Cyclone : ముంచుకొస్తున్న మరో తుపాను ముప్పు

గులాబ్ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి తెలుగు రాష్ట్రాలు ఇంకా కోలుకోకముందే మరో తుపాను ముంపు పొంచి ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి.

Cyclone : ముంచుకొస్తున్న మరో తుపాను ముప్పు

Cyclone

Another cyclone threat : గులాబ్ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి తెలుగు రాష్ట్రాలు ఇంకా కోలుకోకముందే.. మరో తుపాను ముంపు పొంచి ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. అల్పపీడనం మరింతగా బలపడి..తుపానుగా మారే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఈ తుపానుకు జావద్‌గా నామకరణం చేశారు. జావద్ తుపాను.. పశ్చిమవాయువ్య దిశగా ప్రయాణించి…నాలుగైదు రోజుల్లో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 13 లేదా 14న తీరం దాటే అవకాశం ఉందని ప్రస్తుతానికి అంచనాలున్నాయి.

తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు పడనున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. నిన్న హైదరాబాద్‌లో కుంభవృష్టి కురిసింది. ఆగకుండా కురిసిన వర్షానికి రోడ్లు నీట మునిగాయి. కాలనీలు జలమయమయ్యాయి. నాలాలూ, డ్రైనేజీలు, రహదారులు ఏకమయ్యేసరికి లోతట్టుప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వాన నీరు చేరింది.

Rain : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌లో రికార్డు స్థాయిలో 13.68 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. కుర్మగూడలో 10 సెంటీమీటర్లు, మహేశ్వరం మండలం పారిశ్రామిక ప్రాంతంలో 9, సౌత్‌ హస్తినాపురం ప్రాంతంలో 8.83, మలక్‌పేటలో 8.7, సరూర్‌నగర్‌లో 8.6, కంచన్‌బాగ్‌లో 8.4, బహదూర్‌పురాలో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అల్మాస్‌గూడ చెరువు కట్ట తెగింది. సరూర్‌నగర్‌ తపోవన్‌ కాలనీకి చెందిన 37 ఏళ్ల జగదీశ్‌.. చింతలకుంట వద్ద నాలాలో పడిపోయాడు. చివరకు తాడు సాయంతో బయటపడ్డాడు. చంపాపేట్‌లోనూ ఓ వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడిపోతే స్థానికులు రక్షించారు.

నిన్న రాత్రి దంచికొట్టిన వర్షానికి శంషాబాద్‌ గగన్‌పహాడ్‌లో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్‌ నుంచి బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. భారీ వర్షానికి అప్పా చెరువుకు వరద ఉద్ధృతి బాగా పెరిగింది. దీంతో అప్పా చెరువు నుంచి హైవేపైకి వరద నీరు చేరింది. ఆరాంఘర్‌ టూ శంషాబాద్‌ వెళ్లే దారిలో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జాం అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.