కోటి మందికి కరోనా వ్యాక్సిన్.. ఆంధ్రప్రదేశ్‌లో ‘డ్రై’రన్

కోటి మందికి కరోనా వ్యాక్సిన్.. ఆంధ్రప్రదేశ్‌లో ‘డ్రై’రన్

covid vaccine:కరోనా వైరస్ వ్యాక్సిన్ (COVID-19 వ్యాక్సిన్) అత్యవసర ఉపయోగం భారతదేశంలో ఆమోదించగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ సన్నాహాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే టీకా వ్యవస్థలను అంచనా వేయడానికి నాలుగు రాష్ట్రాల్లో రిహార్సల్ జరుగుతోంది. పంజాబ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈమేరకు విషయాన్ని వెల్లడించగా.. వ్యాక్సిన్ డెలివరీకి ముందు డ్రై రన్ జరుగుతుంది.

మొదటి దశలో 300 మిలియన్ల మందికి టీకాలు వేయనుండగా.. మూడు కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, భద్రతా సిబ్బంది, స్కావెంజర్లతో పాటు, 50 ఏళ్లు పైబడిన 27 కోట్ల మందికి టీకాలను వెయ్యనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయడమే లక్ష్యంగా జగన్ సర్కార్ ప్రణాళికలు వేస్తోందిన. అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో రెండు రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టుగా కరోనా వ్యాక్సిన్ ‘డ్రై రన్’ నిర్వహిస్తున్నారు అధికారులు. కృష్ణాజిల్లాలోని గన్నవరంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియ సాగుతోంది.

ఐదు సెంటర్లలో ఎంపిక చేయబడిన 125 మందికి డమ్మీ టీకాలు వేయనుండగా.. వీటిని పర్యవేక్షించడానికి ఐదుగురు వ్యాక్సినేషన్ ఆఫీసర్లను నియమించారు. కలెక్టర్ నేతృత్వంలోని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఈ డ్రై రన్‌ను పర్యవేక్షిస్తుంది. కరోనా వ్యాక్సినేషన్‌లో తలెత్తే లోపాలను గుర్తించేందుకు ముఖ్యంగా ముందుగానే ఈ ‘డ్రై రన్’‌ను నిర్వహిస్తుంది కేంద్రం. ముందుగా సమీప డిపో నుంచి వాక్సినేషన్ కేంద్రానికి టీకాలను తరలిస్తారు. టీకా ఇచ్చిన తర్వాత ఎస్‌ఎమ్ఎస్‌లో వ్యాక్సిన్ ఇచ్చిన అధికారి పేరు, సమయం వస్తుంది. అలాగే టీకా తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా.. వెంటనే ట్రీట్మెంట్ చేసేలా జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా టీకాలను ఇచ్చే పక్రియ ప్రారంభం కాబోతుండగా.. అందులో భాగంగానే ఇప్పుడు డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రై రన్ తర్వాతే టీకా ఇచ్చే తేదీలపై క్లారిటీ రాబోతుంది. ఇప్పటికే స్టేట్ వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్‌కు 30 లక్షల సిరంజీలు చేరగా.. త్వరలోనే ఇక్కడ 57 వేల లీటర్ల టీకాను భద్రపరిచే అవకాశం ఉంది. ముందుగా టీకాను ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు తర్వాత, 50 ఏళ్లు దాటిన వారికి ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. డ్రై రన్ పూర్తయ్యాక కేంద్రానికి రాష్ట్ర అధికారులు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పూర్తి డేటాను అందజేయనున్నారు.