Nellore : రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ సిబ్బంది నిరాకరణ..బైక్‌పై గ్రామానికి తీసుకెళ్లిన తండ్రి

మృతదేహాన్ని తరలించేందుకు రూల్స్ ఒప్పుకోవని అంబులెన్స్ సిబ్బంది తేల్చి చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించలేని ఆర్థిక పరిస్థితి లేక.... చివరికి బైక్‌పైనే మృతదేహాన్ని తీసుకెళ్లాడు.

Nellore : రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ సిబ్బంది నిరాకరణ..బైక్‌పై గ్రామానికి తీసుకెళ్లిన తండ్రి

Nellore

Ambulance crew refuses : ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ సిబ్బంది నిరాకరించడంతో చేసేదేం లేక రెండేళ్ల చిన్నారి డెడ్‌బాడీని బైక్‌పై తీసుకెళ్లాడు తండ్రి. నాయుడుపేటలో ఈ విషాద ఘటన జరిగింది. మృతదేహాన్ని తరలించేందుకు రూల్స్ ఒప్పుకోవని అంబులెన్స్ సిబ్బంది తేల్చి చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించలేని ఆర్థిక పరిస్థితి లేక…. చివరికి బైక్‌పైనే మృతదేహాన్ని తీసుకెళ్లాడు. కాగా… కొత్తపల్లి గ్రామంలో సమీప చెరువులోని గ్రావెల్ కుంటలో ప్రమాదవశాత్తు రెండేళ్ల చిన్నారి అక్షయ పడిపోయింది. చిన్నారిని బయటకు తీసి… నాయుడుపేట ఆస్పత్రికి తరలించగా… అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఎప్రిల్ 26న తిరుపతి రుయా ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మితిమీరాయి. దందా చేస్తూ పేదలను పీడిస్తున్నాయి. అప్పటికే కొడుకు చనిపోయిన బాధలో ఉన్న ఓ తండ్రికి అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మరింత కుమిలిపోయేలా చేశాయి. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రుయా అంబులెన్సు డ్రైవర్లు.. కేవలం 90 కిలోమీటర్ల దూరానికి రూ.20 వేలు అడిగి దౌర్జన్యం చేశారు. అంతేకాదు.. ఉచిత అంబులెన్సు వచ్చినా డ్రైవర్ ను బెదిరించి తన్ని తరిమేశారు. దీంతో ఆ తండ్రి తన కన్నకొడుకు మృతదేహాన్ని బైకుపై తీసుకెళ్లాల్సి వచ్చింది.

Govt Hospital : అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు.. మృతదేహాన్ని తరలించేందుకు రూ.80 వేలు డిమాండ్‌

మే1న మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మరో హృదయ విదాకర ఘటన జరిగింది. రెక్కాడితే కానీ డొక్కాడని వలస కూలీ మృతదేహంతో కూడా వ్యాపారం చేయాలని మంచిర్యాల అంబులెన్స్‌ డ్రైవర్లు చూశారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ఆ మృతదేహాన్ని మృతుని తరపు బంధువులు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. మంచిర్యాలలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వలస కూలీ మోతిషా వడదెబ్బతో మృతి చెందాడు. స్వగ్రామానికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు కడసారి చూపును దక్కిందామనుకున్న అతని బంధువులకు అంబులెన్స్‌ డ్రైవర్లు చెప్పిన మాటలు షాక్‌ ఇచ్చాయి.

మృతదేహాన్ని తరలించేందుకు అక్షరాల 80 వేల రూపాయలు ఇస్తే గానీ తరలించేది లేదని తేల్చి చెప్పారు. మోతిషా మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న అతని బంధువులకు అక్కడి డ్రైవర్లు చెప్పిన మాటలు షాక్‌ ఇచ్చాయి. పొట్టకూటి కోసం రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చామని.. తమ వద్ద అంత డబ్బు లేదని చెప్పారు. అయినా రేటు తగ్గకపోవడంతో ఏం చేయాలో తెలియక.. అనాథ శవంలా అక్కడే వదిలేసి మోతిషా బంధువులు వెళ్లిపోయారు.