నేను విన్నాను..నేను ఉన్నాను : వైఎస్సార్ చేయూత ప్రారంభం

  • Published By: madhu ,Published On : August 12, 2020 / 11:57 AM IST
నేను విన్నాను..నేను ఉన్నాను : వైఎస్సార్ చేయూత ప్రారంభం

మహిళల జీవితాల్లో వెలుగులు నింపే పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ చేయూత పథకాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పథకంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 25 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది.

25 లక్షల మంది ఖాతాల్లో 18 వేల 750 రూపాయల చొప్పున జమ కానుంది. ఈ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలనే విషయంలో ఎలాంటి షరతుల్లేవని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
పాదయాత్ర జరుగుతున్నప్పుడు 45–60 ఏళ్ల మధ్యనున్న అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వ పథకాలేవీ వర్తించలేదనే విషయాన్ని గుర్తు చేశారు. గతంలో కార్పొరేషన్ల పేరుతో రుణాలు ఇచ్చేవారని, ఊర్లో వేయిమంది ఉంటే.. ఒకరికో, ఇద్దరికో రుణాలు వచ్చే పరిస్థితి ఉండేదన్నారు.

అది కూడా రాజకీయ పలుకుబడి ఉండి, లంచాలు ఇచ్చుకునే పరిస్థితి, దీనివల్ల ఎవ్వరికీ ఏమీ జరిగేది కాదు, ఎవ్వరికీ ఉపయోగపడేది కాదన్నారు. మిగిలిన వాళ్లు బాధపడే పరిస్థితి, ఇవన్నీ మార్పులు చేస్తూ, ఈ వయస్సులో ఉన్న అక్కలకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో కార్పొరేషన్లను ప్రక్షాళన చేశామన్నారు.

మొదట పెన్షన్‌ రూపంలో డబ్బు ఇద్దామనుకున్నామని, ఆ రోజుల్లో వేయి రూపాయలు అనుకుంటే.. ఏడాదికి రూ.12వేలు..,45ఏళ్లకే పెన్షన్‌ ఏంటి? అంటూ మమ్మల్ని వెటకారం చేశారని తెలిపారు. పోనీలే అనుకుని… ఏడాదికి రూ.12వేలు కాదు, రూ.18750 ఇస్తాం, నాలుగేళ్లపాటు చేయిపట్టుకుని నడిపిస్తాం అని చెప్పి పథకాన్ని తీసుకు వచ్చామన్నారు.

ప్రతి ఏటా రూ.18750 చొప్పున రూ. 75వేలు ఆ అక్కకు ఇస్తున్నామన్నారు. జీవితాలను మార్పు చేసుకునే అవకాశం మహిళలకు వస్తోందని, దీన్ని ఎన్నికల ప్రణాళికలో పెట్టామన్నారు. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి పథకాన్ని వర్తింపు చేస్తామని

చెప్పాం:..చేయగలుగుతున్నామన్నారు. ఈ పథకంలో ఒక అడుగు ముందుకు వేశాం, అక్కల అకౌంట్లోకి నేరుగా బదిలీచేస్తున్నాం, పాత అప్పులకి జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌ కంబర్డ్‌ బ్యాంకు ఖాతాల్లోకి పంపుతున్నామన్నారు సీఎం జగన్.