. రెండు వర్గాలను అదుపు చేయడం పోలీసులకు సవాల్‌ మారింది.

మొన్నటికి మొన్న కూడా ఆమంచి, కరణం వర్గీయులు ఘర్షణకు తెరలేపారు. ఎమ్మెల్యే కరణం పుట్టినరోజున చీరాల నుంచి పందిళ్లపల్లి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

స్థానిక YCP నేత కంది అంజిరెడ్డి ఇంటి వద్ద కేక్‌ కట్‌ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.



ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి నవంబర్‌ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ విషయంలోనూ విబేధాలు భగ్గుమన్నాయి.

కరణం వర్గీయులు ద్విచక్రవాహనాలతో ర్యాలీగా వెళ్తూ ఆమంచి ఇంటి ముందుకు వచ్చేసరికి గట్టిగా జై కరణం అంటూ నినాదాలు చేశారు.

దీంతో తన అనుచరులతో కలిసి ఆమంచి బయటకు వచ్చారు. కళ్లుమూసి తెరిచేలోగా ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగాయి. ఒకరిపై ఒకరు రాళ్లు, కుర్చీలు విసురుకోగా ఇద్దరు గాయపడ్డారు.



కొన్ని వాహనాలను కిందపడేసిన ఆమంచి అనుచరులు ర్యాలీ ముందుకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు.

ఈ విషయం తెలిసిన కరణం వర్గీయులు పెద్దఎత్తున అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

గతంలోనూ వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఆమంచి, కరణం వర్గీయుల మధ్య విభేదాలు బయటపడ్డాయి.

ఇలా మాటిమాటికి పార్టీలో నేతల మధ్య వర్గపోరు బయటపడుతుండటం పార్టీ అధిష్టానికి తలనొప్పిగా మారుతోంది.



చీరాలలో పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అధిష్ఠానం ఆమంచి, కరణం వర్గాలను పిలిపించి మాట్లాడారు.

ఇరు వర్గాలు పార్టీ పెద్దల ముందు తమ అభిప్రాయాలు చెప్పారు. ఆ రోజు దాడికి సంబంధించిన వీడియో క్లిప్పింగుల్ని పార్టీలు పెద్దలు చూశారు.

తమ వర్గం తప్పేది లేదని… ఆసమయంలో చీరాలలోనే లేనని విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని కరణం బలరాం వర్గం చెబుతోంది.

మరో వైపు దురుద్దేశంతోనే తమ ఇంటి పక్కన పుట్టిన రోజు కార్యక్రమం పెట్టి రెచ్చగొట్టారని ఆమంచి వర్గం ఆరోపించింది.



బర్త్‌డే వేడుకల్లో జరిగిన గొడవ చల్లారకముందే మరోసారి చీరాలలో మళ్లీ చిచ్చు రేగింది. ప్రజా సంకల్ప యాత్ర సంబరాల వేళ.. చీరాలలో అధికార పార్టీ నేతల వర్గపోరు మరోసారి బయటపడింది.

ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వర్గీయుల గురువారం రాత్రి ఘర్షణకు దిగారు. చీరాల పోలీస్ స్టేషన్ ఎదుటే ఇరు వర్గీయులు బాహాబాహికి దిగారు.

కరణం బలరాం వర్గీయుడిపై దాడి చేశారంటూ చీరాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి రవి, అడ్వకేట్ తులసి, వాలంటరీ సాయిని వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు.



ఆమంచి వర్గీయులపై కేసు నమోదు చేసి.. మెడికల్ చెకప్ నిమిత్తం ఆమంచి వర్గానికి చెందిన ముగ్గుర్ని బస్సులో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఇవాళ ఉదయం ఆమంచి అనుచరులు… తమ వర్గీయుడ్ని పోలీస్‌ స్టేషన్‌ నుంచి విడిపించుకొని వెళ్లిపోయారు.

మరోవైపు జగన్ ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తైన సందర్భంగా చీరాలలో ఆమంచి, బలరాం వర్గీయులు పోటా పోటీ ర్యాలీలకు సిద్ధమయ్యారు.

ఈ ర్యాలీలకు పోలీసులు కూడా అనుమతిచ్చారు. చీరాలలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు.